WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' భయపడ్డారా...!?

కర్నూలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన పార్టీ తరుపున అభ్యర్థిని బరిలోకి దించడానికి వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ భయపడ్డారా..? అంటే అవుననే అంటున్నాయి..ఆ పార్టీ వర్గాలు. ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన అభ్యర్థి కోసం వెతుకుతూనే ఉన్నారు. ముందుగా గతంలో టిడిపి నుంచి పోటీ చేసిన 'శిల్పా చక్రపాణిరెడ్డి'ని పోటీ చేయమని ఆయన కోరారు. దీనికి ఆయన సున్నితంగానే తిరస్కరించారట. తాము ఇప్పుడు పోటీ చేసే ప్రసక్తేలేదని..ఇప్పటి వరకు జరిగింది చాలన్నట్లు మాట్లాడారట...? దీంతో గతంలో పోటీ చేసిన 'గౌరు వెంకటరెడ్డి'  మళ్లీ పోటీ చేయమని కోరడంతో ఆయన కూడా నిరాకరించినట్లు తెలుస్తోంది. తనకు అంత ఆర్థిక వనరులు లేవని, పార్టీ ఆర్థిక వనరులను సమకూరిస్తే పోటీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపారని ప్రచారం జరుగుతోంది. అయితే..అందుకు అధ్యక్షుడు సుముఖంగా లేకపోవడంతో వేరే అభ్యర్థిని వెతకాలని 'జగన్‌' భావించారు. అయితే పార్టీలో ఎవరిని పోటీ చేయన్నా ఏదో ఒక కారణం చెబుతూ..పోటీకి దూరంగా ఉన్నారు.  దీంతో టిడిపి తన అభ్యర్థిని ప్రకటించే వరకు వైకాపా వేచి చూసి.. వారు అభ్యర్థిని ప్రకటించిన తరువాత..తాము ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, నంద్యాలలో అధికార టిడిపి అక్రమాలను చూశామని, ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఇదే విధంగా చేస్తారని, అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైకాపా నేతలు ప్రకటించారు. దీంతో టిడిపి అభ్యర్థి కె.ఇ. ప్రభాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

   కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా దూరంగా ఉండడంపై ఆ పార్టీలోనే మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. పోటీ చేయాల్సిన చోట పోటీ చేయకుండా..పోటీ చేయకూడని చోట పోటీ చేసి తమ అధ్యక్షుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని వారు ఆక్షేపిస్తున్నారు. 'నంద్యాల' శాసనసభ్యుడు 'భూమా నాగిరెడ్డి' హఠాత్తుగా మరణించి ఉప ఎన్నికలు వస్తే...అక్కడ పోటీ పెట్టవద్దని...'నాగిరెడ్డి' కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, అధికార టిడిపి అడిగినా ససేమిరా..అంటూ 'జగన్‌' అక్కడ పోటీకి దిగారు. సిట్టింగ్‌ శాసనసభ్యుడు హఠాన్మరణం చెందితే..ప్రతిపక్షం పోటీకి అభ్యర్థిని నిలపకుండా..ఆ కుటుంబానికి చెందిన వారికి అవకాశం కల్పించడం ఆచారంగా వస్తోంది.  కానీ.. 'జగన్‌' మాత్రం సాంప్రదాయాలను పట్టించుకోకుండా ఎన్నికల గోదాలోకి దిగి చేయి కాల్చుకున్నారు. నాడు 'నంద్యాల'లలో పోటీ చేయకుండా ఉంటే పరువు నిలిచేది..పార్టీ చాలా బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవడానికి, పార్టీ కార్యకర్తల్లో స్తైర్యం నెలకొల్పడానికి, బలంగా పోరాడడానికి అవకాశం ఉండేది. కానీ...పోటీ చేసి 'జగన్‌' తన బలహీనతలను తానే బయటపెట్టుకున్నారు. సరే...అప్పుడేదో..తొందరలో సరైన నిర్ణయం తీసుకోలేదని భావించినా.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ సరైన నిర్ణయం తీసుకోలేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుందోంది.

   ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం ద్వారా...తాము చాలా బలహీనంగా ఉన్నామనే సంకేతాలను 'జగన్‌' పంపించారనే అభిప్రాయం పార్టీ వర్గాలతో పాటు, ఇతరుల్లోనూ కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటే..టిడిపి ఏకగ్రీవం గెలుస్తోంది. ఇది పార్టీకి ఇబ్బందే...అదే పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటే తమ పార్టీ ఓటర్లు..తమకు ఓటు వేసేవారని, దాంతో తమ ఓటర్లు చెక్కుచెదరకుండా ఉన్నారనే అభిప్రాయం పార్టీలో ఉండేదని..పోటీ చేయకపోవడంతో...ఎవరు పార్టీలో ఉన్నారో..ఎవరు లేరో..తెలియకుండాపోతుందని వారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోయినా..ఆ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించి..పార్టీ ఉనికిని కాపాడుకుందని...అటువంటి వ్యూహాలు 'జగన్‌' వద్ద లేవనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తం అవుతోంది. నిన్న మొన్నటి దాకా..కర్నూలులో పాదయాత్ర నిర్వహించి పార్టీని పటిష్టం చేస్తున్నామని చెప్పుకున్న తమ నాయకుడు...ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండి..కార్యకర్తలకు ఎటువంటి సంకేతాలు పంపించదలిచారో అర్థం కావడం లేదని అంటున్నారు. 'నంద్యాల' ఉప ఎన్నికతో నష్టపోయిన..తాము..ఇప్పుడు పోటీ చేయకుండా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పార్టీలో ఉత్సాహం కొనసాగడానికి..బరిలోకి దిగితే...బాగుండేదనే మాట ఎక్కువ మంది కార్యకర్తల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే..అధికార టిడిపితో పోటీపడి ఖర్చు చేసే నాయకులు పార్టీలో లేరని, ఆర్థిక వనరులు సమకూర్చడంలో అధిష్టానం మౌనంగా ఉండడంతో పోటీకి ఎవరూ ముందుకు రాలేదని..ఇది ఇలా ఉంటే...పార్టీ సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం అవుతుందని పలువురు సీనియర్లు వాపోతున్నారు.


(1354)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ