WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కూకట్‌పల్లి' నుంచి 'నాదెండ్ల' పోటీ...!

యువనేత రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత...రాజకీయాల్లో వినూత్న ప్రయోగాలు చేపట్టింది. ఇటీవల జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో బిసీ,ఒబిసి,ముస్లిం మైనార్టీలు, ఒసిలతో కలసి బిజెపికి చుక్కలు చూపించినట్లే...ఇప్పుడు తెలంగాణాలోనూ ప్రయోగాలకు సిద్ధం అవుతోంది.  గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఆంధ్రాలోనూ, తెలంగాణాలోనూ నష్టపోయిన కాంగ్రెస్‌ పార్టీ...ఇప్పుడా తప్పులను సరిచేసుకోబోతోంది. తెలంగాణ ఇచ్చి కూడా రాజకీయ ప్రయోజనం పొందలేకపోయిన కాంగ్రెస్‌...ఈసారి..తన రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అఢుగులు ముందుకేయబోతోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సీమాంద్రులను మచ్చికచేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా...తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు గణనీయంగా ఉన్న చోట ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించబోతుందని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. 

  ముఖ్యంగా హైదరాబాద్‌,రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ప్రాంత నాయకులకు టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా తెనాలి మాజీ శానసభ్యుడు, మాజీ అసెంబ్లీ స్పీకర్‌ 'నాదెండ్ల మనోహర్‌'ను 'కూకట్‌పల్లి' నుంచి పోటీ చేయించాలని 'రాహుల్‌' ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 'నాదెండ్ల' మాజీ ముఖ్యమంత్రి 'నాదెండ్ల భాస్కర్‌రావు' తనయుడు. రాజకీయాల్లో సుధీర్ఘమైన అనుభవం ఉన్న ఆయన తెనాలి నుంచి ఇప్పటికే రెండుసార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర స్పీకర్‌గా ఆయన తనదైనశైలిలో పనిచేసి అందర్నీ మెప్పించారు. కాంగ్రెస్‌ యువనేత 'రాహుల్‌గాంధీ' వద్ద ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దక్షిణాదిలోని 'రాహుల్‌' టీంలో ప్రస్తుతం 'నాదెండ్ల' క్రియాశీలక సభ్యుడు. అటువంటి 'నాదెండ్ల'ను భాగ్యనగరమైన హైదరాబాద్‌ నుంచి బరిలోకి దింపితే..ఆ ప్రభావం సీమాంధ్ర ఓటర్లపై కనిపిస్తుందని... తద్వారా..సీమాంధ్ర ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టవచ్చనేది 'రాహుల్‌గాంధీ' వ్యూహంగా చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జరుగుతోంది. సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు దీనికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సీమాంధ్ర ఓటర్లపై కన్నేసి..ఇటీవల కాలంలో వారిని బుజ్జగిస్తోన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహానికి ప్రతి వ్యూహంగా ఇది పనికి వస్తుందని కూడా ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

   తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లపై కన్నేసిన టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు...ఇటీవల కాలంలో వారిని బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సీమాంధ్రులను దూషించిన కెసిఆర్‌..రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వారితో సఖ్యతను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 'చంద్రబాబు' సామాజికవర్గ నేతలు, వ్యాపారస్తులను ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇద్దరు పత్రికాధిపతులను తన హితులుగా మార్చుకున్న కెసిఆర్‌ వారి ద్వారా ఆ సామాజికవర్గానికి గాలం వేస్తున్నారు. తెలంగాణలో కనీసం 25 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే ఈ సామాజికవర్గం ఓట్లు తనకు గంపగుత్తగా పడితే...ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. దాంతో  ఆ వర్గాన్ని ఆయన దువ్వుతున్నారు. 

   కెసిఆర్‌ ఎత్తుగడను కనిపెట్టిన కాంగ్రెస్‌ తాను కూడా అదే దారిలో పనయనిస్తోంది. దీనిలో భాగంగా...ఆ సామాజికవర్గానికి చెందిన ఆంధ్రా యువనేతలను, ఆ వర్గాలు ఎక్కువగా ఉన్న చోట పోటీకి నిలబెట్టబోతోంది. ఇప్పటికే కెసిఆర్‌పై 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన సామాన్య ఓటర్లు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వారి ఓట్లను తన వైపు మళ్లించుకోవాలనే ఆలోచన కాంగ్రెస్‌లో ఉంది. దీంతో ఆ వర్గానికి తాము సరైన ప్రాధాన్యత ఇస్తామని, కెసిఆర్‌ వలే..ఆ వర్గాలను వేధించమనే హామీతో...వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా.. రాబోయే ప్రభుత్వంలో కీలకమైన స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చి ఆకట్టుకుంటోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే...సీమాంధ్రులపై నెలకొన్న ద్వేషభావాలు పోతాయని, కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని తద్వారా వైషమ్యాలు లేని సమాజం నెలకొంటుందని కాంగ్రెస్‌ పెద్దలు అంటున్నారు. ఏది ఏమైనా 'రాహుల్‌' వ్యూహం ఫలిస్తే...కెసిఆర్‌కు ఇక్కట్లు తప్పనట్లే...!

(5086)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ