టిడిపిలోకి 'కన్నా'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలోకి 'కన్నా'...!

ఆయన ఆది నుంచి కాంగ్రెస్‌ వాది. పైగా వై.ఎస్‌కు వీరాభిమాని...! వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో ఒకప్పుడు ఆయన మాటకు ఎదురే లేదు. స్వంత పార్టీ నాయకులు కూడా ఆయన దెబ్బకు హడలెత్తిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు కురిపించడం ఆయనకు హాబీ..! జిల్లాలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకుని చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ..కాలం ఒకేలా ఉండదు..కదా....! కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆయన ఫేట్‌ మారిపోయింది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీపై జనాగ్రహం చూసిన ఆ నాయకుడు ఎన్నికల తరువాత ప్లేట్‌ ఫిరాయించారు. అధికార బిజెపిలో చేరిపోయి..తనను తాను రక్షించుకున్నారు..ఇంతకీ ఆయనెవరంటారా...? ఆయనే మాజీ మంత్రి 'కన్నా లక్ష్మీనారాయణ'.

   'కన్నా' బిజెపిలోకి ఫిరాయించిన దగ్గర నుంచి ఆయనకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. పార్టీలో చేరడంతోనే ఆయనకు రాష్ట్ర అధ్యక్షపదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి రాలేదు.అయితే ఆయనకు మాత్రం మంచి ప్రాధాన్యతనే ఇచ్చారు. పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత చూసుకుని ఆయన అధికార టిడిపిపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తోన్న నిధులను టిడిపి ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడంలేదని, లెక్కలు చెప్పడం లేదని, ఇలా అయితే తాము పొత్తు వదిలేసుకుంటామని ప్రగల్బాలు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తమంత నాయకులు ఆంధ్రాలో లేరని చెప్పుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ప్రాజెక్టులపై ఎప్పుడూ మాట్లాడని 'కన్నా' సిఎంపై జోరుగా విమర్శలు కురిపించారు. అయితే గత నాలుగేళ్ల బిజెపి పాలన చూసి...వారి పుట్టిమునుగుతుందని భావించిన 'కన్నా' ఇప్పుడు పార్టీ మారాలని భావిస్తున్నారట. 

  ఇటీవల కాలంలో ఆయన 'వైకాపా'కు వెళతారని ఆయన సన్నిహితులు లీకులు ఇచ్చారు. అయితే 'జగన్‌పాదయాత్ర'కు వస్తోన్న స్పందన చూసి..ఆయన ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట. వైకాపాలోకి వెళితే...తాను మళ్లీ ఓడిపోతానని..అధికార టిడిపిలో చేరాలని భావిస్తున్నారట. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుపై పదే పదే విమర్శలు గుప్పించిన 'కన్నా'ను పార్టీలోకి తీసుకోవడానికి అధిష్టానం అంగీకరించదని గుంటూరు జిల్లా నాయకులు చెబుతున్నారు. మొన్న కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్ననిర్ణయంతో తమ జాతి కోసం 'చంద్రబాబు' ఇంత చేస్తే తాము టిడిపిలోకి వచ్చి ఆయనకు మద్దతు ఇస్తామని చెబుతున్నారట. అయితే ఆయన ఏం చేసినా..ఆయనను టిడిపిలోకి తీసుకోరని అధినేత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ నేత కన్నా 'చంద్రబాబు'ను ఎక్కువ తిట్టినవాళ్లు టిడిపిలో ఉన్నారని, అదే విధంగా 'తమ' నేతను కూడా టిడిపిలో చేర్చుకుంటారని 'కన్నా' అనుచరులు చెప్పుకుంటున్నారట. మొత్తం మీద 'కన్నా' కూడా టిడిపిలోకి వస్తే..గుంటూరు జిల్లాలో ఎన్నికలు ఏకపక్షం కావడం ఖాయం.  


(589)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ