లేటెస్ట్

‘కెసిఆర్‌’ పార్టీలో చేరే ‘ఆంధ్రా’ నాయకులు ఎవరు...?

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు జాతీయపార్టీని ప్రారంభించేందుకు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. దసరా రోజున తన జాతీయ పార్టీని ప్రకటిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి బలం చేకూరుస్తూ ఈ రోజు తన పార్టీ నాయకులతో సమావేశం అయి జాతీయపార్టీని ప్రారంభించబోతున్నట్లు, దాని గుర్తింపుకోసం కొంత మంది నాయకులను దసరా తరువాత ఢల్లీికి పంపించి రిజిస్ట్రేషన్‌ చేయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కెసిఆర్‌ పార్టీ పేరును కూడా నిర్ణయించారని, దాదాపు 200పేర్లను ఎంపిక చేసి ఫైనల్‌గా ‘భారతీయ రాష్ట్ర సమితి’ అని పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. దసరా రోజున ఈ పేరును ఆయన లాంఛనంగా ప్రకటిస్తాడంటున్నారు. మొత్తం మీద గత కొన్నాళ్లుగా ‘కెసిఆర్‌’ చేస్తోన్న హడావుడి చివరకు కార్యరూపం దాల్చబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణ రాజకీయాల్లో ‘కెసిఆర్‌’కు ఎదురే లేకుండా పోయింది. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపొందింది. అయితే రెండోసారి ఆయన పార్టీ గెలిచిన తరువాత ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బిజెపి తెలంగాణలో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకే ‘కెసిఆర్‌’ జాతీయ పార్టీని ప్రారంభించారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదంతా బిజెపి ఆడిస్తున్న నాటకం అనే మాట కూడా వివిధ పార్టీల నాయకుల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడానికే ‘బిజెపి’ ఆయనతో పార్టీ పెట్టిస్తోందని, వివిధ రాష్ట్రాల్లో 1 నుండి 2 శాతం ఓట్లను ‘కెసిఆర్‌’పొందినా అది బిజెపికి మేలు చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదెలా ఉన్నా..ఆయన జాతీయ పార్టీ ప్రభావం కేవలం తెలంగాణలో మాత్రం ఉంటుందనే భావన ఎక్కువ మందిలో ఉంది. అయితే దీని కంటే ఆసక్తి రేకెత్తించే అంశం ఏమిటంటే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ‘కెసిఆర్‌’ జాతీయ పార్టీకి నాయకత్వం ఎవరు వహిస్తారు..? ఏయే పార్టీలకు చెందిన నాయకులు ఆయన పార్టీలోకి వస్తారు..అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 

నిన్న మొన్నటి వరకు ‘ఆంధ్రా’లో అధికారంలో ఉన్న ‘జగన్‌’తో ‘కెసిఆర్‌’ సన్నిహిత సంబంధాలను నెరిపారు. ఇద్దరూ కలిసి వివిధ అంశాలపై చర్చించుకుంటూ ఒకొరికొకరు సహకరించుకున్నారు. గతంలో అధికారంలో ఉన్న ‘చంద్రబాబు’ను ఓడిరచడానికి ‘కెసిఆర్‌’ ‘జగన్‌’కు బాగా సహకరించారు. ఆర్థికంగా, ఇతరత్రా సహకరాం అందించారు. దాంతో ఎన్నికల తరువాత ‘కెసిఆర్‌’, జగన్‌లు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి విందుభోజనాలు చేసి, ఇరు రాష్ట్రాల అభివృద్థికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటామని, బహిరంగంగా ప్రకటించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, ఉద్యోగుల సమస్యలు, విభజన సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా సచివాలయ భవనాలను ‘కెసిఆర్‌’ అడిగిన వెంటనే ‘జగన్‌’ ఆయకు ఇచ్చేశారు. ఇదంతా నిన్న మొన్నటి వరకే. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య అంత సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ మంత్రులు ఆంధ్రాలో ‘జగన్‌’ పాలనను ఎద్దేవా చేస్తున్నారు. కెసిఆర్‌, కెటిఆర్‌, హరీష్‌రావులు ఇటీవల కాలంలో ‘ఆంధ్రా’లోని ‘జగన్‌’ పాలనపై బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారు. అంతే కాదు..తెలంగాణకూ, ఆంధ్రాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతూ, జగన్‌కు పాలన చేతకావడం లేదని ఎత్తిపొడుస్తున్నారు. అయితే..వారు ఎంత కవ్వించినా..‘జగన్‌’ మాత్రం స్పందించడం లేదు. కేవలం ఆయన మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు. అయితే ఎందుకు కెసిఆర్‌ ఇలా ‘జగన్‌’ను టార్గెట్‌ చేశారనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తనతో ‘జగన్‌’ కలిసిరావడం లేదని, బిజెపికి వ్యతిరేకంగా తాను సాగిస్తున్నపోరుకు సహకరించడం లేదనే కారణంతోనే ‘జగన్‌’ను ‘కెసిఆర్‌’ టార్గెట్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. 

ఇదెలా ఉన్నా ‘కెసిఆర్‌’ స్థాపించే జాతీయ పార్టీలో ‘ఆంధ్రా’కు చెందిన ఏయే పార్టీలకు చెందిన నాయకులు ఆయన పార్టీలో చేరతారు..? అనే దానిపై చర్చ సాగుతోంది. ప్రస్తుత ‘జగన్‌’ పాలనపై అసంతృప్తితో ఉన్న పలువురు వైకాపా నాయకులు ‘కెసిఆర్‌’తో చేతులు కలుపుతారనే ప్రచారం ఉంది. మూడేళ్ల ‘జగన్‌’ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆయనతో ఇక అయ్యేదేమీ లేదని, నెమ్మదిగా వేరే పార్టీని చూసుకుందామనుకునే నాయకులకు ‘కెసిఆర్‌’ ఒక బెటర్‌ ఆప్షన్‌గా కనిపిస్తున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వివిధ కాంట్రాక్టులు చేస్తోన్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఆస్తులు బాగా కూడా బెట్టుకున్న నాయకులు, సినీరంగానికి చెందిన వారు ఆయనతో చేయి కలిపే పరిస్థితి ఉంది. తెలంగాణ, ఆంధ్రా అనే భావన ఇకపై ఉండదని, కెసిఆర్‌ జాతీయ నాయకుడు కనుక, ఆయన పార్టీ కూడా జాతీయ పార్టీ అయినందున ఆయన పార్టీలో చేరితే వచ్చే నష్టం ఏమీ లేదనే భావన వారిలో ఉంది. ఇదే కాకుండా వచ్చే ఎన్నికల్లో దాదాపు వంద మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌ ఇచ్చేది లేదని, ‘జగన్‌’ చెబుతున్నారని, దీంతో ఈ టిక్కెట్‌ రాని వారంతా ముందుగానే ‘కెసిఆర్‌’తో టచ్‌లోకి వెళతారని అంటున్నారు. అదే విధంగా టిడిపికి చెందిన రెబెల్‌ ఎమ్మెల్యేల్లో కొంత మంది కూడా వెళతారని విశ్లేషణలు ఉన్నాయి. రాయలసీమకు చెందిన ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరు, ఆంధ్రా ప్రాంతానికి చెందిన మరో మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు కూడా అదే మార్గంలో ఉంటారనే భావన ఉంది. గతంలో కాంగ్రెస్‌లో ఉండి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేతలు కూడా ‘కెసిఆర్‌’ వెంట నడుస్తారనే అభిప్రాయం ఉంది. మొత్తం మీద ‘కెసిఆర్‌’ జాతీయ పార్టీని ప్రారంభించిన వెంటనే వీరంతా ఆయన పార్టీలో చేరకపోయినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ మళ్లీ విజయం సాధిస్తే, చాలా మంది వైకాపా నాయకులు ఆయన వెంట నడుస్తారనే విశ్లేషణలు వస్తున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ