లేటెస్ట్

జనసేన,టిడిపి కలిస్తే..గోదావరి జిల్లాల మంత్రులంతా..ఇంటికే....!

సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే పార్టీలన్నీ అప్పుడు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార వైకాపా ఈ ఎన్నికల మూడ్‌ను ఇంకా రోజు రోజుకు పెంచుకుంటూ పోతోంది. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం, మరో ప్రతిపక్షమైన జనసేన కూడా ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అధికార వైకాపా ప్రభుత్వంపై కలిసిపోరాడాలని నిశ్చయించుకున్నాయి. ఇటీవల ఈ రెండు పార్టీల అధినేతలు సమావేశమై ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా..? లేదా..అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు చెప్పలేమని, ఎన్నికల నాటికి దాని గురించి మాట్లాడతామని మాట దాటవేశారు. ఈ ఇద్దరు నేతలు కలవడంతో, వచ్చే ఎన్నికల్లో వారి పొత్తు లాంఛనమేననే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లోనూ, జససామాన్యంలోనూ వ్యక్తం అవుతున్నాయి. అయితే..వీరిద్దరి పొత్తు కుదరని, బిజెపి వీరు పొత్తుపెట్టుకోకుండా చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. అయితే బిజెపి ఏమి చేసినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరిద్దరు కలిసిపోటీ చేస్తారనే భావన అందరిలోనూ ఉంది. అయితే వీరిద్దరూ కలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో కానీ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో మాత్రం క్లీన్‌స్వీప్‌ అవుతుందనే భావన రెండు పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందనేది యధార్థం. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఈ రెండు పూర్వజిల్లాల్లో మంత్రులుగా ఉన్నవారి విషయం ఒకసారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం ఈ జిల్లాల నుంచి కారుమంచి నాగేశ్వరరావు, తానేటి వనిత, పి.విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణలు మంత్రులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ‘తణుకు’ నుంచి మంత్రి కారుమంచి నాగేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణపై కేవలం 2వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ జనసేన అభ్యర్థికి 31వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కనుక ఈ రెండు పార్టీలు కలిసిపోటీ చేస్తే ‘కారుమంచి’ ఖచ్చితంగా ఓడిపోతారు. అదే విధమైన పరిస్థితి మంత్రులు వి.విశ్వరూప్‌, కొట్టు సత్యనారాయణలు విషయంలోనూ జరుగుతుంది. మరో ఇద్దరు మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజాలు మాత్రం ఈ రెండు పార్టీలకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అయితే అది అప్పటి పరిస్థితి. మూడున్నరేళ్ల ‘జగన్‌’ పాలన చూసిన తరువాత ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, ఒక్కసారి చూద్దామని ఓటు వేసిన వారు ఈసారి ఆయనకు ఓటువేయరని, తటస్థ ఓటర్లు కూడా వేయరనే విశ్వాసాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన ఏ హామీనీ ఆయన నెరవేర్చలేదని, దీంతో తమ పార్టీల గెలుపు సునాయాసం అవుతుందనే భరోసా వారిలో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఈసారి ఎమ్మెల్యేల పనితీరు కన్నా ముఖ్యమంత్రి జగన్‌ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ‘జగన్‌’పై వ్యతిరేకత, రెండు బలమైన పార్టీల కలయికతో ఈ ప్రాంతంలోని మంత్రులంతా ఓడిపోతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ