WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' కేసులు కూడా వీగిపోతాయా...!?

2జీ స్పెక్ట్రమ్‌ స్కాంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు యావత్‌ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. కొందరిని నిజాయితీపరులైన అధికారులను నివ్వెరపరిచింది. యుపిఎ హయాంలో జరిగిన ఈ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనా కాలంలో జరిగిన అతి పెద్ద అవినీతి కేసుగా ఇది నిలిచింది. తమిళనాడుకు చెందిన అప్పటి కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజా, అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె, ఎంపిగా ఉన్న కణిమెళి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. లక్షల కోట్ల కుంభకోణానికి కారకులుగా వీరిని నిందితులుగా చూపుతూ అప్పట్లో సీబీఐ వీరిని అరెస్టు చేసి జైలులో పెట్టింది. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ న్యాయస్థానం విచారిస్తూ నిన్న తీర్పును ఇచ్చింది. ఈ కేసులో నిందితులందరూ నిర్దోషులంటూ...తీర్పు ఇవ్వడంతో..దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. నిందితులకుపై మోపబడిన అభియోగాలకు సాక్ష్యాలు లేవని, అసలు కుంభకోణమే జరగలేదని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితులపై ఆధారాలు చూపించడంలో సీబీఐ విఫలమైందని కూడా న్యాయస్థానం విమర్శించింది. కాగా..ఈ కేసులో ఇటువంటి తీర్పు రావడంపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లక్షల కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారు నిర్దోషులుగా విడుదలవడంతో...ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేసులు ఎదుర్కొంటున్న వై.ఎస్‌.జగన్‌ కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ప్రచారం జరుగుతోంది.

  2జీ స్పెక్ట్రమ్‌ కేసులో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనాయకుడు వై.ఎస్‌.జగన్‌ కూడా నిర్దోషిగా విడుదల అవుతాడని..ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు వై.ఎస్‌.జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించారని ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఆయా కేసుల్లో 'జగన్‌'ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తరువాత బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన కేసులపై కోర్టులో విచారణ జరుగుతున్నాయి. కేవలం ఆయనపైనే కాకుండా ఆయనకు సహకరించారని కొందరు ఐఎఎస్‌ అధికారులు, రాజకీయనాయకులు కూడా ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఆయనపై   ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌ వంటి కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం ప్రతిశుక్రవారం 'జగన్‌' కోర్టులకు హాజరవుతున్నారు. ఈ కేసుల్లో విచారణ చివరి దశకు వస్తోంది. కొన్ని కేసుల్లో ఇప్పటికే కొందరు ఐఎఎస్‌ అధికారులు, ఇతర పారిశ్రామికవేత్తలకు సంబంధం లేదని వారిని తప్పించారు. వీరిని తప్పిస్తే...తమ నేత కూడా నిర్దోషిగా బయటకు వస్తారని 'జగన్‌' అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. తమ నేత అధికారంలో లేరని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారనే దానిపై సాక్ష్యాలు లేవని, ఈ కేసులు నిలబడవని మొదటి నుంచి 'జగన్‌' సానుభూతి పరులు వ్యాఖ్యానిస్తున్నారు. 

  మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'రమాకాంత్‌రెడ్డి' కూడా ఈ కేసులు నిలబడబోవని, రాజకీయ కక్షతో పెట్టిన కేసులని ఆయన 'సాక్షి' ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే 'జగన్‌' అభిమానులు, ఆయన కులస్తులు...ఏమి చెప్పినా....కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న దానిపై 'జగన్‌' శిబిరంలో ఉత్కంఠత నెలకొని ఉంది. అయితే ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా భావిస్తున్న '2జీ స్పెక్ట్రమ్‌' కేసులో నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించడంతో తమ నేతకు అటువంటి తీర్పే వస్తుందని వారు ఆశిస్తున్నారు. కాగా...2జీ స్పెక్ట్రమ్‌ కేసు నుంచి నిందితులు బయటపడడం వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న సందేహాలు, విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 2019లో రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పెద్దలు డిఎంకెకు సహాయం చేశారనే భావన దేశ ప్రజల్లో సర్వత్రా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తమ నేత 'జగన్‌' మొదటి నుంచి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారని...దాంతో ఆయనను కూడా వారు ఇదే విధంగా కేసుల నుంచి బయటపడేస్తారనే భావన 'జగన్‌' అభిమాన వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

  కాగా...'జగన్‌' కేసులపై అధికార టిడిపి విభిన్నంగా స్పందిస్తోంది. 'జగన్‌'పై ఉన్న కేసుల్లో ఇప్పటికే రుజువులు ఉన్నాయని, ఆయనను తప్పించడం ఎవరి వల్లా కాదని వారు అంటున్నారు. ముఖ్యంగా మనీలాండరింగ్‌ కేసులో ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఉన్నాయని, ఇంతకన్నా సాక్ష్యాలు ఏమి ఉంటాయని..దీన్ని ఆధారంగా చేసుకుని కోర్టులు తీర్పు ఇస్తాయని, దీంతో 'జగన్‌' మరోసారి జైలుకెళ్లక తప్పదని వారు అంటున్నారు. మొత్తం మీద 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో వచ్చిన తీర్పు 'జగన్‌' వర్గంలో ఉత్సాహాన్ని నింపగా...టిడిపి వర్గాల్లో నిరుత్సాహాన్ని నింపింది. మరి 'జగన్‌' కేసుల విషయంలో కోర్టులు ఏమి చెబుతాయో...వేచి చూడాల్సిందే...!


(1576)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ