WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముఖ్యమంత్రి ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చిన కలెక్టర్‌...!

ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.10వేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం వడిసిపట్టారు. ముఖ్యమంత్రి చెప్పిన సూచనను అక్షరాలా అమలు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. దీని కోసం ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. ఆ పథకం పేరే 'అభ్యున్నతి'. నిస్తేజంగా మారిన స్వయం సహాయక సంఘాలోని కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల రూపాయల ఆదాయం వచ్చేలా డిఆర్‌డిఎ అధికారులతో కలెక్టర్‌ చర్చించి ఈ పథకానికి రూపకల్పన చేశారు. నిర్ణీత ఆదాయం సంపాదించలేకపోతున్న రెండు లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్దిపొందబోతున్నాయి. వీరికి వివిధ పథకాల కింద ఆర్థిక లబ్దితోపాటు వివిధ అంశాలపై నైపుణ్యాభివృద్ధిపై శిక్షణను కల్పించబోతున్నారు. జిల్లాలో మొత్తం 59,882 సంఘాలు ఉండగా వీటిలో 6.08 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయాన్ని పొందలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై సర్వే నిర్వహించి ముందుగానే కొంత మందికి లబ్ది చేకూర్చబోతున్నారు. వెలుగు ప్రాజెక్టు కింద అమలు  అయ్యే వివిధ ప్రాజెక్టుల్లో వీరికి భాగస్వామ్యం కల్పించబోతున్నారు. ఇప్పటికే వివిధ జీవనోపాదుల కింద ఉపాధిపొందుతున్నవారికి మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. 

   ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 4లక్షల మందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం కింద మరో 90వేల మందికి ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియబోతున్న సమయంలో ముందుగా కొంత మందికి లబ్ది చేకూర్చి...నూతన ఆర్థిక సంవత్సరంలో మిగతా వారందరికి లబ్ది చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెక్కల పెంపకం ద్వారా కొంత మందికి ఉపాధి కల్పించబోతున్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 500మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. జనరిక్‌ మందులు దుకాణాలు ఏర్పాటు చేయటం ద్వారా కొంత మందికి, ఫార్మాసిస్టు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలను ఇప్పించబోతున్నారు. ఉద్యోగ మేళాల్లో స్వయం సహాయక సంఘాలోన్ని సభ్యులకు చెందిన పిల్లలకు శిక్షణ ఇస్తారు. దీని ద్వారా 2500 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 'మనకోడి' పథకం ద్వారా 20వేల కుటుంబాలకు సహాయం చేయబోతున్నారు. ఇవే కాక పాడిపశువుల పంపిణీ, వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు, పరిశ్రమల శాఖ అందించే రవాణా వాహనాలు, ట్రక్కులను అందజేసి ఉపాధి కల్పిస్తారు. మొత్తం మీద నిరుపేదలైన కుటుంబాలకు నెలకు రూ.10వేల రూపాయల ఆదాయాన్ని సమకూర్చాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలనకు అనుగుణంగా ప్రత్యేక పథకాన్ని రాష్ట్రంలో తొలిసారి రూపొందించి...మిగతా జిల్లాల కలెకర్లకు 'లక్ష్మీకాంతం' మార్గదర్శకుడైనారనడంలో ఎటువంటి సందేహం లేదు.


(1483)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ