WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఊహించని పోస్టు 'మాలకొండయ్య' వశమాయే...!?

రాష్ట్ర డీజీపీగా 'మాలకొండయ్య' నియమితులవుతారని, ఆయన సన్నిహిత బంధు,మిత్రులు, అధికారులకు, చివరకు ఆయన కూడా కలలో కూడా ఊహించలేదట. వారం రోజుల ముందు వరకు ఆయన పేరు కనీసం ప్రస్తావనకు రాలేదు. గత పదిరోజుల్లో ఒక ముఖ్య అధికారి తనదైన శైలిలో రహస్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు నచ్చచెప్పారు. కులాన్ని పరిగణలోకి తీసుకోవద్దు...సమర్థతను నిజాయితీని, సీనియార్టీ మాత్రమే ముఖ్యమైన పోస్టుకు అర్హత. ఆయా అర్హతలు..లక్షణాలు 'మాలకొండయ్య'లో ఉన్నాయి. ఇన్నేళ్ల సర్వీసులో ఆయనపై విమర్శలు, ఆరోపణలు ఏ ఒక్కరూ చేయలేదు. కానీ ఆయన గుంటూరు జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులను కొంచెం ఇబ్బంది పెట్టినట్లు అప్పట్లో కొందరు బయటపెట్టారు. అంతకు మించి ఆయనపై ఎటువంటి విమర్శలు లేవు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించేందుకు ఆ ముఖ్య అధికారి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంతే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాదికి చెందిన 'దినేష్‌కుమార్‌' బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'ఠాకూర్‌'ను డీజీపీగా నియమిస్తే..ఒకే ప్రాంతానికి చెందిన వారిని ముఖ్యమైన పదవుల్లో నియమించారనే విమర్శలు వస్తాయి..మీరు 'ఠాకూర్‌'ను డీజీపీగా నియమించాలంటే ఆరు నెలల వరకు ఓపిక పట్టండి...ముందుగా 'మాలకొండయ్య'ను నియమించండి..అని నచ్చ చెప్పడంతో..ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. 'మాలకొండయ్య' ఏమిటి డీజీపీ కావడం ఏమిటి..? ఆయనకు రాజకీయ వర్గాల మద్దతూ లేదూ...అధికారపార్టీ ముఖ్యనాయకుల్లో సన్నిహితులూ లేరు. కానీ..కాలం కలసివచ్చింది. పాత సామెతలా..కలిసొచ్చేకాలంలో..నడిచొచ్చే కుమారుడు పుడతారన్నట్లు'..మాలకొండయ్యకు అవకాశం కలసివచ్చింది. కేంద్ర పాలకులు తీసుకున్న నిర్ణయమే 'మాలకొండయ్య'కు వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు పంపిన జాబితాను కేంద్రం ఆమోదించి ఉంటే..మళ్లీ 'నండూరి' రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగి ఉండేవారు. కేంద్రంలో జరిగిన తతంగాలు 'మాలకొండయ్య'కు కలసి వచ్చింది. ఆరు మాసాలు మాత్రమే ఆయన డీజీపీ కొనసాగుతారు. 

  'మాలకొండయ్య'ను డీజీపీ రేసులో ఉన్నారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనాన్ని చాలా మంది కొట్టిపారయడమే కాకుండా...వ్యక్తిగత అభిమానంతో ఆ కథనాలను ప్రచురించారని కొందరు మీడియా ప్రతినిధులతో పాటు..ఇతర ముఖ్య అధికారులు కూడా ఘాటుగానే స్పందించారు. చివరకు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనమే యధార్థమైంది. 

వ్యక్తిగతంగా, అధికారిగా 'మాలకొండయ్య'ను పరిశీలిస్తే..నిజాయితీ, సమర్థత విషయంలో ఎటువంటి లోపాలు కనపడవు. కానీ...అతిగా ఆవేశపడతారు...ఓర్పు తక్కువని ఆయనతో పనిచేసిన అధికారులు, ఇతర ముఖ్యులు చెబుతున్నారు. డీజీపీగా నియమితులయ్యారు..కదా..ఆయనే తన పనితీరు మార్చుకుంటారు కదా..అని కొందరు చెప్పగా...ముప్పయి సంవత్సరాలుగా లేనిది..కొత్తగా ఇప్పుడు ఆయనకు అబ్బుతుందా..అని ఆ విమర్శకులే అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కలలో కూడా ఊహించని పోస్టు 'మాలకొండయ్య'కు లభించడంతో...ఎప్పుడు ఎవరెవరికి అధికార వ్యవస్థ అనుకూలంగా మారుతుందో...ప్రతికూలంగా మారుతుందో 'మాలకొండయ్య' ఉదంతంతో రుజువైంది. డీజీపీ పోస్టు కోసం 'మాలకొండయ్య' ఏ ఒక్కరినీ కలవలేదు..తెలిసిన వారు ఆ పోస్టు గురించి అడిగినప్పుడు 'మీరు సహకరించాలని ఆయన కోరలేదు'. మహాభారతంలో రథసారధిగా పాండవులకు అధికారం కట్టబెట్టిన శ్రీకృష్ణుడు వలే..ఒక ముఖ్యఅధికారి తెరవెనుక ఉండి...'మాలకొండయ్య'కు ఆ పోస్టు లభించేవరకు...ముఖ్యమంత్రిని కలిసినప్పుడల్లా ఒత్తిడి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆయనతో పాటు...బంధు,మిత్రులు ఊహించిన విధంగా 'మాలకొండయ్య'కు డీజీపీ పోస్టు లభించింది. ఆరోగ్యశాఖాధిపతి బాధ్యతలు నిర్వహిస్తున్న 'పూనం మాలకొండయ్య' ఆయన సహధర్మచారిణి. 'చంద్రబాబు'కు ఇష్టం ఉందో లేదో కానీ..'మాలకొండయ్య'ను డీజీపీగా నియమించారు. 'మాలకొండయ్య' పాలకులతో సమన్వయంతో పనిచేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.


(526)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ