WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ'కి ధీటుగా 'రాహుల్‌' ఎదుగుతారా...!?

గుజరాత్‌,హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచి ఓటర్లపై తమకు పట్టుపోలేదని మరోసారి నిరూపించుకుంది.'హిమాచల్‌ప్రదేశ్‌'లో బిజెపి గెలుపు అంతా ఊహించిందే. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బిజెపిని గెలిపిస్తుందని ముందు నుంచి భావిస్తున్నదే. అక్కడ అదే జరిగింది. గుజరాత్‌లో మాత్రం హోరాహోరి పోరు జరుగుతుందని భావించగా..అదే విధంగా జరిగింది. మొదట,రెండవ విడత పోలింగ్‌ తరువాత అధికార బిజెపి భారీ మెజార్టీతో విజయం సాధించబోతుందని ఎగ్జిట్‌పోల్స్‌పేర్కొన్నాయి. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తారుమారు అయ్యాయి. వారు అంచనా వేసినాలు ఘోరంగా తప్పిపోయాయి. చివరకు బిజెపి వంద మార్కును దాటలేకపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోయినా..బిజెపిని మాత్రం చెమటలు కక్కిస్తుందని అంచానాలు నిజమయ్యాయి. ఎలాగోలా..బిజెపి గెలిచింది..కానీ..కాంగ్రెస్‌పార్టీ పోరు మాత్రం దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ పోరు అనే కంటే ఆపార్టీ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' చేసిన పోరాటమే అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బిజెపియేతర పార్టీలకు ఓ నాయకుడు దొరికారన్న భావన వ్యక్తం అవుతుంది.

  గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదట్లో బిజెపి 'రాహుల్‌గాంధీ'ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చేసిన విమర్శలపై స్పందించడానికి కూడా 'మోడీ, అమిత్‌షా' ద్వయం ఇష్టపడలేదు. తాము అతన్ని నాయకుడిగా చూడబోవడం లేదన్నట్లు వ్యవహరించారు. అయితే 'రాహుల్‌' పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగిన తరువాతే 'మోడీ,అమిత్‌లకు అసలు విషయం అర్థమైంది. గతంలో 'రాహుల్‌' నెమ్మదిగా ఉండేవారు. ఈసారి మాత్రం ఆయన దూకుడు మంత్రాన్ని ఎంచుకున్నారు. హిందూ ఓట్లను ఆకర్షించడం కోసం హిందూ దేవాలయాలు తిరగడం, జిఎస్‌టి ట్యాక్స్‌పై తన దైనశైలిలో విమర్శలు కురిపించడం, యువతను ఆకట్టుకోవడం, సమాజంలో వైరివర్గాలుగా ఉన్న ఓబిసి,ముస్లింలు,ఎస్‌సి,ఎస్‌టిలను కలపి ఒక కూటమిగా నిలబెట్టడం...వెంట వెంటనే జరిగిపోయాయి. అప్పటి దాకా..ఏకపక్షంగా  తాము గెలుస్తామని భావిస్తోన్న 'మోడీ,షా'లకు 'రాహుల్‌' నుంచి ఇంత ప్రతిఘటన ఉంటుందని అర్థం చేసుకోలేకపోయారు. దాంతో దీనికి విరుగుడు సూత్రాన్ని రూపొందించడానికి వాళ్లు చాలా శ్రమపడ్డారు. 'రాహుల్‌' తన ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటూనే..ఇతర వర్గాలను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు చేశారు..దానిలో చాలా వరకు సఫలీకృతులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బసుయాత్ర నిర్వహించి...సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను ప్రస్తావిస్తూ...వారితో సెల్ఫీలు దిగుతూ...ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. 'రాహుల్‌' ప్రజల్లో మమేకం అవుతూ చేస్తున్న ప్రచారం తమ కొంప ముంచుతుందని...గ్రహించిన 'మోడీ, అమిత్‌షాలు' తమ పాత అస్త్రాన్ని బయటకు తీశారు. హిందూత్వ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ..రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బిజెపి ఇక్కడ ఓడిపోతే..పాకిస్తాన్‌లో టపాసులు కాలుస్తారంటూ..ఒకసారి...తనను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని 'మోడీ' చేసిన భావోద్వేగ ప్రసంగాలతో అభివృద్ధి అంశాన్ని పక్కకు తీసుకెళ్లి ఎలాగొలా చివరకు విజయ తీరాలకు చేరుకున్నారు బిజెపి ద్వయం. 

   సరే...విజయం సాధించారు..తరువాత ఏమిటి..? రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది ప్రాతిపదిక తీసుకుంటే...మరి బిజెపి గెలుస్తుందా..? ఇప్పుడు కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య వ్యత్యాసం పెద్దగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లల్లో 12శాతం ఓట్లు బిజెపి కోల్పోయింది. అదే సమయంలో ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. మరి ఇన్ని అననుకూలతల మధ్య..రాబోయే సార్వత్ర ఎన్నికల్లో బిజెపి ఎన్నిసీట్లు సాధిస్తుందో అన్న ప్రశ్న..ఉండగా..బిజెపియేతర పక్షాలను ఒకతాటిపైకి 'రాహుల్‌' తేగలడా..? సార్వత్రిక ఎన్నికల్లో 'మోడీ'ని ధీటుగా 'రాహుల్‌' ఎదుర్కోగలడా..? అంటే చాలా మంది నుంచి అవుననే సమాధానం వస్తోంది. గుజరాత్‌ ఎన్నికలకు ముందు..మోడీ..రాహుల్‌ను పోల్చడానికి కూడా చాలా మంది ఒప్పుకునే వారు కాదు...కానీ.. ఇప్పుడు వారిద్దరి మధ్యే పోటీ ఉండే అవకాశాలు ఈ ఎన్నికల ద్వారా కనిపిస్తున్నాయి. ప్రధానిగా 'మోడీ' ప్రభ రోజు రోజుకు దిగజారుతుండగా..కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా 'రాహుల్‌' రోజు రోజుకు పుంజుకుంటున్నారనే విషయం అందరూ అంగీకరించేదే...ఇదే ఊపును మరో ఏడాది పాటు 'రాహుల్‌' కొనసాగిస్తే...'మోడీ' వ్యతిరేకులకు, బిజెపి వ్యతిరేకులకు...'రాహుల్‌' కేంద్రం అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం...!


(807)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ