WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎం ఆధ్వర్యంలోనే కమిటీయే...చనిపోయిన డిఎస్పీకి పోస్టింగ్‌ ఇచ్చిందట...!?

పోలీసుశాఖలో డిఎస్పీల బదిలీలు, పోస్టింగ్‌లు నిన్నటి వరకు డీజీపీ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ నిర్ణయాలు తీసుకునేది. ఆ నిర్ణయాలు తీసుకోవడం వెనుక సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ కూడా ఉన్నాయి. ఇది నిన్నటి వరకు అధికారపూర్వకంగా జరిగింది. తాజాగా డిఎస్పీల బదిలీలు, పోస్టింగ్‌లు తన ఆధ్వర్యంలో జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను జారీ చేశారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విధానాలకు విరుద్ధమైనప్పటికీ అనధికార సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారే తప్ప..అధికారికంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపించదు. కొద్ది రోజుల కిందట సిఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీజీపీ సాంబశివరావు, ఇంటిలిజెన్స్‌శాఖాదిపతి వెంకటేశ్వరరావు, సిఎంఒ అధికారి 'సతీష్‌చంద్ర', హోంమంత్రిలు పాల్గొన్నారు. వాస్తవానికి డిఎస్పీల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో హోంమంత్రి రాజప్ప మొదటి నుంచి ఆయన తలదూర్చలేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన సిఫార్సులను పరిశీలించమని మాత్రమే డీజీపీకి ఆయన చెప్పేవారు. అందుకే ఆయనపై ఎటువంటి విమర్శలు రాలేదు. తాజాగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కమిటీలో ఆయన కూడా ఉన్నప్పటికీ తెలిసి విషయాలను ఆయన చెప్పేవారు తప్ప..మిగతా విషయాలను ఆయన ఆ సమావేశంలో ప్రస్తావించేవారు కాదు. 

  ఈ విషయంలో అసలు విషయం ఏమిటంటే...ఇంత మంది అతిరథమహారధులు పాల్గొన్న సమావేశంలో చనిపోయిన డిఎస్పీకి పోస్టింగ్‌ ఇవ్వడం ఏమిటి..? ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారు..? ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం డీజీపీ నండూరి సాంబశివరావుకు తెలియదా..? ముఖ్యమంత్రి, హోంమంత్రి, సిఎంఒ అధికారికి తెలియకపోవచ్చు. శాఖాధిపతి 'నండూరి' ఎందుకు పట్టించుకోలేదు...? ఇంటిలిజెన్స్‌శాఖ సరైన నివేదికలు ఇవ్వడం లేదని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తాను సిఫార్సు చేసిన విషయాల గురించే 'నండూరి' పట్టించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరి పనులు వారు చక్కపెట్టుకుంటున్నారే తప్ప..ఎవరెవరు విధులు నిర్వహిస్తున్నారో..ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో..డిజీపీ, ఇంటిలిజెన్స్‌ అధిపతి తెలుసుకోవాలి. స్వంత లాభాపేక్ష తప్ప..వాస్తవాలు తెలుసుకోవడంలో ఆ ఇద్దరు ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారో..? సిఎం ఆధ్వర్యంలో జరిగిన కమిటీయే..చనిపోయిన వారికి పోస్టింగ్‌ ఇస్తే ప్రభుత్వానికి ఎంత అప్రదిష్ట..? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంలో అధికారులను మందలించనట్లు లేదు..? ప్రతిపక్షమూ పట్టించుకోలేదు..! యధా..ప్రభుత్వం...తథా ..ప్రతిపక్షం అన్నట్లుంది..ఆంధ్రాలో పరిస్థితి...!

(816)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ