వినుకొండ రాజకీయాల్లో స్తబ్దత...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వినుకొండ రాజకీయాల్లో స్తబ్దత...!

రాజకీయ చైతన్యం అధికంగా గల జిల్లాగా గుంటూరు జిల్లాకు పేరుంది. మహామహులైన ఎందరో రాజకీయవేత్తలు ఈ జిల్లా నుంచి రాజకీయాల్లో రాణించారు. ఏ పార్టీకీ సంపూర్ణ అధికారం ఇవ్వకుండా..ప్రతిపక్షానికి కనీసం సీట్లు ఇస్తూ...రాజకీయ పరిణితికల ప్రజలు ఉన్న ప్రాంతంగా పేరుగాంచింది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో దూసుకుపోయిన రోజుల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ప్రజాప్రతినిధులను జిల్లా ప్రజలు అసెంబ్లీకి పంపారు. అదే విధంగా 2004లో కాంగ్రెస్‌ హవా వీచిన రోజుల్లో కూడా టిడిపి నుంచి ప్రజాప్రతినిధిని అసెంబ్లీకి పంపారు జిల్లా ప్రజలు. అటు వంటి రాజకీయ పరిణితి కలిగిన ఈ జిల్లాలో ప్రస్తుతం రాజకీయంగా స్తబ్ధుగా ఉంది. ముఖ్యంగా 'పల్నాడు' ప్రాంతంలో రాజకీయం నీరసంగా ఉంది. అందుకు ప్రధాన కారణం...ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ప్రతిపక్ష పాత్రను పోషించకుండా మౌనంగా ఉండడమే. 'పల్నాడు' ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో ఒకటైన 'వినుకొండ'లో రాజకీయ స్తబ్దత మరీ ఎక్కువగా ఉంది.

   ప్రధాన పార్టీలైన తెలుగుదేశం,కాంగ్రెస్‌ల జిల్లా అధ్యక్షులుగా ఈ నియోజకవర్గ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ప్రధాన పార్టీ అయిన వైకాపాకు కూడా ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. అయినా గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి రాజకీయాలన్నీ అధికారపార్టీచుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం నామ మాత్రంగా పనిచేస్తూ ఉంది. దీంతో అధికార టిడిపి ఆడిందే..ఆట..పాడిందే పాట అన్నట్లు వ్యవహారాలు నడుస్తున్నాయి. అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, సామాజికసేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలను నిజాయితీగా నిర్వహించడం ఆయనకు కలసివస్తోంది. అదే సమయంలో ఆయన కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ప్రజల్లో తిరుగులేని ముద్ర వేశాయి. అయితే ఆయన మొక్కుబడిగా రాజకీయాలు నిర్వహిస్తున్నారనే అప్రదిష్ట వస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని, ఆయన చుట్టూ కోటరీ చేరి...వారు చెప్పిందే ఆయన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఉన్నా ఆయన పెద్దగా స్పందించడం లేదని, అదే సమయంలో వెనుకబడిన ప్రాంతమైన 'వినుకొండ'లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమయ్యారనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అంతే కాకుండా ఆయన వ్యక్తిగత సహాయకులు టిడిపి నాయకులను,కార్యకర్తలను దూషిస్తున్నారని, వైకాపాకు చెందిన వారికి పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

  ఆయన వ్యక్తిగత సిబ్బంది చేసే అరాచకం వల్ల నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరుల్లో మెల్లమెల్లగా అసంతృప్తి పెరిగిపోతోందని, ఇది చాపకింద నీరులా ఉంది. వ్యక్తిగత సిబ్బంది కార్యకర్తలతో, సానుభూతిపరులతో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలుసార్లు ఎమ్మెల్యే ఆంజనేయులకు పలువురు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. దీనిపై టిడిపి వర్గాలు అసంతృప్తితో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'మా నాయకుడు చాలా మంచి వ్యక్తి..కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయనను మించిన వారు లేరు..! ఎవరు ఆపదలో ఉన్నా సహాయం చేస్తారు..వ్యక్తిగతంగా పరామర్శలు చేస్తారు..! కానీ..ఆయన వ్యక్తిగత సిబ్బంది చేసే అక్రమాలను ఆయన నివారించలేకపోతున్నారు..! వారిని అదుపులో ఉంచితేనే ఆయనకు మంచిది. లేకపోతే..ఈ అసంతృప్తి పెరిగి పెద్దదయి ఆయనను దెబ్బతీస్తుందని' పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ నాయకుడు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధి'తో వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నియోజకవర్గంలో సాగునీటి సమస్య వల్ల ఎక్కువ మంది రైతులు వలసలు వెళుతున్నారని, వలసలను నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదే విధంగా నిరుద్యోగులైన యువకులకు ఉపాధి దొరకడం లేదని, ఈ సమస్యపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా...ప్రజల్లో అసంతృప్తి పెరిగితే మొదటికే మోసం వస్తుంది. ఆ సంగతి పాలకులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

   కాగా నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా పరిస్థితి అంతుబట్టని రీతిలో ఉంది. వైకాపా సమన్వయకర్తగా 'బొల్లా బ్రహ్మనాయుడు' గత మూడున్నరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన ప్రజల్లో పట్టుసాధించలేదని స్వంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గత ఎన్నికల్లో 'పెదకూరపాడు' నుంచి పోటీ చేసి ఓడిపోయిన 'బ్రహ్మనాయుడు'ను తరువాత 'వినుకొండ' నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. గత ఎన్నికలకు ముందు తనకు 'వినుకొండ' టిక్కెట్‌ ఇవ్వాలని 'బ్రహ్మనాయుడు' ఎంత కోరినా ఇవ్వకుండా..పెదకూరపాడు పంపడం..ఇక్కడ..'నన్నపునేని సుధ'ను పోటీ చేయించడం 'బ్రహ్మనాయుడు'కు అసంతృప్తి కల్గించింది. కానీ..అప్పట్లో వైకాపా గెలుస్తుందనే భ్రమలతో ఆయన సర్దుకుపోయారు. తరువాత వినుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నా అంత చురుగ్గా పనిచేయడం లేదు. ఆయన పనిచేయకపోవడానికి లోనలోన నాయకత్వంపై ఉన్న అసంతృప్తి ఒక కారణం కాగా..మళ్లీ ఎన్నికల నాటికి టిక్కెట్‌ తనకే వస్తుందనే నమ్మకం లేక. దీంతో నియోజకవర్గంలో పార్టీకి బలం ఉన్నా..వారిని సరైన దారిలో నడిపించే నాయకుడు కనిపించడం లేదు. దీంతో ఇక్కడ వైకాపా ఉందా..? లేదా..అన్న అనుమానం కల్గుతోంది. ఇది ఇలా ఉంటే ఒకప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన 'మక్కెన మల్లిఖార్జునరావు' పరిస్థితి ఏమిటో ఆయన అనుచరులకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా..అక్కడే కొనసాగుతారనే నమ్మకం వారికి లేదు. ఆ పార్టీ తరపున పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. అదే సమయంలో టిడిపి,వైకాపాలో చేరదామంటే..ఇప్పటికే ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. దాంతో ఆయన ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నారు. అయితే ఆయనకు వైకాపా టిక్కెట్‌ లభిస్తుందని, త్వరలో ఆయన ఆ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రాజకీయగురువైన 'కాసు కృష్ణారెడ్డి' తనయుడు 'కాసు మహేష్‌' వైకాపాలో ఉండడంతో 'మక్కెన' కూడా ఆ గూటికి చేరతారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఏది ఏమైనా మూడు ప్రధాన పార్టీలు వినుకొండలో స్తబ్ధుగా ఉండడం మాత్రం విశేషమే...!

(3870)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ