లేటెస్ట్

చంద్రబాబు సిఎం, పవన్‌ డిప్యూటీ సిఎం:సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, మరో ప్రతిపక్షమైన జనసేన పార్టీలు పొత్తుపెట్టుకుంటాయని, ఆ రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయని, వారు అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం అవుతారని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ అభిమానులు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తానని ప్రతిజ్ఞ చేశారని ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు సిఎం అవుతారని సదరు మీడియా సంస్థ ప్రతినిధులు అడిగినప్పుడు తనకు తెలిసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, పవన్‌ ఉపముఖ్యమంత్రి అవుతారని జెడీ లక్ష్మీనారాయణ చెప్పారు. సాధారణంగా కూటమిలోని పార్టీల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ వాళ్లు ముఖ్యమంత్రి అవుతారని, ఇక్కడ టిడిపికే మెజార్టీ సీట్లు వస్తాయి కనుక ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. అదీ కాకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాల్లో జరిగినట్లుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు చెరో రెండేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఏ పార్టీకి ఎన్ని కేబినెట్‌ బెర్తులు, ఏయే శాఖలు అనే విషయాలపై కూటమి పార్టీలు ముందుగానే ఒక అవగాహనకు వస్తే బాగుంటుందని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని, ఇది రాష్ట్రానికి మంచి చేస్తుందని ఆయన అన్నారు. ఏయే పార్టీకి ఎన్ని మంత్రిపదవులు, ఇతర పదవులు అనే విషయం చాలా చిన్న విషయమని, జెడీ చెప్పారు. పార్టీ అధినేతలు ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఇక వారు ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించరని ఆయన అన్నారు.


జెడీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండగా క్రింది స్థాయిలో మాత్రం ఇరు పార్టీలకు చెందిన దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలు తమ నేతే ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో తమ నేత పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు కోసం తగ్గారని, ఈసారి తమకు అవకాశం ఇవ్వాలనే భావన ‘జనసేన’ నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. అయితే టిడిపి కార్యకర్తలు, నాయకులు మాత్రం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతారని, ఇప్పటికే పెద్ద ఎత్తున్న విధ్వంసం జరిగిందని, ప్రజాధనం లూటీ అయిందని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుదారులందరూ వెనక్కుపోయారని, వారిని మళ్లీ రాష్ట్రం వైపు మళ్లించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలంటే చంద్రబాబు వల్లే అవుతుందని, అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని దానికి ‘పవన్‌’ సహకరించాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద రెండు పార్టీల్లో ఒక అవగాహన కుదిరిందని, బిజెపితో సంబంధం లేకుండా రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ‘జగన్‌’ సంగతి చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు  పరిస్థితి కనిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ