WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ'కి దెబ్బ మీద దెబ్బ...!

కాలం కలసి రాకపోతే...తాడే...పామై కరుస్తుందనేది సామెత....! కాలం కలసి వచ్చినన్నాళ్లూ అందరూ హీరోలే...! అదే కాలం కలసి రాకపోతే...అందరూ విలన్లే...! నిన్న మొన్నటి దాకా...భారత ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలో రాజకీయంగా ఎదురే లేదు..! రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఆయన జెండానే ఎగురుతుందని...అందరూ భావించారు. నాలుగైదు మాసాల క్రితం వరకు..ఆయన మళ్లీ గెలవరని ఎవరైనా అంటే... వారు పిచ్చివారైనా అయి ఉండాలి...లేదా వారికి భారత రాజకీయాల గురించి తెలిసైనా ఉండకపోచ్చు అనైనా అనుకోవాలి...కానీ.. ప్రస్తుతం...ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా..? లేదా..అనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. గతంలో ఇటువంటి చర్చే ఉండేది కాదు..నలుగురు కలిసినప్పుడు...'మోడీ' మళ్లీ గెలవడం తధ్యమనే చర్చే ఎక్కువ జరిగేది..నలుగురిలో ముగ్గురు ఆయన వైపే ఉండేవారు..కానీ.. ఇప్పుడు గతంలో వలే ఆయన ఏకపక్షంగా అధికారంలోకి వస్తారని  ఎక్కువ మంది భావించడం లేదు...! ప్రముఖ రాజకీయ విశ్లేషుకులు, జ్యోతిష్కులు, సర్వే సంస్థలు కూడా బిజెపి మళ్లీ ఒంటరిగా అధికారంలోకి వస్తుందా..? అని ప్రశ్నిస్తే...ఎక్కువ సంస్థలు లేదనే సమాధానాన్నే ఇస్తున్నాయి. కేవలం వారే కాదు..దేశ జనాభాలో సగం మంది అటువంటి అభిప్రాయాన్నే కల్గి ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

  హఠాత్తుగా 'మోడీ' గ్రాప్‌ పడిపోవడానికి కారణమేమిటి..? గత మూడేళ్ల నుంచి వెలిగిపోయిన ఆయన ప్రభ కొడిగట్టడంలో ఏయే అంశాలు ప్రభావితం చేశాయి...ఆయనేమీ గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వలే...అవినీతి పరుడు కాదు..కదా...? తన బంధు,మిత్రులకు ప్రజల సంపదను దోచి పెట్టడం లేదు..కదా...? నిబద్దతతో, నిజాయితీతోనే పరిపాలిస్తున్నారు..కదా...! దేశ, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు కదా..? మరెందుకు...ఆయనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే పలు కారణాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ప్రజలు 'మోడీ'ని ఓ సూపర్‌మ్యాన్‌లో భావించడం...ఆయన అధికారంలోకి వస్తే...గత 60ఏళ్ల సమస్యలను ఆయన ఒక్కరోజులోనే తీర్చేస్తారనే భావన..ఒకటి కాగా..! రెండోది...తాము ఊహించినట్లు ఆయన మిగతా రాజకీయ నాయకుల కన్నా...భిన్నమేమీ కాదనే..రాజకీయ నాయకుల్లో ఆయనో భాగమన్న సంగతి తెలిసిపోవడం. అధికారం కోసం ఆయన మిగతా రాజకీయనాయకులవలే...ఎత్తులు,పైఎత్తులు.. అవినీతిని ప్రోత్సహించడం, విలువలను తుంగలోతొగ్గడం...! ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిరంకుశంగా అనుభవించడం తప్ప..ఆయన ఈ నాలుగేళ్లలో చేసిందేమీ లేదని ప్రజలు గ్రహించడంతోనే ఆయన గ్రాఫ్‌ రోజు రోజుకు తగ్గిపోతోంది. గత యుపిఎ ప్రభుత్వానికి..ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వానికి మధ్య తేడా లేకపోవడాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. 

  నాడు కొన్ని కుటుంబాలు..అడ్డగోలుగా దోపిడీకి పాల్పడితే..ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నాయనే భావన ప్రజల్లో పెరిగిపోతోంది. అర్థం పర్థం లేని నిర్ణయాలు(పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి) ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నా..తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నట్లు వ్యవహరించడం మరో కారణం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని హీన స్థితిని ప్రజలు భరించి..భరించి..మోసపోయింది..చాలనే భావనలోకి రావడంతోనే...ఇప్పుడు 'మోడీ'కి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో...గుడ్డిలో మెల్ల చందంగా గెలిచినా...దాన్ని గెలుపుగా ప్రజలెవరూ భావించడం లేదు. గుజరాత్‌ ఎన్నికల్లో..మోడీ..గెలిచినా.. కాంగ్రెస్‌ గెలిచిందని ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు...! 'మోడీ'ని 'రాహుల్‌' మూడు చెరువుల నీళ్లు తాగించడానే అభిప్రాయం దేశ వ్యాప్తంగా ఉంది. గుజరాత్‌లో టెక్నికల్‌గా బిజెపి గెలిచినా...ఆ గెలుపును ఆస్వాదించలేని పరిస్థితిలో 'మోడీ' అండ్‌ కో ఉంది. ఇదే మొదటి దెబ్బ అని వారు భావిస్తున్న సమయంలో...ఇప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై కోర్టు ఇచ్చిన తీర్పు 'మోడీ' మెడకు చుట్టుకుంటోంది. వాస్తవానికి దీనిలో 'మోడీ' ప్రత్యక్షంగా చేసిందేమీ లేదు. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ అవినీతి కేసులో..న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం వెనుక 'మోడీ' ప్రమేయం ఉందనే ఆరోపణలు, విమర్శలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

  రెండు నెలలు క్రితం 'మోడీ' హఠాత్తుగా తమిళనాడు పర్యటన పెట్టుకుని..డిఎంకె నేత 'కరుణానిధి'ని కలసి ఆయన ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేయడం, ఢిల్లీ వచ్చిన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని ఆహ్వానించడం వంటి చర్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. స్వంత తల్లిని ఇంట్లో పెట్టుకోని 'మోడీ'..'కరుణానిధి'ని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోమనడం వెనుక...రాబోయే రాజకీయ అవసరాలు ఉన్నాయనే అభిప్రాయం అప్పుడే వ్యక్తం అయింది. వచ్చే ఎన్నికల్లో తనకు స్వంతంగా మెజార్టీ రాకపోతే..డిఎంకె సహాయం తీసుకోవడం దీని వెనుక ఉన్న పరమార్థం. అయితే...ఇప్పుడు..2జీ తీర్పు..వెనుక..'మోడీ' ప్రమేయం ఉందని అనుకోవడానికి కూడా కారణాలు ఇవే...! దేశ ప్రజల్లో ఎక్కువ మంది ఈ ఆరోపణలను, విమర్శలను నమ్ముతున్నారు. సీబీఐ న్యాయస్థానం తీర్పును 'మోడీ' ప్రభావితం చేశారనే వారిని 'మోడీ' అండ్‌ కో ఎలా ఎదుర్కోగలుగుతుంది. మొత్తం మీద...ఓడలు..బండ్లు..బండ్లు ఓడలు అవుతాయని తెలుసు కానీ..మరీ రెండు మూడు నెలల్లోనే..ఈ విధంగా పరిస్థితి మారిపోతుందని..ఎవరూ ఊహించలేదు..! ఏం చేస్తాము..చేసుకున్నోళ్లకు చేసుకున్నంత...!?


(2553)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ