నమ్మినోళ్లే నట్టేట ముంచారు...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నమ్మినోళ్లే నట్టేట ముంచారు...!

ఐదుకోట్ల ఆంధ్రులను బీజేపీ-టీడీపీలు నిలువునా ముంచేశాయి.  ఆంధ్రుల  పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూపుతున్న వివక్షలో ఆంధ్రులు నమ్మి అధికారం అప్పగించిన  తెలుగుదేశం పార్టీకి భాగస్వామ్యం ఉంది. మూడున్నరేళ్లు గడిచిపోయినా  నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా సహా విభజన చట్టం హామీలను అమలు చేయని నయవంచిత నరేంద్ర మోడీ సర్కారుతో అంట కాగడానికి గల అవసరం ఏమిటో  టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యావత్‌ ఆంధ్ర ప్రజానీకానికి స్పష్టం చేయాలి.తల్లిని చంపి బిడ్డను బైటకు తీశారంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనపై  తిరుపతి వెంకన్న సాక్షిగా వ్యాఖ్యలు చేసిన  నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఒక రాజ్యానికి రాజులా, నియంతలా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పి కొత్త రాజధానికి శంకుస్థాపన చేసి  ఓ ముంతలో నీరు, మరో ముంతలో మట్టి తెచ్చిచ్చిన ఔదార్యం ఆయనది.

   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏ పరిస్థితిలో విభజించబడింది?  అనంతరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే రాజధాని నగరాన్ని కోల్పోయి  13 రాష్ట్రాలతో మిగిలిన  నవ్యాంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటో ఆయనకు, ఆ పార్టీ నాయకులకు తెలియదా? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... పదేళ్లు కావాలని డిమాండ్‌ చేసింది మీరు కాదా?  ''రాబోవు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే... నవ్యాంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా ఆదుకుంటాం'' అంటూ ప్రగల్బాలు పలికింది మీరు కాదా?  ఇప్పుడెందుకు వివక్ష చూపుతున్నారు? రాష్ట్రానికి చేకూరాల్సిన ప్రయోజనాలపై కొర్రీలు పెడుతూ ప్రతిదానికి ఎందుకు మోకాలడ్డుతున్నారు?  విభజన చట్టాన్ని చదవకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు మద్దతు పలికారా?   ఆంధ్రులకు ఏదీ ఇవ్వనికాడికి ఆరోజున విభజనకు ఎందుకు అంగీకరించారు?  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సొంతంగా మెజారిటీ సాధించడం, ఆంధ్రా ఎంపీల అవసరం లేకపోవడం మూలంగానే ఇప్పుడు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.  పదహారు వేల కోట్ల ఆర్థిక లోటు భర్తీ చేయడానికి,  ప్రత్యేక ¬దా ఇవ్వడానికి కుంటిసాకులను అడ్డంకిగా చూపారు. హోదాకు బదులు ఇస్తామన్న  ప్రత్యేక ప్యాకేజీకి అతీగతీ లేదు.  విశాఖకు రైల్వే జోన్‌ ప్రతిపాదన అటకెక్కింది. విద్యాసంస్థలు శంకుస్థాపనలకు, కాగితాలకే పరిమితమయ్యాయి. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం కుదరదని చెప్పారు. చివరకు ఆంధ్రుల జీవనాడి పోలవరం  ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆంధ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.  మోడీ సర్కారు గత  నాలుగేళ్లలో   నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా  చేసిన సాయమంటూ ఏమీ లేదు.  అటూ ఇటూగా అన్నీ కలిపి  పదివేల కోట్ల రూపాయలు కూడా విదల్చలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు మాత్రం  ఇబ్బడి ముబ్బడిగా నిధులు కుమ్మరిస్తున్నారు.

     ఈ పరిస్థితిలో బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు ఏం చేయాలి? యావత్‌ రాష్ట్ర ప్రజల మద్దతుతో కేంద్రం మెడలు వంచేందుకు పోరాడాలి. కానీ వాస్తవంలో అది జరగడం లేదు. ముఖ్యమంత్రి  నెలకోసారి ఢిల్లీకి వెళ్లి  సాహో మోడీ రాజా అంటూ బిచ్చమెత్తుకుంటున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారు.   కేంద్రం నుండి ఆశించిన సహకారం అందడం లేదంటూ  సన్నాయి నొక్కులు నొక్కుతారే గానీ ఒక హక్కుదారుగా  ప్రశ్నించ లేరా?  ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు.. ప్రత్యేక ప్యాకేజీతో మెరుగైన ప్రయోజనాలు చేకూరతాయని  ప్రజలను బుకాయించారు. ఆర్థిక లోటు భర్తీ చేయకపోయినా, విశాఖ జోన్‌ రాకపోయినా కిమ్మనలేదు. ఎందుకు ఈ అధైర్యం.. అభద్రత.. రాష్ట్ర హక్కులు సాధించుకోవడంపై దృష్టి పెట్టకుండా మూడున్నరేళ్లుగా మోడీ సర్కారును వెనకేసుకొస్తూ  ప్రత్యేకించి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణంపై ప్రజలను భ్రమల్లో ముంచి తేల్చుతూ ఆంధ్రాకు వచ్చిన కేంద్రమంత్రులు తనపై కురిపిస్తున్న పొగడ్తలతో ఉబ్బితబ్బిబవుతున్నారు. రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలోకి దించేసారు.  అప్పులు చేసుకోవడానికి అనుమతులిమ్మని కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చారు గానీ హక్కుల గురించి మర్చిపోయారు. చివరకు పోలవరం పనులు ఆపేయాలని కేంద్రం హుకుం జారీ చేయడంతో  ప్రజల సానుభూతి కోసం అసెంబ్లీలో గోడు వెళ్ల బోసుకున్నారు.. రేపో మాపో మోడీని కలిసి మాట్లాడతానని చెప్పారు.  గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకున్న ప్రతిసారీ ఢిల్లీ వెళ్లి  చంద్రబాబు సాధించినదేమిటో అందరికీ తెలిసిందే. యావత్తు రా ష్ట్ర  ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టిన అంశంపై స్పందించే విధానం ఇదేనా?  40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత కనీసం అఖిల పక్షాన్ని కూడా సమావేశపర్చలేదు. వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగి, ఎన్‌డీఏకు రాం..రాం చెప్పి  వుంటే మోడీ సర్కారుకు కాస్తో కూస్తో కాక తగిలేది. కనీసం బెదిరించడం కూడా చేతకానంత బలహీనతలో బాబు ఉన్నారా? లేకుంటే మోడీ ఐటీ అధికారులతో దాడులు చేయిస్తారని, ఓటుకు నోట్లు కేసు తిరగదోడిస్తారని భయపడుతున్నారా?   ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించేందుకు కూడా  చంద్రబాబు  ప్రతిపక్షాల మాటను పెడ చెవిన పెట్టి మోడీ సర్కారుకు జైకొట్టారు.  ఆయన అనుసరిస్తున్న  ఒంటెత్తు పోకడల వల్ల కూడా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది.

     ఎందుకీ మెతక వైఖరి? ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారో అర్థం కానంత గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి.  ఇందుకు కారణం ముమ్మాటికీ టీడీపీ-బీజేపీల మధ్య ఏర్పడిన  అనుమానాలు, పొరపొచ్చాలేనని  ప్రజలు గ్రహించారు.  దక్షిణాదిలో అందునా ఆంధ్రాలో బలహీనంగా ఉన్న బీజేపీకి రాజకీయ అవసరాలే కావచ్చు... చంద్రబాబు సర్కారుపై ముసురుకున్న అవినీతి ఆరోపణలే కావచ్చు.. అవినీతి ముడుపుల పంపిణీలో విభేదాలే కావచ్చు..  ఏది ఏమైనా విభజనానంతరం 13 జిల్లాలతో  మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్‌కు చట్ట ప్రకారం దక్కాల్సిన  ప్రయోజనాలు, హక్కులను కాలరాసే అధికారం మోడీ సర్కారుకు లేదు. టీడీపీ అవినీతికి పాల్పడుతున్నదని భావిస్తే.. రాజధాని నగరం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టవచ్చు కానీ కోట్లాదిమంది జీవితాలతో చెలగాటమాడటం దారుణం.  

    రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర ప్రజా సంస్థలు, సమితులు ఉద్యమిస్తున్నప్పటికీ  ఆంధ్రులు అందలం ఎక్కించిన అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపా బాధ్యతలను విస్మరించి సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నాయి.  ఈ రెండూ కూడా ప్రాంతీయ పార్టీలు కావడం ఒక వ్యక్తి కనుసన్నల్లో నడిచేవి కావడం వల్ల వారి వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మోడీ సర్కారుకు జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని నేను చెప్పడం కాదు.. ప్రజలు చెబుతున్నమాట.  వీరి బలహీనతలను అడ్డం పెట్టుకుని వ్యవహరిస్తున్న మోడీ .. 2019లో జరిగే సాధారణ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చేందుకు  ఈ రెండు పార్టీల నుంచి ఎన్నికయ్యే ఎంపీలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారే గానీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో  తాము నమ్మిన ఓట్ల్ణ్ణేసిన పార్టీల వైఖరిని ఆంధ్రులు అసహ్యించుకుంటున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.  ఇందుకోసం   టీడీపీ-బీజేపీ-వైఎస్సార్‌సీపీ యేతర శక్తులన్నీ ఏకమయ్యి ఉద్యమిస్తే నియంతృత్వ మోడీ సర్కారు దిగి రాక తప్పదు.

- కొలనుకొండ శివాజీ,ఏపీసీసీ అధికార ప్రతినిధి

ఫోన్‌ : 9866200463


 
(328)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ