లేటెస్ట్

‘జగన్‌’కు పట్టభద్రుల పరీక్ష....!

అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత అధికార వైకాపా పార్టీకి గట్టి ఎన్నికల పరీక్ష ఎదురుకాబోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైకాపా పార్టీ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించింది. (స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి) ఈ ఎన్నికలు ఎలా జరిగినా వైకాపా మాత్రం తాము అసెంబ్లీ ఎన్నికలకంటే బలంగా ఉన్నామని, ‘జగన్‌’ పాలనకు ప్రజలు మెచ్చి తమను ఆశీర్వదించారని చెప్పుకుంటున్నారు. అయితే అధికారపార్టీ వాదనను ఆ పార్టీని సమర్థించేవారు బలపర్చగా, తటస్థులు, ప్రతిపక్షపార్టీలకు చెందిన వారు ఆ ఎన్నికలన్నీ అక్రమాలతో కూడినవనే భావనను వ్యక్తం చేశారు. అయితే ఇదంతా గతం. గతంలో ఏమి జరిగినా..ప్రస్తుతం దాని గురించి ఎంత చెప్పుకున్నా, ఏమి చేసినా ఉపయోగం లేదు. అయితే రాబోయే రోజుల్లో అధికారపార్టీకి ఒక గట్టి పరీక్ష ఎదురు కాబోతోంది. రూరల్‌ ఏరియాల్లో ఇంకా బలంగా ఉన్నామని, సంక్షేమపథకాల అమలుతో అన్ని వర్గాలను ఆకర్షించామని చెబుతోన్న అధికారపార్టీకి విద్యావంతుల నుంచి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. 


ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ గతంలో సాధించిన విజయాలనే సాధిస్తుందా..అనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. కొత్త ఓట్ల నమోదుకు ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త ఓటర్లను చేర్పించడంలో బిజీగా ఉన్నాయి. కాగా అధికారపార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా శ్యాంప్రసాద్‌రెడ్డిని ప్రకటించింది. ప్రతిపక్ష టిడిపి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. విద్యావంతులకు చెందిన ఎన్నిక కావడంతో అధికారపార్టీకి ఈ ఎన్నికలు చెమటలు పుట్టిస్తాయనే ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. ‘జగన్‌’ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యావంతుల్లో ఎక్కువ మంది ఆయనకు మద్దతు ఇచ్చారు. ‘జగన్‌’ అధికారంలోకి వస్తే నూతన డిఎస్సీ ప్రకటిస్తాడని, లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారని, యువకుడని వారు ఆయనను అప్పట్లో సమర్థించారు. అయితే ‘జగన్‌’ అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. కొత్త ఉద్యోగాల భర్తీని అసలు చేపట్టకపోవడం, చేపట్టినా అరాకరా జీతాలు ఉన్న వలంటీర్ల ఉద్యోగాలను ఇవ్వడంతో వారంతా నీరుకారిపోయారు. ఒకవైపు నిరుద్యోగం తాండవించడం, కొత్త పరిశ్రమలు లేకపోవడంతో ఎక్కువ మంది విద్యావంతులు హైదరాబాద్‌, బెంగుళూరు, ఢల్లీి వంటి పట్టణాలకు వలసలు కట్టారు. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటిస్తానని ఎన్నికల ముందు వాగ్థానం చేసిన ‘జగన్‌’ ఎన్నికల తరువాత దాని సంగతిని మరిచిపోయారు. ఆ మధ్య ఉద్యోగక్యాలెండర్‌ అంటూ ఒకటి ప్రకటించినా కేవలం పదివేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు తమను ‘జగన్‌’ నిలువునా ముంచాడంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పట్టభద్రుల ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల్లో విద్యావంతులు తమను మోసం చేసిన ‘జగన్‌’కు గుణపాఠం నేర్పుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘జగన్‌’ ప్రభుత్వం కేవలం సంక్షేమపథకాలను మాత్రమే అరకొరగా అమలు చేస్తోందని, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గెలిచిన దగ్గర నుంచే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పరిపాలన చేస్తున్నారని, ‘జగన్‌’ ప్రభుత్వం వలన రాష్ట్రం సుడిగుండంలోకి కూరుకుపోయిందనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. ఉన్నత విద్యావంతులుగా ఉన్న ఓటర్ల ఎన్నికల్లో వారు తమదైన చైతన్యాన్ని చూపిస్తారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.  అయితే..అధికారపార్టీ దీన్ని ముందే గుర్తించి దానికి విరుగుడు చర్యలు తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే భావనతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని అధినేత ‘జగన్‌’ తన అనుచరులకు ముందుగానే సూచనలు చేశారు. దాంతో వారు ముందుగానే అభ్యర్థిని ఎన్నిక చేసి, ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై ముందుగానే కసరత్తులు చేస్తున్నారు. కాగా ప్రధాన ప్రతిపక్షం ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అసలు పోటీ చేస్తారో..లేదో.. చెప్పలేదు. అయితే..వారు పోటీ చేయకపోయినా, వామపక్షాలు పోటీ చేస్తే వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు పోటీ చేసినా ‘జగన్‌’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విద్యావంతులు ఆయనకు షాక్‌ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ