WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభకు 'పురంధేశ్వరి'...!

బిజెపి నాయకురాలు 'దగ్గుబాటు పురంధేశ్వరి' రాజ్యసభకు వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆమె తనను రాజ్యసభకు పంపాలని బిజెపి అధిష్టానాన్ని వేడుకొంటుందట. ఉత్తరప్రదేశ్‌ నుంచి తనను రాజ్యసభకు వెళ్లాళని ఆమె ప్రయత్నాలు చేసుకుంటున్నారట. వచ్చే ఫిబ్రవరి మాసంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి బిజెపికి దాదాపు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఒకరు లేదా...ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలని బిజెపి అధిష్టానం నిర్ణయించుకుందట. గతంలో ఇదే రాష్ట్రం నుంచి గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫరీకర్‌ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని తనకు కేటాయించాలని 'పురంధేశ్వరి' కోరుతున్నారట. బిజెపి అధిష్టానం ఇంకా ఆమెకు ఎటువంటి హామీ ఇవ్వకపోయినా..ఆమె మాత్రం తన ప్రయత్నాలను జోరుగా చేసుకుంటున్నారట.

   ఆంధ్రప్రదేశ్‌లో అధికార టిడిపితో బిజెపి చెలిమి చేస్తున్నా..ఆ పార్టీపై విమర్శలు కురిపించడంలో 'పురంధేశ్వరి' ముందున్నారు. కేంద్రం ఇబ్బడిముబ్బడిగా నిధులు ఆంధ్రాకు కేటాయిస్తున్నా..వాటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖర్చు చేయటం లేదని, ఖర్చు చేసినవాటికి లెక్కలు చెప్పడం లేదని, టిడిపి ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని ఆమె ఆరోపణలు కురిపిస్తూ కేంద్ర బిజెపి పెద్దల దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం మద్దతుతో గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన 'పురంధేశ్వరి' రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండదని..వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు లేకపోతే..తాను లోక్‌సభకు పోటీ చేసినా విజయం సాధించడం కష్టమనే అభిప్రాయం ఆమెలో ఉంది. ఒక వేళ వైకాపాతో పొత్తు పెట్టుకున్నా...తాను మాత్రం విజయం సాధించడం కష్టమని, దీంతో రాజ్యసభకు వెళితే సుఖంగా ఉంటుందనే భావన ఆమెలో ఉందట. అందుకనే ఉత్తరప్రదేశ్‌ ద్వారా రాజ్యసభకు వెళ్లే విధంగా యత్నాలు చేస్తోందట. మరి ఆమె కోరికను బిజెపి పెద్దలు తీరుస్తారో..లేదో..వేచి చూడాల్సిందే...!

(2142)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ