WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలోకి 'రఘువీరారెడ్డి'...!

పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. సోషల్‌మీడియాలో ఈ మేరకు ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. అధికార టిడిపిని సమర్థించే ఓ వెబ్‌సైట్‌ దీని గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తోంది. ఆరు నెలల్లో ఆయన టిడిపిలో చేరడం ఖాయమని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే టిడిపి పెద్దలతో చర్చించారని, ఆరు నెలల ముందటే ఆయన తన బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు మరో ఆరు మాసాలు సమయం ఉన్న పరిస్థితుల్లో 'రఘువీరారెడ్డి' టిడిపిలో చేరతారని, ఆయన అనంత ఎంపీగా పోటీ చేస్తున్నారని  ప్రచారం జరుగుతోంది. 'రఘువీరారెడ్డి'ని టిడిపిలో చేర్చుకుని ప్రస్తుతం పార్టీలో సమస్యలు సృష్టిస్తోన్న ఎంపీ జెసి దివాకర్‌రెడ్డికి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి చంద్రబాబు చెక్‌ పెట్టబోతున్నారట. అంతే కాకుండా 'రఘువీరారెడ్డి' టిడిపిలో చేరితే...జెసి సోదరుల్లో ఒకరికే టిక్కెట్‌ ఇస్తారని, ఇప్పటికే 'దివాకర్‌రెడ్డి' తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో 'అనంతపురం' ఎంపిగా 'రఘువీరారెడ్డి'ని పోటీ చేయిస్తారట. రఘువీరారెడ్డి చేరికతో జిల్లాలో నెలకొన్న గ్రూపు తగాదాలకు చెక్‌ పెట్టవచ్చని...టిడిపి అధినాయకత్వం పేర్కొంటుంది.

   సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న 'రఘువీరారెడ్డి'కి దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడని పేరుంది. రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న రోజుల్లో జిల్లాలో 'రఘువీరా' పెత్తనం చెలాయించారు. అప్పట్లో 'జెసి' దివాకర్‌రెడ్డి మొదటి ఐదేళ్లు మంత్రిగా ఉన్నా...ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. జిల్లాలో 'రఘువీరారెడ్డి' ఎదురు లేకుండా దూసుకుపోయారు. అప్పట్లో వై.ఎస్‌ను ఎదరించే సత్తా లేక..దివాకర్‌రెడ్డి...'రఘువీరా' ఏమి చేసినా మౌనంగా భరించారు. వై.ఎస్‌ మరణించిన తరువాత కూడా 'రఘువీరారెడ్డి' జిల్లాలో చక్రం తిప్పారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఘోరంగా తుడిచిపెట్టుకుపోవడంతో...ఆయన కూడా ఓడిపోయారు. తరువాత ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. ఇష్టం లేకపోయినా..'రఘువీరారెడ్డి' ఆ పదవిని స్వీకరించి..నామ మాత్రంగా పనిచేస్తున్నారు. అయితే ఎన్నికలకు మరో ఏడాది ముందర ఆయన వై.ఎస్‌ కుమారుడు 'జగన్‌' పార్టీలో చేరతారని ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు భావించారు. అయితే అనూహ్యంగా ఆయన టిడిపిని ఎంపిక చేసుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 'రఘువీరారెడ్డి'పై ఆసక్తి చూపించారనే ప్రచారం జిల్లాలో జరుగుతుంది. బిసి నేతగా గుర్తింపు ఉన్న 'రఘువీరారెడ్డి'ని టిడిపిలో చేర్చుకుంటే...పార్టీకి కలసి వస్తుందని..అంతే కాకుండా..జిల్లాలో చీటికి మాటికి...ఇబ్బందులు సృష్టిస్తోన్న 'జెసి' వర్గానికి 'రఘువీరారెడ్డి' ద్వారా చెక్‌ పెడితే..వారు నోరు ఎత్తరనే వ్యూహంలో బాగంగానే...'రఘువీరారెడ్డి'ని ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. అయితే..ఇది ఎంత వరకు జరుగుతుందనే ప్రశ్న కూడా పలు వర్గాల నుంచి వస్తోంది. 

   ప్రస్తుతం పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న 'రఘువీరారెడ్డి' ఆ పార్టీని వదిలి ప్రాంతీయ పార్టీలో చేరతారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా...రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకోకపోయినా...జాతీయ స్థాయిలో పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి...కాంగ్రెస్‌ కనీసం రెండు వందల పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకోగలిగితే..ఇతర పార్టీల సహకారంతో 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వస్తే...'రఘువీరారెడ్డి'కి ఏదైనా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తారనే..మాట వినిపిస్తోంది. ఒక దశలో 'రఘువీరారెడ్డి' కర్ణాటక రాష్ట్రం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే మాట వినిపించింది. అనంతపురం పక్కనే ఉన్న కర్ణాటకలోనూ 'రఘువీరారెడ్డి'కి రాజకీయంగా పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను అక్కడ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేసింది. అయితే ఇవన్నీ ఒక కొలిక్కి రాలేదు. ఈ ఆలోచనలు ఇలా ఉన్న సమయంలో టిడిపి నుంచి వచ్చిన ఆఫర్‌ 'రఘువీరారెడ్డి'కి నచ్చిందని... అనంతపురం ఎంపీగా పోటీ చేస్తే..కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో కానీ..లేక ఇతర ప్రభుత్వాల్లో కానీ...కేంద్ర మంత్రి పదవి లభిస్తుందనే భావన ఆయనకు వచ్చిందని...అందుకే ఆయన టిడిపిని ఎంచుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా...'రఘువీరారెడ్డి' టిడిపిలో చేరితే..టిడిపితో పాటు...ఆయనకు కూడా లాభం కలుగుతుందన్న మాట వాస్తవమే...! చూద్దాం..ఏమి జరుగుతుందో...!?


(12684)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ