'కాపు'ల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న 'మోడీ'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాపు'ల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న 'మోడీ'...!

ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు ఇప్పటికే చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ఆయన తనకురాజకీయ ప్రయోజనం ఉంటేనే ఆయా రాష్ట్రాల వైపు చూస్తున్నారని, ఒక వేళ రాజకీయ ప్రయోజనం లేదనుకుంటే...వాటి మానాన వాటిని వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. న్యాయంగా చేయాల్సిన సహాయం కూడా ఆయన చేయడం లేదని ఆయా రాష్ట్రాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఆయన ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేదని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాను కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని 'తిరుపతి' వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన ఆయన ఆ హామీలను మరిచిపోయి..రాష్ట్రం పట్ల వివక్షను చూపుతున్నారనే ఆరోపణలు టిడిపితో పాటు ఇతర రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ..కాపుల రిజర్వేషన్‌ బిల్లుకు ఆయన అడ్డం పడబోతున్నారని నిన్న గుజరాత్‌లో ఆయన చేసిన ప్రసంగం వల్ల తేటతెల్లం అవుతుంది.

  దశాబ్దాల పాటు తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న 'కాపుల' కోరిన కోర్కెను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే నెరవేర్చారు. వారికి ఐదుశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలు,బిసిలకు, ముస్లింలకు కలపి 50శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు 50శాతం మించితే చెల్లవు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఇవ్వాలని రాష్ట్రం భావిస్తే..వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలి. ఇప్పుడు ఈ చట్టాన్ని తాము చేయమని 'మోడీ' పరోక్షంగా చెబుతున్నారు. నిన్న గుజరాత్‌లోని ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ 50శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని...వాటిని తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలను గుజరాత్‌లోని పాటిదార్లను ఉద్దేశించి చేశారని భావించినా..ఆయన వ్యాఖ్యలు దేశ మొత్తానికి వర్తిస్తాయి. గుజరాత్‌లో పాటిదార్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నారు. వారి ఉద్యమాలను గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. దాంతో ఇప్పుడు వారందరూ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ రేపు కాంగ్రెస్‌ను పాటిదార్లు గెలిపించినా..తాను కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయనని, ఆయన పరోక్షంగా పాటిదార్లను బెదిరిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని 'కాపుల'కు కూడా వర్తిస్తుంది. తెలంగాణలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కెసిఆర్‌కు కూడా ఇది ఇబ్బందే. దీంతో ఈ విషయంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పిస్తే..వాటిని ఆమోదించమని కేంద్రం చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనా..ఇప్పుడు చంద్రబాబు కల్పించిన రిజర్వేషన్లు ఆగిపోతే అందుకు 'మోడీ'దే బాధ్యత అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.  

(551)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ