WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌' పేరుతో అవినీతి అధికారికి పోస్టింగా...?

ఓ అవినీతి అధికారికి పోస్టింగ్‌ ఇవ్వడం కోసం ముగ్గురు మంత్రులు చేతులు కలిపారు..పైగా... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరుకే ఆమెకు పోస్టింగ్‌ వచ్చేలా..ఈ మంత్రులు చక్రం తిప్పి అనుకున్నది సాధించారు. దీనిలో ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి 'లోకేష్‌'ను కూడా ఆయనకు తెలియకుండానే భాగస్తుడిని చేశారు...అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారికి పోస్టింగ్‌ ఇచ్చి..తాము అనుకుంటే ఎటువంటి వారికైనా పోస్టింగ్‌ ఇవ్వగలమని ఆంధ్రా మంత్రులు సచివాలయం సాక్షిగా రుజువు చేశారు. వివరాలోకి వెళితే... ఆమె ఒక జిల్లాకు ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో..ఆమెను సస్పెండ్‌ చేయాలని ఎక్సైజ్‌ కమీషనర్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఎక్సైజ్‌ కమీషనర్‌ చేసిన సిఫార్సును ఆ శాఖ కార్యదర్శి కూడా సమర్థించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు..కానీ..ఎక్సైజ్‌ మంత్రి మాత్రం అందుకు విరుద్దంగా స్పందించారు. ఆమెను సస్పెండ్‌ చేయకుండానే..ఆమెకు మరో కీలకమైన పోస్టింగ్‌ ఇచ్చారు. ఆమె పేరు 'నాగలక్ష్మి'. ఆమెను చిత్తూరు జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమీషనర్‌గా నియమిస్తూ...ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం నాడు ఆమె నియమిస్తూ జీ.ఓ ఆర్‌.టినెం.1382, 26.12.2017న ఆ శాఖాధిపతి ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పుడు  ఈ నియామకం ఎక్సైజ్‌శాఖలో, సచివాలయంలో సంచలనం సృష్టిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 'నాగలక్ష్మి'ని సస్పెండ్‌ చేయాల్సి ఉండగా..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడం వెనుక ఏదో బలమైన శక్తి పనిచేసిందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు.  

   విజయనగరం జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'నాగలక్ష్మి'తో పాటు మరో అధికారిపై అవినీతి ఆరోపణలు రుజవు కావడంతో వారిద్దరినీ సస్పెండ్‌ చేయాలని ఆశాఖ కమీషనర్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.'నాగలక్ష్మి'ని సస్పెండ్‌ చేయకుండా...'ఆదినారాయణమూర్తి' అనే అధికారిని మాత్రమే సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారు ఆ శాఖ మంత్రి జవహర్‌. ఈ మధ్యలో జరిగిన మార్పులు చేర్పులతో సస్పెండ్‌ అయిన 'ఆదినారాయణ' సస్పెండ్‌ ఉత్తర్వులను రద్దు చేశారు.  అయితే 'నాగలక్ష్మి'ని సస్పెండ్‌ చేయకుండానే ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులో నియమించాలని ఆ శాఖ కార్యదర్శి సిఫార్సు చేసినా..ఆ సిఫార్సులను పక్కన పెట్టి...ఎంతో ప్రాధాన్యత కలిగిన చిత్తూరు జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌గా ప్రభుత్వం నియమించింది.  

రంగంలోకి దిగిన మంత్రులు...!

'నాగలక్ష్మి'ని చిత్తూరు డిసిగా నియమించాలని, ఆ జిల్లాకు చెందిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డితో పాటు సమాచారశాఖమంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా సిఫార్సు చేశారు. ఈ ఇద్దరు మంత్రుల సిఫార్సు వెనుక ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌ హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. సస్పెండ్‌ బారి నుండి బయటపడిన'నాగలక్ష్మి' తనకున్న పరిచయాలతో తనపై ఈగ వాలనివ్వకుండా..పథకం ప్రకారం వ్యవహరించి ఆ గండం నుంచి బయటపడ్డారనే ప్రచారం శాఖలో జరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో డిప్యూటీ కమీషనర్‌గా 'నాగలక్ష్మి''ని నియమించడం సరికాదని, సంబంధించిన ఫైల్‌ను సిఎంకు పంపించాలని ఆశాఖాధిపతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఈ శాఖకు మంత్రిని నేనే..ముఖ్యమంత్రినేనే...నాకు సిఎం ఆమోదం అక్కర్లేదు..నా ఒక్కడి ఆమోదం చాలు..అని 'నాగలక్ష్మి' పోస్టింగ్‌కు మంత్రి జవహర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కానీ  ఆ శాఖాధికారులు ఇది నిబంధనలకు విరుద్దమని, చంద్రబాబు సొంత జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వాలంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం మంచిదని ఆశాఖ అధికారులు మంత్రికి చెప్పారు. అయినప్పటికీ వారి మాట వినకుండా..ఆమెను చిత్తూరు డిసిగా నియమించే ఫైల్‌పై సంతకం చేశారు. కథ ఇంత వరకు ఈ విధంగా నడిచింది..'నాగలక్ష్మి'కి ఏ విధంగా పోస్టింగ్‌ ఇవ్వాలనే విషయంపై అధికారులు తర్జనభర్జనలు పడుతుండగా..మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సిఎంఒ అధికారుల ద్వారా ఆశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అంతే కాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, దీంతో ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వాలని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

అవినీతి అధికారన్న విషయం 'లోకేష్‌'కు తెలుసా...?

'నాగలక్ష్మి'ని చిత్తూరు డిసిగా నియమిస్తున్నట్లు మంత్రి లోకేష్‌కు తెలుసా..? ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణల గురించి 'లోకేష్‌' తెలుసా..? ఆమెపై ఉన్న ఆరోపణల దృష్ట్యా ఆమెను సస్పెండ్‌ చేయమన్న సంగతైనా 'లోకేష్‌'కు తెలుసా..? మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఎందుకు ఈ విషయంలో తల దూర్చారు..? అదే విధంగా చిత్తూరు జిల్లాకు చెందిన పోస్ట్‌ విషయంలో సమాచార మంత్రి కాల్వ శ్రీనివాసులకు సంబంధం ఏమిటి..? మంత్రి లోకేష్‌ను అడ్డుపెట్టుకుని ఈ ముగ్గురు మంత్రులు కలసి అవినీతి అధికారికి పోస్టింగ్‌ ఇచ్చారా..? ముఖ్యమంత్రి జిల్లాల్లో అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిని నియమించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని..మంత్రి లోకేష్‌ ఎవరితో చెప్పారు..? ఆయన స్వయంగా చెప్పారా..? మరెవరితోనైనా చెప్పించారా..? సిఎంఒ అధికారి శాఖాధిపతితో స్వయంగా మాట్లాడి..'నాగలక్ష్మి' నియామక ఉత్తర్వులు ఇవ్వమని చెప్పారా..? దీనిపై సచివాలయంలో, ఎక్సైజ్‌శాఖలో సంచలనం సృష్టించడమే కాకుండా..మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసుల సిఫార్సులపై విమర్శలు వస్తున్నాయి. 

'నాగలక్ష్మి' పోస్టింగ్‌, సస్పెండ్‌ తదితర వ్యహారాలపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గతంలోనే  కథనాలను ప్రచురించింది. కాగా ఇదంతా అబద్దమని, 'నాగలక్ష్మి'పై ఎటువంటి ఆరోపణలు లేవని, ఆమెను సస్పెండ్‌ చేయమని కమీషనర్‌ ఆదేశాలు జారీ చేయలేదని, ఇదంతా కుట్ర అని మంత్రి జవహర్‌ ఎక్సైజ్‌ అధికారులపై ఎదురుదాడి చేశారట. ఒక వేళ మంత్రి జవహర్‌ చెప్పిందే వాస్తవమైతే...'నాగలక్ష్మి'కి పోస్టింగ్‌ ఇచ్చేందుకు నాలుగు నెలల సమయం ఎందుకు పట్టింది. దీనికి ఆ శాఖ మంత్రి సమాధానం చెప్పగలరా..? 'లోకేష్‌'ను తెరపైకి తెచ్చిన మంత్రి ఎవరు...? దీనిపై మంత్రి లోకేష్‌ ఏ విధంగా స్పందిస్తారు..? ఒక అవినీతి అధికారిని తన సొంత జిల్లాలో నియమించుకునే స్థాయికి 'లోకేష్‌' దిగజారిపోయారా..? దీనిపై సమాధానాలు చెప్పేవారెవరు..?

రూ.50లక్షలు ముడుపులు...!

కాగా ఈ మొత్తం వ్యవహారంలో లక్షలు చేతులు మారాయిని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. కేవలం సచివాలయంలోనే కాదు..ఎక్సైజ్‌శాఖలో..ఆ శాఖలో పనిచేసే అధికారుల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది.  తనకు పోస్టింగ్‌ ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు తన వద్ద నుంచి మొదట రూ.25లక్షలు ఖర్చు చేయించారని...అయినా తన పని జరగలేదని 'నాగలక్ష్మి' గత కొన్నాళ్లుగా తన సన్నిహితుల వద్ద వాపోయిందట. తాను పోస్టింగ్‌ కోసం అంత సొమ్ము పెట్టినా..పోస్టింగ్‌ దక్కలేదని, కనీసం తన సొమ్ము అయినా వాపసు ఇవ్వలేదని ఆమె మధనపడ్డారు. తాను ఇచ్చిన సొమ్మును మధ్యవర్తులు అందించాల్సిన వారికి అందించారో..లేదోనని ఆమె తల్లడిల్లిపోయిందట. అయితే మధ్యవర్తి...  మంత్రికి రూ.20లక్షలు...కార్యాలయ అధికారికి ఐదు లక్షలు ఇచ్చానని ఆమెతో చెప్పారట. అయినా తనకు పోస్టింగ్‌ ఇవ్వడంలో ఆలస్యం కావడంతో...మరో రూ.25లక్షలు కూడా ఖర్చు చేసినట్లు చెప్పుకుంటోందట. వీటిని మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులకు  ముట్టచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. లక్షలు చేతులు మారకపోతే...ఆమెకు మంత్రులు ఎందుకు సిఫార్సు చేశారు..? ఏది ఏమైనా ముఖ్యమంత్రికి తెలియకుండా...ఆయన కుమారుడు 'లోకేష్‌'ను అడ్డం పెట్టుకుని..అధికారులను బెదిరించి...మంత్రి జవహర్‌ తన పంతం నెగ్గించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ముందు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనాలపై మంత్రి జవహర్‌ స్పందిస్తూ..శాఖలోని కొందరు అధికారులు..తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఇటువంటి కథనాలను రాయిస్తున్నారని ఎదురు దాడి చేశారట. ఏది ఏమైనా...ఒక అవినీతి అధికారిని చిత్తూరు డిసిగా నియమిస్తూ...ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిలో ఎవరెవరు..ఎంత మేరకు చక్రం తిప్పాలో..అంత మేరకు తిప్పారని, ఇందులో ఆర్థిక లబ్దిపొందిన వారు ఉన్నారూ... అమాయకులూ ఉన్నారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం చెబుతూ ఉండగా, సాక్షాత్తూ ఆయన మంత్రివర్గ సహచరులే..అవినీతి అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పిస్తూ..లక్షలు మూటగట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై స్పందిస్తారో..లేదో వేచి చూడాల్సి ఉంది.


(1996)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ