WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వీవీఐపిల సేవలో తరించిన టీటీడీ అధికారులు...!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశాం..సిఫార్సు లేఖలను ఆమోదించే ప్రసక్తేలేదు..ప్రతి ఒక్కరూ సామాన్య భక్తుల వలే స్వామిని దర్శనం చేసుకోవాల్సిందే అని పదే పదే ప్రకటనలు చేసిన టీటీడీ అధికారులు...వాటిని ఆచరణలో పెట్టకుండా సుమారు 3500మందికి పాస్‌లు ఇచ్చి వీవీఐపి దర్శనాలు చేయించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రొటోకాల్‌ సౌకర్యం ఉన్నవారికే వీవీఐపి దర్శనం చేయిస్తామని చెప్పిన టీటీడీ అధికారులు 3500 పాస్‌లు ఎవరెవరి సిఫార్సులతో ఎవరెవరికి ఎన్ని ఇచ్చారు..ఈ విషయంపై కొందరు అధికారులు ఆఫ్‌ ది రికార్డుగా స్పందిస్తూ...సిఎంఒ అధికారులు చెప్పిన వారికి పాస్‌లు ఇచ్చాం..అనేక మంది మంత్రులు, కేంద్ర మంత్రులు చెప్పిన వారికి పాస్‌లు ఇచ్చామని చెబుతున్నారు. కేవలం గంటలో వీవీఐపీల దర్శనాలను పూర్తి చేస్తామని చెప్పిన టీటీడీ అధికారులు ఐదు గంటల పాటు వారికి దర్శనం కలుగ చేసి సామాన్య భక్తులను ఇక్కట్ల పాలుచేశారు. వీరిలో ప్రొటోకాల్‌ ఉన్నవారెందరు...? వారి సిఫార్సుపై వచ్చిన వారెందరు..అనే విషయాన్ని బయటకు చెప్పడం లేదు. సామాన్య భక్తులు ఐదు కిలోమీటర్లు పాటు చలిలో వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నా..వీవీఐపి దర్శనాలకు టీటీడీ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సిన సామాన్య భక్తుల శ్రీవారి దర్శనం నాలుగు గంటల ఆలస్యంగా అంటే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించారు. తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకునేందుకు ఇంకా భక్తులు బారీలు తీరే ఉన్నారు. రేపు సాయంత్రానికే ఈ దర్శనాలు పూర్తి అవుతాయని టీటీడీ ఉద్యోగ వర్గాల అభిప్రాయం. ఏది ఏమైనా టీటీడీ అధికారులు చేసిన కాలయాపన వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి కన్నా..ఉత్తరాది రాష్ట్రాల నుండి వీవీఐపిలు ఎక్కువ సంఖ్యలో వచ్చారని, ఇందులో రియల్‌ఎస్టేట్‌వ్యాపారులు, ఢిల్లీలోని రాజకీయ బ్రోకర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీపై ప్రత్యేక దృష్టి సారించకుంటే కీ.శే.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వలే అప్రదిష్టపాలు కాక తప్పదని భక్తులు చెబుతున్నారు.

(169)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ