WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణలో కెసిఆర్‌కు ఎదురుగాలి...!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్‌ అసెంబ్లీ తథ్యం...!

పెద్ద పార్టీగా కాంగ్రెస్‌...రెండో స్థానంలో టిఆర్‌ఎస్‌...!

కాంగ్రెస్‌కు 56, టిఆర్‌ఎస్‌ 46 సీట్లు వస్తాయంటున్న సర్వే...!

ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే..అధికార టిఆర్‌ఎస్‌ ఘోరంగా ఓడిపోతుందని ఓ సర్వే తేల్చి చెప్పింది. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు నిర్వహించిన ఈ సర్వేలో అధికార టిఆర్‌ఎస్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తేలిందట. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా ఊహించిన స్థాయిలో మెరుగుపడడం లేదట. ఆ పార్టీకి అధికారానికి అవసరమైన సీట్లు లభించవని...తేలింది. హంగ్‌ అసెంబ్లీ వస్తుందని సదరు సర్వే చెప్పింది. ప్రత్యేక తెలంగాణ సాధించిన పార్టీగా గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రజలు బొటాబొటిమెజార్టీతో అధికారం కట్టబెట్టారు. అయితే తరువాత పలు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుని టిఆర్‌ఎస్‌ బలపడింది. అంతే కాకుండా హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు..పలుచోట్ల జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించి తమకు ఎదురేలేదని నిరూపించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 110 స్థానాలు వస్తాయని, తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు 7స్థానాలు వస్తాయని, ప్రతిపక్షానికి రెండే స్థానాలు వస్తాయని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇటీవల దాకా ఆయన చెబుతున్న మాటలను ఎక్కువ మంది విశ్వసించారు. అయితే...గత ఏడాదిన్నరగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, ప్రజలను పట్టించుకోవడం లేదని, తెలంగాణాను నలుగు వ్యక్తులే పాలిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా...వివిధ వర్గాలకు చెందిన ప్రజలపై దమనకాండకు పూనుకుంటుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా..ఇప్పటి వరకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా తాము ఇది చేశామని చెప్పుకొనే పని ఒక్కటీ లేదన్న విమర్శలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్లాయి. దీంతో వారిలో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. దరిమిలా..ఇప్పుడు వచ్చిన సర్వే దాన్నేరుజువు చేస్తోందని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు.

  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..టిఆర్‌ఎస్‌కు 46, కాంగ్రెస్‌కు 56, బిజెపికి 8, ఎంఐఎంకు 7, టిడిపి-2, సిపిఎం-1 స్థానాలు గెలుచుకుంటాయని సదరు సర్వే చెప్పింది. పాత జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు 6, కాంగ్రెస్‌కు 4, కరీంగనర్‌లో టిఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 5, బిజెపి 2, నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌3, బిజెపి1, వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌6, మెదక్‌ టిఆర్‌ఎస్‌ 6,కాంగ్రెస్‌ 4,హైదరాబాద్‌ ఎంఐఎం 7, కాంగ్రెస్‌ 2, టిఆర్‌ఎస్‌ 2, బిజెపి-3, టిడిపి1, రంగారెడ్డి టిఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 6, బిజెపి 2, టిడిపి-1, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 13, నల్లగొండ టిఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 8, ఖమ్మం టిఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 4, సిపిఎం1 స్థానాలను గెలుచుకుంటాయని ఆ సర్వే తేల్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ గెలుస్తుందో..అన్న దాన్ని విడమరిచి చెప్పారు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...తెలంగాణలో అధికార పార్టీ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


(3792)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ