లేటెస్ట్

ఆంగ్ల మీడియాతో మనస్సు విప్పి మాట్లాడిన సిఎం జగన్‌...!

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీడియాకు దూరంగా ఉంటోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తొలిసారిగా ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, మూడు రాజధానుల గురించి, తాను అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి తొలిసారి ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘హిందూ’తో చర్చించారు. ‘హిందూ’ పత్రికకు సంబంధించి విజయవాడ బ్యూరోచీఫ్‌ ‘అప్పాజీ’ బృందంతో ఆయన తన మనస్సులోని మాటను వారితో పంచుకున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు అవసరమో, మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందనే విషయం వారితో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేనందు వల్లే పరిపాలనా వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసమే రాజధానిని మార్చుతున్నట్లు చెప్పుకొచ్చారు. విశాఖలో రాజధానిని పెడితే కేవలం రూ.15వేల కోట్లతో దానిని అభివృద్ధి చేసుకోవచ్చునని, అదే అమరావతి అయితే లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అంత సొమ్ము కొంత మంది కోసం కేటాయించడం సరికాదని చెప్పారు. విశాఖ, అమరావతి,కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధిచెందుతాయనే తన భావని అని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబు బృందం ఇన్‌సైడ్‌ట్రేడిరగ్‌కు పాల్పడిరదని, విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేశారని, ఇప్పుడు రాజధాని మార్పుతో తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింటుందన్న భావనతోనే వారు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల గురించి అవాస్తవ ప్రచారం చేస్తున్నారని, నిరుపేదల జీవితాల్లో భారీగా మార్పులు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. మొత్తం మీద మూడు రాజధానులు గురించి, సంక్షేమ పాలన గురించి, ప్రతిపక్షాల ప్రచారాల గురించి తొలిసారి ఆయన నేరుగా మీడియాతో మాట్లాడం విశేషం. తాను ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులకు తరువాత కాలంలో ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కొన్ని ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు, మరికొన్ని ప్రింట్‌ మీడియా సంస్థల ప్రతినిధులతో ఆయన నేరుగా మాట్లాడి తన మనస్సులోని మాటను చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నిందిస్తున్నట్లు పచ్చమీడియా ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడుతారా..? లేదా అనేది ఇంకా తెలియదు. అయితే రానున్న కాలంలో ఎంపిక చేసిన కొంత మంది జర్నలిస్టులకు ఆయనను కలుసుకునే అవకాశం లభించబోతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ