WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పశుసంవర్థకశాఖలో అమ్మకానికి..ఉద్యోగాలు...!

పశుసంవర్థకశాఖలో అవుట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా నియమితులైన డేటా ఎంట్రీఆపరేటర్లు, అటెండర్‌ పోస్టుల భర్తీలో లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు చేతులు మారినట్లు అధికారపార్టీ ప్రజాప్రతినిధులతో పాటు, ఇతర ముఖ్యనాయకులు కూడా ఆ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. సిఎంఒ దృష్టికి తీసుకెళ్లారు. బాహాటంగా ఆరోపణలు, విమర్శలు కొందరు చేస్తున్నారు. అడెంటర్‌ పోస్టుకు లక్ష రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ప్రకాశం, కడప జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉద్యోగులు ఫిర్యాదు చేయటం జరిగింది. పశుసంవర్థకశాఖలో ఉన్నతాధికారికి కొంత మంది కీలక అధికారులకు కూడా ఈ లంచాల్లో వాటాలు అందాయని బయటకు పొక్కింది. ఎవరైతే లక్షలు వసూలు చేశారో..వారే...డబ్బులు ఇచ్చినవారితో మాట్లాడుతూ ఇదంతా..తమకే సొంతం కాదు..పశుసంవర్థశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తోన్న ఉన్నతాధికారికి...ఇతర అధికారులకు వాటాలు ఇస్తున్నట్లు చెప్పారట. ఏజెన్సీ నిర్వహకులు తమ సంస్థల ద్వారా నియామకాలు జరుపేందుకు మంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి..అనుకూలంగా మలచుకున్నారు. వాస్తవానికి సంబంధించిన జిల్లా స్థాయి అధికారులే కొన్ని పేర్లతో కూడిన జాబితాను ఏజెన్సీ నిర్వాకులకు పంపారు. ఈ జాబితాలో అధికారపార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు చేసిన వారు కూడా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే..ఈ సిఫార్సులు ద్వారా వచ్చిన అభ్యర్థులు కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆ పోస్టులు ఆశించిన వారు చెబుతున్నారు. ఏజెన్సీల నిర్వాహకులు, పశుసంవర్థశాఖ జిల్లా స్థాయి అధికారులు..డైరెక్టరేట్‌లోని కొందరు అధికారులు..ఒక పథకం ప్రకారం తమ పేర్లు బయటకు రాకుండా జేబులు నింపుకుంటున్నారు. మంత్రుల పేరుతో కొందరు, అధికారుల పేరుతోమరి కొందరు, ప్రజాప్రతినిధుల అంతరంగిక అధికారులుగా పనిచేస్తోన్న కొందరు ఈ నియామకాల్లో తలదూర్చి..తమవాటాలను చాకచక్యంగా పొంది ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. 

  రెండు, మూడు మాసాల కిందట వివిధ జిల్లాల్లో డిఇ పోస్టులను అవుట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయటం జరిగింది. అప్పట్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్ల అంతరంగిక సిబ్బంది సిఫార్సుల ద్వారా జాబితాను తయారు చేసి ఏజెన్సీల ద్వారా సిఫార్సు చేయించి నియామకాలు జరిపారు. అప్పట్లో పలువురు జెడీలు, డైరెక్టరేట్‌ స్థాయి అధికారులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర నిర్వహించి కొందరు బాగా వెనకేసుకోగా..కొద్దిమంది మాత్రమే పారదర్శకంగా వ్యవహరించారు. తాజాగా కడప జిల్లాలో అవుట్‌సోర్సింగ్‌ నియామకం ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయబోతుండడంతో అధికారపార్టీ ముఖ్యనేతలతో పాటు, ఆ శాఖమంత్రి దగ్గరి బంధువులు, ఇతర ముఖ్యులు, పరస్పరం పోటీ పడుతూ అందిన వరకు దండుకుంటూ సిఫార్సులు చేసిన విషయం తెలిసినా విపక్షాల నాయకులు నోరుమెదపడం లేదు. ఈ డిఇఒలు, అటెండర్ల నియామకాల్లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'సోమశేఖర్‌' తాను ఎటువంటిసిఫార్సులు చేయలేదని, జిల్లా స్థాయిలోనే నియామకాలు జరుగుతున్నాయని సిఫార్సులు అడిగిన వారికి చెబుతున్నారు. కానీ జిల్లా స్థాయి అధికారులేమో..పైనుంచి జాబితా రావాలి..ఆదేశాలు రావాలి..అని చెబుతూ తప్పుకుంటున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఎవరి వాటాలు వారికి అందుతున్నాయని, విచారణ జరిపితే..ఎవరెవరికి ఎంతెంత ముట్టాయో బయటపడడం ఖాయమని, ఈ విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మౌనం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తిలాపాపం..తలా పిడికెడు అన్న చందంగా..అందరూ శ్రీవైష్ణువులే...కంచంలో ఉన్న చేపల పులుసు ఎలా మాయమైందో..శాఖ ఉద్యోగాల భర్తీలో ఆ సామెత గుర్తొస్తొంది.


(127)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ