WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నూతన డీజీపీగా 'మాలకొండయ్య'...!

ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న 'నండూరి సాంబశివరావు' ఈ మాసాంతానికి రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'మాలకొండయ్య'ను నియమించే అవకాశాలు మెరుగుపడ్డాయి. నిజాయితీతోపాటు సమర్థత,మిగతా ఐపీఎస్‌ అధికారులకంటే సీనియర్‌ అయిన 'మాలకొండయ్య'ను డీజీపీగా నియమించాలని 'చంద్రబాబు'కు ముఖ్యబాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి ఒకరు నచ్చ చెప్పి ఒప్పించారు. తన సామాజికవర్గానికి చెందిన 'మాలకొండయ్య'ను డీజీపీగా నియమిస్తే...కులానికి పెద్దపీట వేశారనే విమర్శ వస్తుందని నిన్నటి వరకు వెనుకంజ వేసిన 'చంద్రబాబు'  ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి డీజీపీ పోస్టుకు కులాన్ని ముడిపెట్టడం సరికాదని, డీజీపీ పోస్టులో పనిచేసే వ్యక్తి సమర్థత, నిజాయితీని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని...ప్రస్తుతం ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ల్లో 'మాలకొండయ్య' సమర్థుడు, నిజాయితీపరుడని ప్రభుత్వ పెద్దలను ఒప్పించినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి.  

   కాగా డీజీపీ పోస్టు కోసం 'మాలకొండయ్య'తో పోటీ పడుతున్న ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌కు ఉత్తరాదికి చెందిన అధికారి కావడంతో ఆయనకు అవకాశాలు లేకుండాపోయాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'దినేష్‌కుమార్‌' ఉత్తరాదికి చెందిన వారు. ఇప్పుడు 'ఠాకూర్‌'ను డీజీపీగా నియమిస్తే...ఉన్నతమైన పదవుల్లో మొత్తం ఉత్తరాదికి చెందిన వారే ఉన్నారనే బావన వస్తుందన్న ఉద్దేశ్యంతో 'ఠాకూర్‌'ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.  పైగా 'ఠాకూర్‌' కన్నా 'మాలకొండయ్య' సీనియర్‌ అని, సర్వీసులో మచ్చలేని అధికారిగా పేరుంది. నిజాయితీకే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప...కులాన్ని పరిగణలోకి తీసుకోవద్దని అధికార వర్గాల సూచనల మేరకు నిన్నటి వరకు తాత్సారం చేసినా 'చంద్రబాబు'..తాజాగా 'మాలకొండయ్య' వైపు మొగ్గు చూపబోతున్నారు. 'మాలకొండయ్య'ను డీజీపీగా నియమించాలని పదే పదే నచ్చ చెప్పిన వారిలో ప్రస్తుతం ఒక కీలక ప్రాధాన్యత పోస్టులో పని చేస్తున్న అధికారి ఉన్నారు. పైన పేర్కొన్న అధికారి ఒత్తిడితో నేడో రోపో 'మాలకొండయ్య' నియామకానికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రాంతీయం, సమర్థత, నిజాయితీ 'మాలకొండయ్య'  ను నూతన సంవత్సరంలో ఉన్నత పదవిలో కూర్చుండబెట్టబోతున్నాయి. నిన్నటి వరకు ఆ పోస్టు తనకు దక్కే అవకాశాలు లేవని 'మాలకొండయ్య' తన సన్నిహితులతో చెప్పడం జరిగింది. కానీ..ముఖ్య అధికారి ఒకరు చొరవ తీసుకుని ఆయనను డీజీపీని చేసేందుకు అవసరమైన కసరత్తు చేసి 'చంద్రబాబు'ను ఒప్పించారు. మరో రెండు రోజుల్లో 'మాలకొండయ్య'ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.


(747)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ