WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డిఎంకె కొంప ముంచిన 'బిజెపి'...!

అధికార బిజెపికి రోజులు బాగాలేనట్లు ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి ఆ పార్టీ ఏది చేసినా కలసి రావడం లేదు. ఏదో చేద్దామనుకుంటే...ఇంకేదో అవుతోంది. మొన్న గుజరాత్‌ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచినా...'జనాలు' అదసలు గెలపే కాదంటూ ఈసడించుకుంటున్నారు. సరే...వాళ్లేమైనా అనుకోని...టెక్నికల్‌గా బిజెపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సర్దిచెప్పుకున్నా...తరువాత పరిణామాలు బిజెపి పెద్దలకు అసలు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా దక్షిణాదిలో పాగా వేయాలన్న తమ కలలు కల్లలు అవుతున్నాయనే భయం ఆ పార్టీ నేతలను ఆవరిస్తోంది. గుజరాత్‌లో గెలిచిన తరువాత..ఇక దక్షిణాదితో తాము ఊపేస్తామని, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొందరు బిజెపి నేతలు ప్రకటించారు. అయితే..నిన్న ఫలితాలు వెల్లడించిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక వారి సత్తా ఏమిటో బయటపెట్టింది. అక్కడ పోటీ చేసిన బిజెపి అభ్యర్థి వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేక చతికిలపడ్డారు. వాళ్లకు ఓట్లు రాకపోయినా..ఫర్వాలేదు..బిజెపితో అంటకాగుతున్నారన్న కోపంతో...ప్రతిపక్ష డిఎంకెకు కూడా తమిళ తంబిలు డిపాజిట్‌ లేకుండా చేశారు.

   జయలలిత మరణం తరువాత...ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా..ప్రతిపక్ష డిఎంకె అక్కడ గెలుస్తుందని ఎక్కువ మంది భావించారు. దానికి కారణం...అన్నాడిఎంకెలోని రెండు పక్షాలు గొడవలు పడడం. అక్కడ ముఖ్యమంత్రి వర్గం, శిశికళ వర్గం ఓట్లు చీల్చుకుంటే...డిఎంకె సులువుగా గెలుస్తుందని రాజకీయపరిశీలకులు భావించారు. మొన్నటి వరకు అందరూ అదే ఊహించారు కూడా...! కానీ..అనూహ్యంగా 2జీ కేసులో డిఎంకె నేతలు నిర్దోషులని సీబీఐ న్యాయస్థానం ప్రకటించడం, దీని వెనుక అధికార బిజెపి పెద్దల హస్తం ఉందని తమిళులు భావించడం, అదీ కాక..డిఎంకె అధ్యక్షుడు 'కరుణానిధి'ని ప్రధాని 'మోడీ' పరామర్శించడంతో..డిఎంకె..బిజెపి పొత్తు ఖాయమేనని వారు భావించారు.దీంతో ఎన్నికల నాడు బిజెపిపై ఉన్న కోపాన్ని డిఎంకెపై చూపించినట్లు ఓటింగ్‌ సరళిని బట్టి అర్థం అవుతుంది. 

  తమిళనాడులో బిజెపికి స్థానం లేదని, అక్కడ డిఎంకె లేక పోతే..అన్నాడిఎంకెకు మాత్రమే స్థానం ఉందని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైంది. రాజకీయ అవసరాల కోసం డిఎంకె బిజెపితో సన్నిహితమైతే..రాబోయే రోజుల్లో డిఎంకె కూడా చుక్కలు చూపిస్తామని ఈ ఎన్నిక ద్వారా తమిళులు రుజువు చేశారు. జయలలిత బతికి ఉన్న రోజుల్లో తమిళనాడు వైపు చూడడానికి భయపడిన బిజెపి నేతలు..ఆమె మరణం తరువాత...తమిళరాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు దీనిని బట్టి..తెలుస్తోంది. 'జయ' అనారోగ్యంతో హాస్పటల్‌లో ఉన్నప్పుడు ఆమెను పరామర్శించడానికి రాని 'మోడీ' 'కరుణానిధి'కి ఆరోగ్యం బాగాలేకపోతే..ఆయన ఇంటికి రావడం..ఢిల్లీలోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో...'మోడీ' ఎత్తులను తమిళులు బాగానే గ్రహించారు. అందుకే అదనపు చూసి కొర్రు కాల్చి వాతపెట్టినట్లు ఈ ఫలితాలు రుజవు చేశాయి. దానా దీనా..రాబోయే ఎన్నికల్లో... తమిళనాడులో 'బిజెపి'కి స్థానం లేదనే విషయం..ఈ ఎన్నికలతో తమిళులు స్పష్టం చేశారు.

(1249)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ