WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నాడా...!?

మంచోడు..మంచోడు అంటే...మంచం అంతా కంతలు చేశాడనట్లు ఉంది...జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' వ్యవహారం. రెండు రోజుల నుంచి ఆంధ్రాలో పర్యటిస్తున్న ఆయన పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన విమర్శలు, చేసిన వ్యాఖ్యలు కొన్ని ఆయనకే తిప్పకొట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ను ఉద్దేశించి..పాదయాత్ర చేస్తే..ముఖ్యమంత్రి పీఠం రాదని..ఎద్దేవా చేసిన 'పవన్‌'..ప్రతిపక్షనాయకుడు ప్రజలను కలిస్తే తప్పేముందన్న సంగతిని మరిచిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను కలవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటారు..అటువంటి వాటిలో 'పాదయాత్ర' ఒక మార్గం..దీనిలో తప్పుపట్టడానికేముంది...! అదే విధంగా ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని ఆశ పడడం తప్పుని సెలవిచారు...మరి సినీనటుల కుమారులు, తమ్ముళ్లు సినిమా నటులు కావచ్చా...? వారసత్వం ఉండకూడదని చెప్పిన 'పవన్‌' మరి సినీ వారసత్వం ఉండాలని భావిస్తున్నారా..? ఒకే ఇంటిలో డజన్‌కు పైగా హీరోలను పెట్టుకుని వారసత్వం గురించి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్ముతారా..? నిన్నటి దాకా తనకు కులం లేదని డప్పుకొంటుకున్న 'పవన్‌' ఈ రోజు 'కాపు'లకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలవని, వారికి 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసి తనకు ఉన్న కులతత్వాన్ని బహిరంగంగా చాటుకుని సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారు. నిన్నటి దాకా..ఆయన సామాజికవర్గం కాక..ఇతర సామాజికవర్గాల్లో కొంత మంది ఆయన మాటలకు విలువ ఇచ్చేవారు. ఇప్పుడు తన సామాజికవర్గ రిజర్వేషన్లపై ఆయన స్పందించిన తీరు చూసి వారు నివ్వెరపోతున్నారు. కులం లేదని..అందరూ ఒకటేనని చెప్పే 'పవన్‌' తన సామాజికవర్గం విషయంలో స్పందించిన తీరుతో అవన్నీ నోటిమాటలేననే సంగతిని రుజువు చేశారు. 

  అదే విధంగా 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని నిరూపించాలంటే..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలట. దీనిలో ఏమైనా హేతు బద్దత ఉందా..? అవినీతి జరిగితే..ఎక్కడ జరిగిందో తేల్చి చెప్పి..ఇదీ ప్రభుత్వం చేస్తున్న తప్పు అని నిరూపించాలి..కానీ..ఢిల్లీకి తీసుకెళ్లు..అంటూ పనికి మాలిన సలహాలు ఇవ్వడం ఎందుకు..? పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, పునరావాసంలో అంచనాలు పెంచారని ఆరోపిస్తున్న ఆయన 2013లో కేంద్రం చేసిన చట్టాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. నిర్వాసితులకు ముందు న్యాయం చేసిన తరువాతే ప్రాజెక్టులు నిర్మించాలని 'పవన్‌' అప్పుడెప్పుడో చెప్పిన సంగతిని మరిచిపోయినట్లున్నారు. అన్నిటి కంటే విచిత్రమైన డిమాండ్‌ కేంద్ర రక్షణ మంత్రి 'నిర్మలాసీతారామన్‌', ఆమె భర్త ప్రభుత్వ సలహాదారు 'పరకాల ప్రభాకర్‌'లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయినందున రాజీనామా చేయాలట...? సరే...వారు విఫలమయ్యారు..అనుకుందా..మరి..'పవన్‌' అన్న..కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కదా..కాంగ్రెస్‌ అడ్డంగా ఆంధ్రాను చీల్చింది..మరి...అప్పుడు ఎందుకు 'చిరంజీవి' రాజీనామా చేయలేదు. సరికదా..పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కేటాయింపును ఎందుకు చేయించలేదు.విడిపోయిన ఆంధ్రాకు చేయాల్సిన సహాయాల గురించి ఎందుకు ప్రస్తావించలేదు..ఆఖరి నిమిషం వరకు పదవిని పట్టుకుని వేలాడిన 'చిరంజీవి'ది మాత్రం తప్పులేదు..ఇప్పుడు 'పరకాల'ది తప్పుందా...? మొత్తం మీద ఆరు నెలలకోసారి బయటకు వచ్చి...విమర్శలు,ఆరోపణలు గుప్పించి మళ్లీ మౌనం వహించే 'పవన్‌కళ్యాణ్‌' రెండు రోజుల పర్యటనలో సెల్ప్‌గోల్‌ వేసుకున్నారనే మాట వినిపిస్తోంది. చెప్పే మాటలకు..చేసే చేతలకు సంబంధం లేకుండా..ఆయన చేసిన విమర్శలు తిరిగి ఆయనకే తగులుతున్నాయి...ఇన్నాళ్లూ ఆంధ్రాలో 'జగన్‌' ఒక్కడే సెల్ప్‌గోల్‌ వేసుకుంటారని భావిస్తుంటే..ఇప్పుడు ఆయనకు 'పవన్‌' జతకలిశారు...! ఇద్దరు సెల్ఫ్‌గోలర్స్‌ ఉండడంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చిద్విలాసంగా తన పని తాను చేసుకుంటూ పొతున్నారు.


(534)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ