WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జెసి'పై 'చంద్రబాబు' వేటు వేస్తారా..!?

నాలుగు రోజుల విదేశీపర్యటన ముగించుకుని శుక్రవారం నాడు విజయవాడ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు మూడు సమస్యలు వస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఆయన విజయవాడలో లేకపోయినప్పటికీ..మాల్దీవుల నుంచే ఆయా సమస్యలపై స్పందించారు. గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపి గెలుపుపై అక్కడ నుంచే ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను అభినందించారు. ఈ నాలుగు రోజుల్లో వచ్చిన మూడు ప్రధానమైన సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత పరిష్కరించాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానమైనది...అనంతపురం టిడిపి నాయకుల మధ్య నెలకొన్న గొడవ. ఆ జిల్లాల్లో ఇప్పటికే ఉప్పూనిప్పూలా ఉన్న జె.సి.దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరిల గొడవపై పరిష్కారం కొనుగొనడం ఒకటి. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాల వల్ల పార్టీ నష్టపోతుందనే అభిప్రాయం జిల్లా వ్యాప్తంగా నెలకొంది. నగర మేయర్‌ వ్యవహారంలో వీరు వ్యవహరించిన తీరుపై 'చంద్రబాబు' ఆగ్రహంగా ఉన్నారు. జెసి దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరిలపై ఇప్పటికే సీరియస్‌ అయిన ఆయన వారిద్దరిలో ఎవరో ఒకరిపై వేటు వేస్తారనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ముఖ్యంగా జెసి వ్యవహారశైలిపై ఆయన గత కొంత కాలంగా ఆగ్రహంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో జెసిపై వేటు పడడం ఖాయమని 'ప్రభాకర్‌చౌదరి' వర్గం ప్రచారం చేస్తుంది. కాగా...ప్రభాకర్‌చౌదరినే వదులుకునేందుకు 'బాబు' సిద్ధమవుతారని..ఈసారి వారిద్దరిలో ఎవరినీ ఉపేక్షించరని అంటున్నారు. విదేశీపర్యటన తరువాత 'చంద్రబాబు' ఆగ్రహాన్ని వీరిద్దరూ తొలుత చూడబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  కాగా..రెండోది..పోలవరం ప్రాజెక్టు వ్యవహారం. 'చంద్రబాబు' విదేశీపర్యటనలో ఉన్నప్పుడు 'పోలవరం' ప్రాజెక్టుపై ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ..తాను ప్రాజెక్టును సందర్శిస్తానని హామీ ఇచ్చి...దానికి డుమ్మాకొట్టారు. అంతే కాకుండా..ప్రాజెక్టుకు అవసరమైన ఇనుము, సిమెంట్‌ను కొన్ని కంపెనీల నుంచి అప్పు ఇప్పిస్తానని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అయింది. అయితే ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ ప్రాజెక్టు పనుల తీరుపై జలవనరులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, ఆ శాఖ అధికారులతో ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య సమీక్ష నిర్వహించడంపై దేశ వ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి..కేంద్ర మంత్రిని కూర్చోబెట్టుకుని ఒక ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం అరుదైన విషయం...దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా...ఆంధ్రాలో మాత్రం హర్షం వ్యక్తం అవుతుంది.  ఇక మూడవది..గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపి గెలిచిన తరువాత..ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చేసిన వ్యాఖ్యలు..దానికి ప్రతిగా..టిడిపి నేతలు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి.  దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిసారించబోతున్నారు. పొత్తులు,ఎత్తులపై ఆయన రాబోయే రోజుల్లో వివరణ, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు. మొత్తం మీద వ్యక్తిగత పర్యటనను ముగించుకుని విజయవాడకు వచ్చి 'చంద్రబాబు' ఈ మూడు అంశాలపై దృష్టిపెడతారని పార్టీ నాయకులు చెబుతున్నారు.


(1054)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ