WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వైకాపా' రాజ్యసభ అభ్యర్థి 'బొత్స'...!

పార్టీ ప్రతిష్టను పెంచాలని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని అష్టకష్టాలు పడుతూ 'జగన్‌' పాదయాత్ర చేస్తుంటే...పార్టీలోని సీనియర్‌ నాయకులు మాత్రం సేఫ్‌ ప్లేస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది 'జగన్‌'పై నమ్మకం లేక అధికార టిడిపిలోకి వెళుతుంటే..మరో వైపు దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే కోరికతో, ఉన్నకాటికి లాభపడాలన్న ధ్యేయంతో కొందరు పావులు కదుపుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ నాయకుడు 'బొత్స సత్యనారాయణ' తన దోవ తాను చూసుకుంటున్నారట. ఆయన ఇన్నాళ్లూ టిడిపిలోకి వెళదామని ప్రయత్నించినా..అక్కడ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌' వైపు చూశారు. అయితే ఆయన కూడా 'బొత్స' చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదట. మరో వైపు ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం లేకపోవడంతో..రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. వచ్చే ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం  నుంచి మూడు స్థానాలు ఖాళీ కానుండగా వాటిలో రెండు టిడిపికి ఒకటి వైకాపాకు దక్కుతుందని భావించారు. అయితే ఇటీవల కాలంలో వైకాపా నుంచి మరి కొంత మంది ఎమ్మెల్యేలు అధికార టిడిపిలోకి చేరుతుండడంతో ఇప్పుడు వైకాపాకు దక్కే ఒక్కసీటు కూడా దక్కుతుందో లేదోనన్న అనుమానం మొదలైంది.

    రాజ్యసభకు వైకాపా నుంచి అభ్యర్థి ఎంపిక కావాలంటే 44మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపాకు 42 మంది బలం మాత్రమే ఉంది. మరో మూడు నెలల్లో వీరిలో మరి కొంత మంది పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండగా..ఈ స్థానం వైకాపాకు దక్కడం కష్టంగా మారింది. అయితే తనకు అభ్యర్థిత్వం ఇస్తే..తాను ఏదో విధంగా గెలుపొందుతానని 'బొత్స' 'జగన్‌'ను కోరారట. దీనిపై 'జగన్‌' స్పందిస్తూ...తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, గెలిచే పరిస్థితి ఉంటే బరిలోకి దిగమని సూచించినట్లు తెలుస్తోంది. మరో మూడు నెలల్లో మరికొంత మంది పార్టీ నుంచి జారిపోతే..'బొత్స' మిగిలిన బలం ఎలా సమకూర్చుకుంటారు. టిడిపిలో ని తన సామాజికవర్గానికి చెందిన వారు క్రాస్‌ ఓట్‌ చేస్తారనే భావన 'బొత్స'లో ఉందట. అంతే కాకుండా భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారట.  మొత్తం మీద 'బొత్స' ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి.


(3259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ