లేటెస్ట్

రెండుచోట్లా ఎదురుదెబ్బలు...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మంగళవారం నాడు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. అమరావతి రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అదే విధంగా అమరావతి రాజధానిపై గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంలో వేసిన కేసులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు రాగా..ఆయన ఈ కేసును తాను విచారించలేనని, వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సుప్రీం రిజస్ట్రీని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని రైతుల పాదయాత్రకు సంబంధించి, రాజధాని విషయంలో ఎదురుదెబ్బలు తగిలినట్లైంది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ముందునుంచి తీవ్ర ఆటంకాలు ఎదరయ్యాయి. మొదట గుంటూరులో పాదయాత్ర మొదలైననప్పుడు ప్రభుత్వం దానికి పెద్దగా అడ్డంకులు సృష్టించలేదు. అయితే పాదయాత్ర గోదావరి జిల్లాల్లో ఉన్నప్పుడు పాదయాత్రపై రాళ్లదాడి జరిగింది. అధికారపార్టీ నేతలు పాదయాత్రను చేస్తున్నవారిని దూషించడం, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల యాత్ర అంటూ ప్రచారం చేయడం ఇతరత్రా మార్గాల ద్వారా యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారు ఎంత కవ్వించినా హైకోర్టు అనుమతితో యాత్ర చేస్తోన్న రాజధాని రైతులు మౌనంగానే వారిని భరించారు. అయితే రైతుల యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాలకులు దానికి పోటీగా ఉత్తరాంధ్రలో మూడురాజధానుల యాత్రను నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అధికారపార్టీనాయకులు రాజధాని రైతుల యాత్రపై దాడులకు దిగారు. దీంతో రైతులు యాత్రను ఆపేసి కోర్టును ఆశ్రయించారు.

ఇదే సమయంలో యాత్రను ఆపాలని ప్రభుత్వం కూడా హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు మాత్రం రైతులు యాత్ర చేసుకోవచ్చని, వారందరికీ ఐడీకార్డులు ఇవ్వాలనని 600మంది మాత్రమే యాత్రలో పాల్గొనాలని తీర్పు ఇచ్చింది. యాత్రకు సంఫీుభావం తెలిపేవారు ఏ రూపంలోనైనా తెలపవచ్చని విచారణ సందర్భంగా న్యాయస్థానం తేల్చి చెప్పింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోర్టు ఆదేశించింది. కాగా అమరావతిలోనే రాజధాని ఉండాలని, అమరావతిని అభివృద్ధిచేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్‌ తాను ఈ కేసును విచారించనని ‘నాట్‌ బీఫోర్‌ మీ’ అంటూ వేరే బెంచ్‌కు కేటాయించారు. గతంలో ‘జగన్‌’ అక్రమాస్తుల కేసుల్లో ఆయనకు లాయర్‌గా పనిచేసిన జస్టిస్‌ లలిత్‌ ముందుకు ఈ కేసు రావడంతో ఆయన ఈ కేసును విచారించడానికి నిరాకరించారు. అయితే ఈ కేసును జస్టిస్‌ లలిత్‌ తీసుకుంటారని, దీనిలో ఏదో జరగబోతోందని అధికారపార్టీ నాయకులు, ఆ పార్టీని అభిమానించే వారు భావించారు. దీనిలో ఏదో జరగబోతోందని అమరావతి రైతులు కూడా ఆందోళన చెందారు. అయితే వీరి ఊహలకు విరుద్ధంగా జస్టిస్‌ లలిత్‌ వ్యవహరించారు. మొత్తం మీద మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి రెండుచోట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ