WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

స్వచ్చంధ పదవీ విరమణ యోచనలో సీనియర్‌ ఐఎఎస్‌లు...!

ఆ ఇద్దరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు చేరుకున్న ఐఎఎస్‌ అధికారులు. ఇద్దరికీ నిజాయితీపరులైన అధికారులుగా పేరుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరి పొడ అసలు గిట్టదు. మరో అధికారి పనితీరుపై అనేక సందర్భాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సీనియర్లమైనా తమను చిన్నచూపు చూస్తున్నారని వారు వాపోతున్నారు. ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం...ప్రస్తుతం యువజనులు, క్రీడలశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరొక అధికారి పేరు జె.ఎస్వీ ప్రసాద్‌. తనకు ఇష్టం లేని పశుసంవర్థకశాఖకు శాఖాధిపతిగా నియమించడం ఆయనకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎల్‌.విపై సీబీఐ కేసు దాఖలు చేసినా..ఆయన ఎటువంటి తప్పు చేసి ఉండరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఆయన అత్యంత నిజాయితీపరుడని, సమర్థుడని పేరున్నప్పటికీ అహంకారధోరణితో వ్యవహరిస్తారనే పేరుంది. జెఎస్వీ ప్రసాద్‌కు నిజాయితీపరుడైన అధికారిగా పేరున్నా..ఫైళ్ల పరిష్కారంలో చాలా ఎక్కువ సమయం తీసుకుంటారని, బద్దకస్తుడని, తన సామాజికవర్గాల వారిపై ఆపేక్ష చూపుతారని, మిగతా సామాజికవర్గాలపై వివవక్ష చూపుతారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన దేవాదాయశాఖ అధిపతిగా పనిచేసినప్పుడు ఆయన వ్యవహారంపై పలువురు ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. అనారోగ్యంతో ఇప్పుడు ఆయన ఆరు వారాలు సెలవు పెట్టారు. ఈ ఇద్దరు అధికారులైన జెఎస్వీ ప్రసాద్‌,ఎల్‌.విలను ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మడం లేదని, తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇష్టం లేని శాఖలను కట్టబెట్టారని భావిస్తున్నారు. దీంతో కలత చెందిన ఆ ఇద్దరు అధికారులు ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలా..? లేక స్వచ్చంధ పదవీ విరమణకు ధరఖాస్తు చేసుకోవాలా...? అని ఆలోచిస్తున్నారని బయటకు పొక్కింది. 

   ముందుగా సెలవుపై వెళ్లి ఆ తరువాత స్వచ్చంధ పదవీ విరమణకు ధరఖాస్తు పెట్టుకోవాలని ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం భావిస్తున్నట్లు తెలిసింది. అటువంటి ఆలోచన లేదని ఎల్‌.వి బయటకు చెబుతున్నప్పటికీ.. నిప్పులేనిదే పొగరాదు కదా...అంతే కాకుండా ఎల్‌.వి., జెఎస్వీ ప్రసాద్‌లు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వీరిద్దరూ అత్యంత సన్నిహితులని అందరికీ తెలుసు. వీరిద్దరూ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇటీవల కాలంలో 'చంద్రబాబు'పై బాహాటంగా విమర్శలు చేసిన 'ఐవైఆర్‌ కృష్ణారావు'కు అత్యంత సన్నిహితులని పేరుంది. ఆ పేరు రావడమే వారిద్దరి పాలిట శాపమైంది. ఐవైఆర్‌ తనపై బాహాటంగా విమర్శలు చేయడాన్ని సహించలేని 'చంద్రబాబు' తన ప్రతాపాన్ని ఈ ఇద్దరిపై చూపారనే విమర్శ వస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు అధికారులు నిజాయితీపరులనడంలో ఎటువంటి సందేహం లేదు. అహంకారం, బద్దకం లెక్కలోనికి తీసుకునే విషయాలు కావు. నిజాయితీని, సమర్థతను ప్రోత్సహిస్తానని పదే పదే చెబుతున్న 'చంద్రబాబు' ఈ ఇద్దరు అధికారుల విషయంలో తప్పటడుగులు వేస్తున్నారనేది వాస్తవం. బద్దకస్తుడిగా పేరున్న జె.ఎస్వీ ప్రసాద్‌ను పట్టించుకోకపోయినా..నిబంధనల ప్రకారం పని చేస్తోన్న ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంపై కక్ష సాధింపు చేయటం సరికాదని పలువురు ఐఎఎస్‌ అధికారుల అభిప్రాయం. ఇదే విషయాన్ని చాలా మంది ఐఎఎస్‌ అధికారులు తమను కలసిన వారితో, మీడియా వారితో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరూ ధీర్ఘకాలిక సెలవుపై వెళతారా..? స్వచ్చంధంగా పదవీ విరమణ చేస్తారా..? లేక రాజీపడిపోయి ప్రస్తుత శాఖల్లోనే కొనసాగుతారా..? వేచి చూడాల్సిందే...!

(490)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ