'జగన్‌' బాటలో 'మోడీ'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' బాటలో 'మోడీ'...!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు బిజెపి అగ్రనేతలు 'మోడీ,అమిత్‌షా'లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. నాలుగు మాసాల క్రితం ఈ ఎన్నికలను ఈ ద్వయం చాలా సులువుగా భావించింది. మరోసారి ఇక్కడ కాషాయి జెండా ఎగురడం ఖాయమని వారిద్దరితో పాటు దేశంలో ఎక్కువ మంది భావించారు. అయితే అనూహ్యంగా గత నాలుగు నెలల నుంచి బిజెపి గ్రాఫ్‌ అమాంతం పడిపోతూ వస్తోంది. మొన్న మొన్నటి దాకా ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులైన బిజెపికి కాంగ్రెస్‌ మధ్య వ్యత్యాసం దాదాపుగా 28శాతం ఉండేది. కానీ..ఈ రోజు వచ్చిన సర్వేలో వారి మధ్య వ్యత్యాసం లేదని చేరో 43శాతం ఓట్లు సాధించబోతున్నారని తేలింది. దీంతో అవాక్కవడం బిజెపి వంతు అయింది. కేవలం నాలుగు మాసాల్లో ఇంత శాతం ఓట్లు కోల్పోవడం బిజెపి నేతలకు మింగుడుపడడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఇంతగా పుంజుకుని తమను ఇబ్బందులు పెడుతుందని వారు అనుకోలేదు. కానీ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌ రేసులోకి వచ్చి..నువ్వా..నేనా..అన్నట్లు విజృంభిస్తోంది. దీంతో ఇప్పుడు ఇక్కడ గెలుపు బాధ్యత మొత్తం ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలపై వేసుకోవాల్సి వచ్చింది.

'నంద్యాల'కు..గుజరాత్‌కు సామీప్యత...!

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నిక..ఇప్పుడు గుజరాత్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పొంతన ఉంది. నంద్యాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వకముందు..ప్రతిపక్ష వైకాపా ఆ స్థానాన్ని గెలుచుకోవడం చాలా సులువని అటు రాజకీయపార్టీలు, ఇటు రాజకీయవిశ్లేషకులు, సర్వే సంస్థలు భావించి ఆ మేరకు ఆ సీటు వైకాపాదేనని తీర్మానించాయి. కానీ..ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన  తరువాత అధికార టిడిపి అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. కేవలం మూడు నెలల్లోనే వైకాపా ఆధిపత్యాన్ని కరిగించి...తనలోటును భర్తీ చేసుకోవడమే కాకుండా భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇప్పుడు అదే పరిస్థితి గుజరాత్‌లో 'బిజెపి' ఎదుర్కొంటుంది. నంద్యాల ఎన్నికలకు ముందు వైకాపాకు ఎంత మేరకు ఆధిపత్యం ఉండేదో..గుజరాత్‌లో కూడా నాలుగు నెలలు ముందు బిజెపికి అదే విధమైన ఆధిపత్యం ఉంది. కానీ గత మూడు నెలల నుంచి వారి ఆధిపత్యం అనూహ్యంగా క్షీణిస్తూ వచ్చింది. దీంతో 'నంద్యాల' ఎన్నికల పరిస్థితి ఇప్పుడు గుజరాత్‌లో కనిపిస్తుందని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

   అదే విధంగా ఇక్కడా మరో సామీప్యత కూడా కనిపిస్తోంది. అదేమంటే...'నంద్యాల' ఎన్నికల సమయంలో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌,జగన్‌ తన పనులను మొత్తం పక్కన పెట్టి...వరుసగా 18 రోజులు పాటు ఇక్కట ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించమని కోరారు. కనిపించిన ప్రతి ఓటర్నీ అభ్యర్ధించారు. అయితే ఫలితం ఎలా ఉన్నా..ఆయనమాత్రం కష్టపడి 18రోజుల పాటు నంద్యాల్లో ఇళ్ళు ఇళ్లు తిరిగారు. ఇప్పుడే అదే రీతిలో ప్రధాని 'మోడీ' కూడా పార్లమెంట్‌ సమావేశాలను కూడా వాయిదా వేసుకుని 'గుజరాత్‌'లో వీధి వీధికి తిరుగుతున్నారు. దాదాపు 60చోట్ల ప్రధాని మోడీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి బిజెపి నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి తోడు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా..కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ శ్రమకోడుస్తున్నారు. వీరందరూ ఎలా ప్రచారం చేసినా..'మోడీ' మాత్రం గుజరాత్‌లో వీధి వీధి తిరిగి తమ అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నారు. మరి 'నంద్యాల'ల్లో 'జగన్‌' సాధించిన ఫలితానే 'మోడీ' చవిచూస్తారా..? ఏమో..ఈ నెల18వ తేదీ వరకు వేచి చూడాల్సిందే...!


(1555)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ