WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐఎఎస్‌ అధికారుల్లో ప్రాంతీయ చిచ్చు...!

కీలక ప్రాధాన్యత గలశాఖలకు అధికారులుగా నియమించడంలో ఉత్తరాది అధికారులకు పెద్దపీట వేసి, తెలుగు అధికారులపై వివక్ష చూపుతున్నారని ఐఎఎస్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వివక్షపై ఆధారాలతో రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేయబోతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌', సిఎంఒ ఇన్‌ఛార్జి సతీష్‌చంద్ర, సిసిఎల్‌ఎ 'పునేత', రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 'మన్మోహన్‌సింగ్‌' మానవవనరులశాఖాధిపతి 'ఆదిత్యనాథ్‌దాస్‌'లు ఉత్తరాదికి చెందిన అధికారులే. ఈ విధమైన నియామకాలు గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగలేదని తెలుగు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రధాన కార్యదర్శిగా ఒక ప్రాంతానికి చెందిన వారు ఉంటే..సిసిఎల్‌ఎగా మరో ప్రాంతానికి చెందిన వారు ఉండేవారు. కీలక ప్రాధాన్యత శాఖాధిపతులుగా వివక్ష చూపకుండా..అన్ని ప్రాంతాల వారికి అవకాశం ఇచ్చేవారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న తెలుగు అధికారి అయిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంకు యువజనులు, క్రీడలశాఖకే పరిమితం చేశారు. అదే హోదాలో ఉన్న జెఎస్వీ ప్రసాద్‌ను పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా నియమించారు. దీనిపై ఆయన అసంతృప్తితో సెలవుపై వెళ్లిన విషయం విదితమే. ఏది ఏమైనా ఉత్తరాదికి చెందిన అధికారులకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వడంపై రిటైర్డ్‌ అయిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

  ఈ పోస్టింగ్‌లపై ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేస్తున్నారా..? లేక ఒక ప్రాంతం అధికారులైతే..తన మాటలను జవదాటకుండా పనిచేస్తారనే భావనతో సిఎం ఆ విధంగా చేస్తున్నారా..? లేక ఇంకేమైనా కారాణాలు ఉన్నాయా..? అనే విషయంపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. అదే విధంగా మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి తమిళనాడుకు చెందిన 'కరికాళవళవన్‌' బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన శాఖలన్నింటికి తెలుగేతర అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం నూటికి నూరుశాతం నిజమే..దీనిపై కొందరు సీనియర్‌, రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారులు త్వరలో పత్రికా సమావేశాలను నిర్వహించేందుకు ఒక రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చంద్రబాబు వ్యతిరేకి) ఇప్పటికే పలువురు ఐఎఎస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఆ విధంగా మాట్లాడిన వారిలో ఎక్కువ మంది దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. దీనిపై రాద్ధాంతం చేసి..ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగేతర అధికారులకు ఇష్టుడని ప్రచారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొందరు సీనియర్‌ అధికారులు, జూనియర్‌ అధికారులు సహకరిస్తున్నట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది.

(298)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ