WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోలవరంపై ఇప్పుడు అఖిలపక్షం అవసరం లేదు:బాబు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు, కేంద్రం నుంచి ఆశించిన సహాయం రాకపోవడంపై రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షపార్టీల డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. ప్రస్తుతం కేంద్రం పోలవరం ప్రాజెక్టుపై త్రిసభ్య కమిటీని పంపుతుందని, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును చూసిన తరువాత దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో..తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అవసరం లేదని, అఖిలపక్షం ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదని, అవసరమైనప్పుడు తానే ప్రజలకు ఆ విషయం చెబుతానని ఆయన చెప్పారు. ఒక వైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపూర్తి కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని,మరో వైపు ప్రాజెక్టు నిర్మాణంపై అఖిలపక్షం నిర్వహించాలని వారే డిమాండ్‌ చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తుందని, కేవలం ఆ ఒక్క ప్రాజెక్టే కాదని, పట్టిసీమ, పురుషోత్తంపట్నం, గండికోట ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. 

     కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక వైపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూనే మరో వైపు కేంద్రమే ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నారని, ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీని కలసి ఫిర్యాదులు చేశారని, ఒకవైపు అడ్డంకులు సృష్టిస్తోందీ..వాళ్లే..మళ్లీ అఖిలపక్ష సమావేశం కావాలంటూ డిమాండ్‌ చేసే వాళ్లే..రెండు వైపులా వారే నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు గత రెండు మూడు నెలల నుంచి నత్తనడకన సాగుతున్నాయని, దీనిపై తాను ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. ఒక్కసారి పనులు ఆగిపోతే చాలా నష్టం వస్తుందని, మళ్లీ అక్కడ పనులు నిర్వహించాలంటే చాలా సమయం పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. కాఫర్‌డ్యామ్‌ నిర్మాణంపై ఇంకా స్పష్టత రాలేదని, దీనిపై త్రిసభ్య కమిటీ వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే తన ఉద్దేశ్యమని, కేంద్రం ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. నిర్మాణ కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్‌ 14% తక్కువకు కోడ్‌ చేసిందని, ఇదే ఇప్పుడు కాంట్రాక్టర్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్నారు. అంత తక్కువ ధరకు ఎవరూ పనులు చేయలేరని, దీనిలో తాను కాంట్రాక్టర్‌ను తప్పుపట్టడం లేదని, సమస్యను పరిష్కరించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పోలవరం నిర్మాణానికి ముందు వేసిన అంచనా వ్యయం 9వేల కోట్లు అని అది ఇప్పుడు పది రెట్లు పెరిగిందని, అందుకే కాంట్రాక్టు సంస్థ నష్టాలపాలవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే పోలవరం పనులు 51శాతం పూర్తియ్యాయని, 2018 కల్లా పూర్తిచేయాలని తాను పట్టుదలతో ఉన్నట్లు ఆయన చెప్పారు. పోలవరం ఆంధ్రాకు జీవనాడి అని..దానిని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు.


(156)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ