WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చేసిన తప్పులు దిద్దుకుంటున్న 'కెసిఆర్‌'...!

'వెనకటి...అయ్యగారేం...చేస్తున్నారా...అంటే...చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు...' అన్నట్లుంది తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిపాలన. వాస్తవాలు గుర్తెరగకుండా, భావోద్వేగాలు, రెచ్చగొట్టేమాటలతో, అసత్యాలు, అర్థసత్యాలతో పాలన సాగిస్తోన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో తాను చేసిన తప్పులను కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇటీవలే గ్రహిస్తున్నట్లున్నారు. అధికార పీఠం ఎక్కిన తొలినాళ్లల్లో ఏది తోస్తే..అది చేసి..ప్రజలను సమస్యల సుడిగుండంలోకి నెట్టి ఇప్పటి వరకు చోద్యం చూసిన ఆయన ప్రజాగ్రహంతో దిగివస్తున్నారు. పరిపాలన అంటే...తన ఇంట్లో కూర్చుని..చేసి కాదు..ప్రజల సమస్యలను దగ్గర ఉండి పరిష్కరించాలన్న ధ్యాస లేకుండా..ఏది తోస్తే..అది చేసి...చేతులు కాల్చుకున్నారు. ఆ విధంగా చేతులు కాల్చుకున్న వాటిలో జిల్లాల విభజన ఒకటి.

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత..పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను, మండలాలను పునర్‌వ్యవస్థీకరణ చేస్తున్నామని చెప్పి...ప్రజలు అడిగినా..అడగకున్నా..పెద్ద ఎత్తున్న జిల్లాలు ఏర్పాటు చేసిన కెసిఆర్‌కు...ఇప్పుడా జిల్లాలే పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతున్నట్లున్నాయి...విభజన చేసిన జిల్లాలను మళ్లీ కలపాలని కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు పది జిల్లాలు ఉన్న తెలంగాణను ఒక్కసారిగా 33 జిల్లాలుగా విభజించి కెసిఆర్‌ సంచలనం సృష్టించారు. అంత చిన్న రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఎందుకున్న విమర్శలపై ఆయన అప్పట్లో ఎదురుదాడి చేశారు. పరిపాలన ప్రజలకు చేరువుగా ఉండేందుకే ఈ జిల్లాల ఏర్పాటు అని..తాను ఇది కొత్తగా చేయటం లేదని...ఉమ్మడి రాష్ట్రంలో కీ.శే.ఎన్‌.టి.రామారావు మండలాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేశారని...తాను కూడా అదే విధంగా ముందుకెళ్తున్నానని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ..ఎన్టీఆర్‌ మండలాలను ఏర్పాటు చేసిన పరిస్థితులు..ఇప్పటి పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఆయన కావాలనే సమాధానాన్ని చెప్పకుండా తప్పుకున్నారు. నలుగురు కలసి వచ్చి తమకో జిల్లా ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇస్తే..ముందూ వెనుకా చూడకుండా జిల్లాలను ఏర్పాటు చేశారు. పాత జిల్లాలో కొద్దిగా పెద్దగా ఉన్న జిల్లాలను కనీసం ఐదు జిల్లాలుగా విభజించి సమస్యలను సృష్టించుకున్నారు. దీంతో పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు పలు ఇక్కట్లును ఎదుర్కొన్నారు. గత ఏడాది నుంచి ఇటువంటి సమస్యలు ఉన్నా కెసిఆర్‌ పట్టించుకోవడం లేదు..అయితే..ఇప్పుడు నియోజకవర్గాల పునర్‌వ్యవస్ణీకరణ జరగబోతుందన్న సమాచారంతో ఉన్న జిల్లాలను కుదించాలని కెసిఆర్‌ భావిస్తున్నారట. 

  ఇప్పటికే పాత వరంగల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేసిన వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలను కలపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయట. జిల్లాకు కలెక్టర్‌గా సీనియర్‌ ఐఎఎస్‌లను నియమించాల్సి ఉండగా...ఐఎఎస్‌ల కొరతతో..జూనియర్‌ ఐఎఎస్‌లను కలెక్టర్లగా నియమించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీంతో అక్కడ రాజకీయనాయ కులకు, అధికారులకు మధ్య సమన్వయం దెబ్బతింటోంది. అదీ కాక రాజకీయంగా కలసి వస్తుందనుకున్న విభజన..తమకే సమస్యలు సృష్టిస్తుండడంతో ఏర్పాటు చేసిన జిల్లాల్లో కొన్నింటిని తీసి వేయాలని ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారట. మొత్తం మీద చేసిన హడావుడిగా చేసిన నిర్ణయాలపై కెసిఆర్‌ త్వరలో సమీక్ష నిర్వహిస్తారని, ఆ జిల్లాలను రద్దు చేసి..పూర్వ జిల్లాలకే కట్టుబడి ఉండాలనే భావనతో ఉన్నారట. అయితే..ఇప్పుడు ఉన్న జిల్లాల్లో మొత్తం మీద ఆరు జిల్లాలను రద్దు చేసి 25 జిల్లాలుగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా జిల్లాల ఏర్పాటు విషయంలో కెసిఆర్‌కు ఎదురైన చేదు అనుభవాలు ఇతర రాష్ట్రాల పాలకులకు పాఠంగా పనికి వస్తాయనడంలో సందేహం లేదు.


(915)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ