WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలోకి 'కోట్ల'...!?

'నంద్యాల' ఉప ఎన్నికల తరువాత కర్నూలు జిల్లాలో టిడిపి వేగంగా పుంజుకుంటోంది. ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చూపించిన తరువాత..ప్రతిపక్ష వైకాపాకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ బల పడిన టిడిపి...మరో వైపు పార్టీకి పనికి వస్తారనే ఇతర పార్టీ నాయకులపై గురిపెట్టింది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు 'కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి'ని పార్టీలో చేర్చుకోవడానికి కసరత్తులు చేస్తోంది. 'కోట్ల' కుటుంబం టిడిపిలో చేరుతుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరిగినా..అది వాస్తవ రూపం దాల్చలేదు. కొన్నాళ్లు 'కోట్ల' కుటుంబం వైకాపాలో చేరుతుందని ప్రచారం జరిగినా...'జగన్‌' పంచన చేరేందుకు 'కోట్ల' అంగీకరించలేదని సమాచారం. రాయలసీమలో మొదటి నుంచి 'కోట్ల' కుటుంబానికి దివంగత వై.ఎస్‌.కుటుంబానికి రాజకీయ శతృత్వం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అప్రహతింగా పరిపాలిస్తున్న రోజుల్లో ముఖ్యమంత్రి పదవి కోసం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 'కోట్ల విజయభాస్కర్‌రెడ్డి'తో పోటీ పడేవారు. అయితే...అప్పట్లో వై.ఎస్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దగా పట్టించుకునే కాదు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 'కోట్ల విజయభాస్కర్‌రెడ్డి'కి అత్యంత నిజాయితీపరుడనే పేరుంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన నిజాయితీని మెచ్చి పలుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశంతో పాటు..కీలకమైన సిడబ్ల్యుసీలో స్థానం కల్పించింది. అయితే...అనారోగ్యంతో 'కోట్ల విజయభాస్కర్‌రెడ్డి' మృతి చెందిన తరువాత..పార్టీపై 'వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి' పట్టుసాధించగలిగారు. 'కోట్ల' బతికున్నంత కాలం ఆయన కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగానే ఉండిపోయారు. కాలక్రమంలో ఎదిగిన వై.ఎస్‌. తరువాత రాష్ట్రం మొత్తాన్ని తన అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. 

  2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా వీచిన రోజుల్లో కర్నూలులో 'కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి' ఆయన భార్య 'సుజాతమ్మ' ప్రజాప్రతినిధులుగా గెలుపొందారు. తరువాత 'కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి' కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో..రాష్ట్ర విభజనతో 'కోట్ల' కుటుంబం రాజకీయం దెబ్బతింది. అయితే ప్రజల్లో మాత్రం ఆ కుటుంబంపై ఆదరణ దక్కలేదు. దీంతో వారిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టిడిపి, వైకాపాలు పోటీపడుతున్నాయి. అయితే తాము కాంగ్రెస్‌ను వీడి రామని 'కోట్ల' కుటుంబం చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానిని ఎంచుకోక తప్పని పరిస్థితి. అయితే తమ తండ్రితో పోరు సల్పిన వై.ఎస్‌ కుటుంబం కంటే..టిడిపిలో చేరితేనే బాగుంటుందనేది 'కోట్ల' కుటుంబం అభిప్రాయంగా ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే వారి రాకను టిడిపిలోని 'కె.ఇ.కుటుంబం' వ్యతిరేకిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే...పార్టీ అవసరాల రీత్యా వారిని చేర్చుకోవాల్సిందేనని టిడిపి అధిష్టానం గట్టిగా చెబుతోంది. దీనిలో భాగంగా కె.ఇ. కుటుంబాన్ని శాంతపర్చేందుకు వారికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. కర్నూలు ఉపఎన్నికలో కె.ఇ తమ్ముడు కె.ఇ.ప్రభాకర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కెఇ కుటుంబం సంతృప్తి చెందుతుందని, 'కోట్ల' రాకకు వారు అడ్డుకాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో 'కోట్ల'ను పార్టీలో చేర్చేందుకు జిల్లా టిడిపి నాయకులు తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. మొత్తం మీద అతి త్వరలో 'కోట్ల' కుటుంబం టిడిపిలో చేరుతుందని వారు అంటున్నారు. 'కోట్ల' కుటుంబం టిడిపిలో చేరితే జిల్లా మొత్తం మీద టిడిపికి గట్టిపట్టువచ్చినట్లేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.


(8361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ