WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డిప్యూటీ సిఎంలకు అవమానం...!

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రులైన కె.ఇ.కృష్ణమూర్తి, రాజప్పలకు టిడిపి ప్రభుత్వంలో వరుసగా అవమానాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వీరిద్దరినీ ఉపముఖ్యమంత్రులుగా నియమించడంతో పాటు కీలకమైన రెవిన్యూ, హోంశాఖలకు కేటాయించింది. బీసీ వర్గానికి చెందిన కె.ఇ.కృష్ణమూర్తికి రెవిన్యూశాఖను ఇచ్చినా..ఆయన నుంచి అధికారాలను లాగేసుకున్నారనే విమర్శ చంద్రబాబు ప్రభుత్వంపై వస్తోంది. ఆయన శాఖలో అవినీతి జరుగుతుందని, కీలకమైన అధికారుల పోస్టింగ్‌ల్లోనూ, భూముల రిజిస్ట్రేషన్‌లలోనూ 'కె.ఇ' మనుషులు అవినీతికి పాల్పడ్డారనే ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన అధికారాలకు కోత వేశారనే ప్రచారం జోరుగా సాగింది. ఆర్డీఓలు, డిఆర్‌ఒల పోస్టింగ్‌లు, బదిలీలు చేసే అధికారం రెవిన్యూ మంత్రి చేతిలో లేకుండా సిఎంఒ చేతిలోకి తీసుకున్నారనే భావన మంత్రి వర్గీయుల్లో ఉంది. అంతే కాకుండా కీలకమైన రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన రెవిన్యూశాఖను పక్కన పెట్టి..అన్నీ మున్సిపల్‌శాఖకు అప్పగించారనే వాదన కూడా ఉంది. రాజధాని భూముల సేకరణ, రాజధాని నిర్మాణంలో కె.ఇ. కృష్ణమూర్తి పాత్ర లేకుండా చేశారని, ఆయనను కావాలనే పక్కకు పెట్టి అవమానించారనే ప్రచారం జరుగుతోంది. రెవిన్యూమంత్రిగా కె.ఇ.కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో ఉంది. దాంతో ఆయన అధికారాలకు కత్తెర వేశారని, దీంతో కె.ఇ. మనస్థాపం చెందారనే ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మంత్రిగా కె.ఇ. తప్పుచేస్తే సరిదిద్దాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నుంచి అధికారాలను లాగేసుకుని ఆయనను ఘోరంగా అవమానించారని మంత్రి సన్నిహితులు, అనుచరులు చెబుతున్నారు. అయితే ఇదంతా ఏమీ లేదని...కె.ఇ.ని ముఖ్యమంత్రి గౌరవిస్తున్నారని, ఆయన సలహాలను తీసుకుంటున్నారని, నిన్న కాక మొన్న ఆయన తన తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అడిగితే కాదనకుండా..ఆయనకు చెప్పినట్లే చేశారని..ఇంతకంటే ఇంకేమి చేయాలని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు.

  ఇది ఇలా ఉంటే..మరో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కూడా అవమానాలు ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కాపు కులానికి చెందిన 'రాజప్ప' మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు..విధేయుడు. గత ఎన్నికల సమయంలో ఆయనను గెలిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృషి చేసి గెలిపించి హోంమంత్రి పదవి ఇచ్చారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దానికి కృతజ్ఞతగా 'చినరాజప్ప' కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రత్యేక విధేయతను చాటుతుంటారు. అయితే గురువారం నాడు జరిగిన సంఘటన 'రాజప్ప'ను మనస్థాపానికి గురిచేసిందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లాలో ప్రభుత్వం ఫోరెనిక్స్‌ల్యాబ్‌ ప్రారంభోత్సవానికి హోంమంత్రి అయిన రాజప్పను ఆహ్వానించలేదట. ఈ కార్యక్రమానికి ఆయనను కావాలనే ఆహ్వానించలేదని ఒక వర్గం మీడియాలో ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి రాజప్పకు ఒక కానిస్టేబుల్‌ ద్వారా ఆహ్వానం పంపించారని, దాంతో నొచ్చుకున్న హోంమంత్రి ఆ కార్యక్రమానికి వెళ్లకుండా తిరుమలకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. తన శాఖకు చెందిన విషయాన్ని కూడా తనకు చెప్పరా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. హోంమంత్రికి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడం ఏమిటని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారట. ఇది సరికాదని...ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా..ఇద్దరు సీనియర్‌ మంత్రులకు పదే పదే అవమానాలు జరిగాయని ప్రచారం కావడం..తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కల్గిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో..చూద్దాం...!


(2720)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ