WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నరేగా' అదుర్స్‌...అభినందించిన కేంద్రం...!

ఎస్‌ఆర్‌ఇఎస్‌(నరేగా) పనులు ఆంధ్రప్రదేశ్‌లో చాలా చక్కగా పూర్తి అయ్యాయని,ఎటువంటి విమర్శలు, ఆరోపణలు దీనిపై రాలేదని తనిఖీకి వచ్చిన కేంద్ర బృందం కితాబు ఇచ్చింది. కృష్ణా,గుంటూరు జిల్లాలలో జరుగుతున్న 'నరేగా' పనుల పరిశీలన కోసం కేంద్ర బృందం వచ్చిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణాభివృద్ధి మరియు ఎస్‌ఆర్‌ఇఎస్‌ పనులను ఆడిట్‌ చేసేందుకు నలుగురి సభ్యుల బృందం వచ్చి..ఆ పనులను పూర్తి చేయటం జరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న అనేక మండలాల్లో ఈ బృందం సభ్యులు పర్యటించారు...ఆయా మండలాలు, గ్రామాల్లో జరిగిన పనులను పరిశీలించి నిధుల వినియోగం, పనుల్లో నాణ్యతను పరిశీలించడమే కాకుండా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులను కలసి వివరాలను పరిశీలించారు. జరిగిన పనులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేయటమే కాకుండా, రిపోర్ట్‌లను ఆడిట్‌ కూడా చేశారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్రం బృందం, మంగళవారం నాడు గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించబోతోంది. 'నరేగా' పనులను సకాలంలో పూర్తి చేయటంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఆడిట్‌ చేసిన కేంద్ర బృందం కితాబు ఇవ్వడంతో..నిన్నటి వరకు విమర్శలు చేసిన వారి నోరు కట్టేయడం జరిగిందని, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులుమీడియా వర్గాలకు తెలిపారు. నిధులను వినియోగించడంతో పాటు రికార్డుల నిర్వహణ ఎంతో బాగుందని, కృష్ణా జిల్లాలో ఈ విషయాలను తమ కళ్లతో చూశామని, కేంద్రం బృందం అధికారులు సంతృప్తినిచ్చాయని కమీషనర్‌ రామాంజనేయులు తెలిపారు. కేంద్ర బృందం సభ్యులు కలెక్టర్‌ లక్ష్మీకాంతంతో సమావేశమై ఆయన పనితీరును అభినందించారు. కేంద్ర బృందం భారతదేశంలో ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని, కృష్ణా జిల్లాలో జరిగిన పనులు మరెక్కడా జరగలేదని, ఎటువంటి అవకతవకలు కానీ, ఫిర్యాదులు కానీ తమ దృష్టికి రాలేదని వారు స్పష్టం చేశారు. గ్రామాల్లో కూడా జవాబుదారీతనంతో అందరూ పనిచేశారని, పనులు సక్రమంగా పూర్తి చేశారని, చివరకు కూలీలు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని కేంద్రం బృందం తెలిపారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత తమకు రాలేదని, నరేగా పనుల ద్వారా జరిగిన పనుల్లో లోపాలు లేవని, కృష్ణా జిల్లాలో జరిగిన విధంగా దేశంలోని అన్ని గ్రామాల్లో జరిగితే..ఎంతో ముందుకు దూసుకుపోతుందని కేంద్ర బృందం సభ్యులు చెప్పారని డ్వామా అధికారులు, పంచాయితీ అధికారులు చెప్పారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం తమను నిత్యం ప్రోత్సహిస్తూ...'నరేగా'పనులు సకాలంలో పూర్తి అయ్యేలా సహకరించారని కేంద్రం నుండి సకాలంలో నిధులు రాబట్టడంలో ఆ శాఖ కమీషనర్‌ రామాంజనేయులు పలుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో సమావేశమై నిధుల బకాయిలను విడుదల చేయించారని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కృష్ణా జిల్లాలో జరిగిన 'నరేగా' పనులు, నిధులు వినియోగం, రికార్డుల నిర్వహణ,జవాబుదారీతనం, ఇంతకుముందు ఎక్కడా చూడలేదని రేపు గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

(854)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ