'పుల్లన్న' అవుట్‌...'గొట్టిపాటి' ఇన్‌...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పుల్లన్న' అవుట్‌...'గొట్టిపాటి' ఇన్‌...!

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటు అధికారపక్షం..అటు ప్రతిపక్షం రాబోయే ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని..ఎలాగైనా గెలుపొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు అన్ని హంగులను సమీకరించుకుంటున్నాయి. ప్రతిపక్ష వైకాపా నాయకుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సుధీర్ఘపాదయాత్రతో ప్రజల దగ్గరకు వెళుతుండగా...అధికారపక్షం కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీ పరంగా చేయాలని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదేసమయంలో ప్రభుత్వంలో మార్పులు..చేర్పులు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నికల క్యాబినెట్‌ను రూపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల తరువాత రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఓ సీనియర్‌ మంత్రిని రాజ్యసభకు పంపాలని, అదే సమయంలో మంత్రివర్గంలో అంతగా ఫలితాలు సాధించని మంత్రులను ఇంటికి పంపాలని ఆయన భావిస్తున్నారట. వారి స్థానంలో సమర్థులు,నిజాయితీపరులైన వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కనీసం ఐదు నుంచి ఆరుగురిని తప్పించి, వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

   తెలుగు సంవత్సరాది ఉగాది నాడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఈ విస్తరణలో ప్రకాశం జిల్లా 'అద్దంకి' ఎమ్మెల్యే 'గొట్టిపాటి రవికుమార్‌'కు స్థానం కల్పిస్తారని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 'గొట్టిపాటి' వైకాపా నుంచి గెలిచి టిడిపిలో చేరారు. వివాదరహితుడు, సమర్థుడు, నిజాయితీపరుడైన 'రవి'కి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే..ప్రకాశం జిల్లాల్లో పార్టీకి మంచి ఊపు వస్తుందని ఆయన భావిస్తున్నారట. 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన 'గొట్టిపాటి'కి స్థానం కల్పించి అదే సమాజికవర్గానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి 'పత్తిపాటి పుల్లారావు'ను తొలగించాలని సిఎం ఆలోచిస్తున్నారట. గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే 'పత్తిపాటి'ని తొలగిస్తారని బలంగా వార్తలు వచ్చినా..ఆఖరు నిమిషంలో ఆయన తొలగింపును ముఖ్యమంత్రి వాయిదా వేశారు. వ్యవసాయమంత్రిగా 'పుల్లారావు' సమర్థవంతంగా పనిచేయలేదని, ఆయన కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో కలుగ చేసుకుని వివాదాలు సృష్టించారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. అంతే కాకుండా ఆయన కార్యాలయ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా అప్పట్లో ఆయనను పదవి నుంచి తొలగించాలని భావించడానికి మరో కారణం. అయితే ఓ రాజ్యసభ సభ్యుడి ఒత్తిడి, ముఖ్యమంత్రి తనయుడు 'లోకేష్‌' ఒత్తిడితో 'మంత్రి పుల్లన్న' పదవిని కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనను తొలగిస్తారని బలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన 'గొట్టిపాటి రవికుమార్‌'ను తీసుకుంటారని, 'రవి'ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కుమారుడు 'లోకేష్‌' పట్టుబడుతున్నారని తెలుస్తోంది. చిలకలూరిపేటకు పక్కనే ఉన్న 'అద్దంకి' నియోజకవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే అటు ప్రకాశం ఇటు గుంటూరు జిల్లాల్లో 'రవి' దూసుకుపోగలరని తండ్రీకొడుకులు ఆలోచిస్తున్నారట. అంతే కాకుండా...'రవి'కి బద్దవ్యతిరేకి అయిన 'బలరాం'కు పాఠం నేర్పడం కోసమైనా ఆయనకు పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా 'గొట్టిపాటి'కి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

'పల్నాడు' ప్రాంతానికి మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా..?

కాగా మంత్రి వర్గం నుంచి 'పత్తిపాటి పుల్లారావు'ను తప్పిస్తే...ఆయన స్థానంలో 'పల్నాడు'కు చెందిన శాసనసభ్యులకు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు 'గోనుగుంట్ల ఆంజనేయులు', గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు'లకు అవకాశం ఉంటుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన 'పల్నాడు'లో పార్టీకి మంచి పట్టు ఉన్నా..అధికారిక పదవులు దక్కడం లేదనే అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా వినుకొండ,మాచర్ల,గురజాల ప్రాంతాలకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ సారి ఈ ప్రాంత శాసనసభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే రాజకీయంగా కీలకమైన తెనాలి,పొన్నూరు నియోజకవర్గాలను వదులుకుని 'పల్నాడు'కు అవకాశం లభిస్తుందా..? అనే ప్రశ్న వస్తోంది. అయితే వెనుకబడిన ప్రాంతానికి న్యాయం చేయాలని సిఎం భావిస్తున్నారని, 'ఆంజనేయులు, యరపతినేని'ల్లో ఎవరికో ఒకరికి పదవి లభిస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం...మరి ఏమి జరుగుతుందో..!?

(7291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ