WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గుంటూరు పశ్చిమ'లో తారాస్థాయికి చేరిన అవినీతి...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదర్శవంతమైన పాలన, అవినీతిరహిత పాలన, సంస్కరణలతో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ నిత్యం పరితపిస్తున్నారు. ఆయన నిజాయితీగా, సమర్థవంతంగా పాలన చేయాలని ప్రయత్నిస్తుంటే ఆయన లక్ష్యానికి కొందరు అధికారులు, మరికొందరు ప్రజాప్రతినిధులు తూట్లు పొడుస్తున్నారు. సమర్థవంతంగా, ఆదర్శంగా పనిచేయకపోయినా...అవినీతికి పాల్పడవద్దబాబూ..అంటూ కొందరు నేతలకు పదే పదే చెబుతున్నా వారు మాత్రం యధేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ అవినీతి గురించి కథలు..కథలుగా చెప్పే టిడిపి నేతలు స్వంత పార్టీ నేతలు చేస్తోన్న అవినీతిపై నోరు మెదపడం లేదు. రాజకీయ చైతన్యానికి మారు పేరైన గుంటూరు జిల్లా 'గుంటూరు పశ్చిమ' నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా...ముడుపులు ఇవ్వాల్సిందే...! లంచాలు లేనిదే..ఎటువంటి పనులు జరగడం లేదని సాక్షాత్తూ టిడిపి నాయకులు,కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు, భవన నిర్మాణాలు, సిసిరోడ్లు, ఇతర సంక్షేమపథకాల్లో తమ వాటా అందితేనే పనులు చేస్తున్నారని లేకుంటే..అన్నింటిని ఆపేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ నేత ఒకరు, మున్సిపల్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు అవినీతి విచ్చలవిడిగా సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ నేత, మున్సిపల్‌ ఉన్నతాధికారులు ఇద్దరూ కలసి వాటాల వారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారట. 

  నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరిట అడ్డుగా లేకున్నా చిన్న చిన్న షెడ్స్‌, భవనాలను కూల్చివేస్తున్నారట. దీంతో టిడిపికి అండగా ఉండే వీరు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాము ఓటు వేసి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వమే తమ ఉపాధిని దెబ్బతీస్తుందని వారు వాపోతున్నారు. అవసరం లేకపోయినా..నియోజకవర్గ నేత, మున్సిపల్‌ ఉన్నతాధికారులు కలసి కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార టిడిపిపై ప్రజల్లో అసంతృప్తి పెంచడమే వీరి ధ్యేయమని, టిడిపి నాయకులు అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి పనికి రేటు కట్టి...దోచుకుంటున్నా..ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. టిడిపికి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈ విధమైన అవినీతి వ్యవహారాలతో పార్టీ భ్రష్టుపట్టిపోతోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరి వ్యవహారాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ దెబ్బతినకముందే..వీరిని అదుపు చేయకపోతే..చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అవుతుంది. మరి పార్టీ అధ్యక్షుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


(1421)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ