రాష్ట్రానికి ఐదువేల కోట్లు పెట్టుబడులు:చంద్రబాబు..! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాష్ట్రానికి ఐదువేల కోట్లు పెట్టుబడులు:చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇక్కడ ఉన్న అవకాశాలను ప్రపంచ దేశాలకు వివరిస్తున్నామని, దానిలో భాగంగా 4,5,6 తేదీల్లో దక్షిణకొరియాలో పర్యటించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మూడు రోజుల దక్షిణకొరియా పర్యటన అనంతరం ఆయన ఈ రోజు విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా తన పర్యటన వివరాలను క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. మూడు రోజుల పర్యటన అద్బుతంగా సాగిందని, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్‌ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. మన భౌగోళిక పరిస్థితి, కొరియన్ల భౌగోళిక పరిస్థితులు ఒక విధంగా ఉంటాయని, మానవ వనరులు, ఇతర అంశాలలో పోలిక ఉందని దాని వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వారి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారన్నారు. ఒకప్పుడు దక్షిణకొరియా పేద దేశమని, అయితే కష్టించి పనిచేసి వారు అద్బుతమైన ప్రగతి సాధించారని అన్నారు. మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని కష్టించి పనిచేయాలని ఆయన అన్నారు. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆదేశంలో పలు కంపెనీల ప్రతినిధులతో కలసి చర్చించామని..ఈ సందర్భంగా వారు ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని తెలిపారు.

ఐదువేల కోట్లు పెట్టుబడులు..!

దక్షిణకొరియాకు చెందిన 'కియా' అనుబంధ సంస్థలతో ఒక ఎంవోయూ చేసుకున్నామని, ఈ ఒప్పందంలో భాగంగా 'కియా' అనుబంధ సంస్థలన్నీ కలిపి రూ. 4,995.20 కోట్లు  పెట్టుబడులు పెెట్టనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 'కొరియా ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌'ను ఏర్పాటవుతుందని, దీనిపై బూసన్‌లో జరిగిన బిజినెస్‌ సెమినార్‌లో 'మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌' తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఎంవోయూలో భాగంగా బూసన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ను నెలకొల్పుతుందని తెలిపారు.  దాదాపు 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు 'లెటర్‌ ఆఫ్‌ ఇంటెండ్‌' తీసుకుందని దీని విలువ మూడు వేల కోట్ల రూపాయలని, దీని వల్ల 7,171 ఉద్యోగాలు వస్తాయిని సిఎం వివరించారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని దక్షిణ కొరియాలో భారత రాయబారి దొరైస్వామి కొరియన్‌ పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇచ్చారని ఇది తనకు సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు. 'కియా'కు కేటాయించిన బంజరు భూమిని చదును చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని, అటువంటిది  మూడునెలల్లోనే పనులు పూర్తిచేసిన విషయాన్ని వారు గుర్తించారని, ఈ విషయం తనకు సంతృప్తి కల్గించిందని ముఖ్యమంత్రి తెలిపారు.  వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్‌, ఓడరేవులు, నగరాల అభివృద్ధి వంటి అనేక అంశాలలో పరస్పరం సహకరించుకుందామని బూసన్‌ మెట్రోపాలిటన్‌ సిటీ వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌ ప్రతిపాదించారని తెలిపారు.ఫిషరీస్‌ రంగంలో పుక్యోంగ్‌ నేషనల్‌ యూనివర్శిటీ   ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు వున్న అవకాశాలపై బూసన్‌ వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌తో చర్చించామని తెలిపారు.  పెట్టుబడుల విస్తరణకు ఆంధ్రప్రదేశ్‌ను సరైన స్థానంగా గుర్తించామని 'కియా' సంస్థ ప్రెసిడెంట్‌ హూన్‌ వూ పార్క్‌ చెప్పడం  ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, బూసన్‌, కృష్ణపట్నం పోర్టుల అనుసంధానం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. శ్రీసిటీ సెజ్‌, కాకినాడ 'స్పెషల్‌ ఇన్వెస్ట్మెంట్‌ రీజియన్‌'పై ప్రెజెంటేషన్‌ ఇచ్చామని తెలిపారు.

బూసన్‌ మేయర్‌తో భేటీ : బూసన్‌ మెట్రోపాలిటన్‌ సిటీ మేయర్‌ సుహ్‌ బ్యూంగ్‌ సూతో భేటీ అయ్యామని, అమరావతి-బూసన్‌ మధ్య కొత్త స్నేహం ఉభయతారకంగా ఉండాలని ఆయన తెలిపారు. సిస్టర్‌ స్టేట్‌ రిలేషన్‌కు సిద్ధంగా ఉన్నామని సుహ్‌ బ్యూంగ్‌ సూ చెప్పారని, ఫిబ్రవరిలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు బూసన్‌ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామన్నారు. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, కంటైనర్‌ బిజినెస్‌కు వున్న అవకాశాలను వివరించామని, కృష్ణపట్నం పోర్టును భారత్‌లో తమ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ హబ్‌గా మార్చుకోవాలని భావిస్తున్నట్టు కిమ్‌ తెలిపారు. ఎల్‌జి సంస్థ ప్రెసిడెంట్‌ సూన్‌క్వోన్‌తో సమావేశమయ్యామని ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. వారు స్టోరేజ్‌బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దక్షిణ కొరియాలోని అతిపెద్ద లాజిస్టిక్‌ సంస్థ డార్సిల్‌ డైరెక్టర్‌ బెన్నీ కాంగ్‌తో భేటీ అయ్యాయమని, త్వరలో ఆంధ్రాలో ఏర్పాటు కానున్న లాజిస్టక్‌ యూనివర్సిటీలో భాగస్వామి కావాలని వారిని కోరినట్లు దీనికి ఆయన అంగీకరించినట్లు సిఎం తెలిపారు. లివర్‌, ప్రాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు సంబంధించిన ఔషదాలపై పరిశోధన, ఉత్పత్తిలో పేరుగాంచిన గ్రీన్‌ క్రాస్‌సెల్‌ సంస్థతో చర్చలు జరిపామని తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం కోసం తాము సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారని, ఆయన్ను ఎపికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. విభిన్న వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న 'లొట్టే కార్పొరేషన్‌' ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిందని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సంయుక్త కార్యసాధన బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.


(260)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ