WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలోకి 'భూమా' మిత్రుడు 'ఎ.వి.సుబ్బారెడ్డి'...!

ఆయన దివంగత 'భూమా నాగిరెడ్డి'కి అత్యంత సన్నిహితుడు. 'భూమా' జీవించినప్పుడు 'నాగిరెడ్డి' రాజకీయ అవసరాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ ఆయనే చూసేవారు. 'నాగిరెడ్డి' కూడా ఆయనపై అంతే విశ్వాసం ఉంచి ప్రోత్సహించారు. 'నాగిరెడ్డి'కి కుడిభుజంలా వ్యవహరించిన ఆయన 'భూమా' మరణం తరువాత...రాజకీయంగా...'భూమా' కుటుంబంతో విభేదిస్తున్నారు. 'భూమా' రాజకీయ వారసత్వం తనదే అన్నట్లు మాట్లాడుతున్నారు. 'భూమా' మరణించిన తరువాత 'నంద్యాల'కు ఉపఎన్నికలు జరుగుతున్న తరుణంలో తనకు ఆ సీటు కావాలని, టిడిపి అధిష్టానంపై, 'భూమా' కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆయనను బుజ్జగించి..మౌనం వహించేలా చేశారు..! అయితే..ఇప్పుడా నేత...తాను..ఇక క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగులు పెడుతున్నానని కొన్ని రోజులుగా సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ ఆ నాయ‌కుడు ఎవ‌ర‌నుకుంటున్నారు... ఆయనే 'భూమానాగిరెడ్డి' స్నేహితుడు 'ఎ.వి.సుబ్బారెడ్డి'.

  'భూమానాగిరెడ్డి' బతికి ఉన్న రోజుల్లో..'సుబ్బారెడ్డి'...అన్నీ తానై వ్యవహరించేవారు. కుటుంబ సభ్యుల కన్నా..ఎక్కువగా 'నాగిరెడ్డి' ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ పనైనా...'సుబ్బారెడ్డి'కే అప్పగించేవారు. వారి స్నేహం చూసి..కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులు కూడా అసూయ చెందేవారు. ఆ విధంగా సాగిన వారి స్నేహం 'నాగిరెడ్డి' మృతితో..విడిపోయింది. అదే సమయంలో 'నాగిరెడ్డి' కుటుంబ సభ్యులతో 'సుబ్బారెడ్డి'కి విభేదాలు వచ్చాయి. 'నంద్యాల' ఉప ఎన్నికల్లో తనకు సీటు కావాలనడమే...'సుబ్బారెడ్డి'తో 'నాగిరెడ్డి' కుటుంబానికి వివాదాలు రావడానికి కారణం. 'నంద్యాల' ఉప ఎన్నిక సందర్భంగా ఈ విభేదాలు మరింత పెరిగిపోయాయి. చివరకు 'సుబ్బారెడ్డి' వైకాపా తరుపు నుంచి పోటీ చేయాలనే ఆలోచన కూడా చేశారట. అయితే..అప్పటికే 'జగన్‌' శిల్పామోహన్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించడంతో 'సుబ్బారెడ్డి' ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. అయితే టిక్కెట్‌ కోసం తన ప్రయత్నాలను మాత్రం మానుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి టిక్కెట్‌ తనకు ఇవ్వాలని కోరారు. అయితే..అప్పుడున్న పరిస్థితుల్లో సున్నితంగానే 'చంద్రబాబు' ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. 'సుబ్బారెడ్డి' రాజకీయ జీవితానికి తాను హామీ ఇస్తున్నానని, ఈ ఉపఎన్నికల్లో 'భూమానాగిరెడ్డి' కుటుంబం తరుపున ప్రచారం చేయాల్సిందిగా ఆయన 'సుబ్బారెడ్డి' కోరారు. అయితే ఆ ఉపఎన్నికలో 'సుబ్బారెడ్డి' నామ మాత్రంగానే వ్యవహరించారు. అనారోగ్యం పేరుతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే...టిడిపి అధిష్టానం ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవహరించడంతో..'సుబ్బారెడ్డి' పనిచేయకపోయినా...'టిడిపి' విజయం సాధించగలిగింది. 

  ఇక ఉప ఎన్నికల తరువాత 'నాగిరెడ్డి' కుటుంబ సభ్యుల మధ్య..'సుబ్బారెడ్డి'ల మధ్య దూరం మరింత పెరిగిపోయింది. దీంతో..'సుబ్బారెడ్డి' 'నాగిరెడ్డి' ఇంటి వైపుకు కూడా వెళ్లడం లేదు. అదే సమయంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 'నంద్యాల' నుంచి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన హంగామా సృష్టించారు. నిన్న తన అనుచరులు...మీడియా వర్గాలకు, ఇతరులకు భారీ ఎత్తున్న విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు ఐదువేల మంది పాల్గొన్నట్లు అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే 'సుబ్బారెడ్డి' తనంత తాను ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు దగ్గరకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈ పార్టీ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారని పార్టీకి వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు తాను 'నంద్యాల' నుంచి పోటీ చేస్తానని చెప్పారట. అయితే..ఏ పార్టీ నుంచి అనే అంశాన్ని మాత్రం దాట వేస్తున్నారట. ఇప్పటికే 'నంద్యాల' నుంచి భూమా నాగిరెడ్డి వారసుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితుల్లో వారిని కాదని...టిడిపి 'సుబ్బారెడ్డి'కి టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టిడిపి టిక్కెట్‌ దక్కపోతే..ఆయన వైకాపా నుంచైనా బరిలో ఉంటానని స్పష్టంగా చెబుతున్నారట. 

   2009 ఎన్నికల్లో 'ప్రజారాజ్యం' పార్టీ తరుపున 'సుబ్బారెడ్డి' పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తనకు టిడిపి టిక్కెట్‌ ఇస్తే..ఓకే...లేదంటే..వైకాపా నుంచైనా పోటీ చేస్తానని...చెబుతున్నారట. ఒక వేళ వైకాపా కూడా టిక్కెట్‌ ఇవ్వకపోతే...తాను ఆ పార్టీకి మద్దతుదారుగా ఉండి...భూమానాగిరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీస్తానని స్పష్టం చేస్తున్నారట. మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి నచ్చకే 'సుబ్బారెడ్డి' ఈ విధంగా వ్యవహరిస్తున్నారని స్థానిక టిడిపి నాయకులు చెబుతున్నారు. కాగా..నిన్న నిర్వహించి నూతన సంవత్సర వేడుకలు గురించి మంత్రి అఖిలప్రియకు ముందుగానే తెలిసిందట. తనకు తెలియకుండా..పార్టీ ఎలా నిర్వహిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే..తాను 'నాగిరెడ్డి'కి మాత్రమే విధేయుడనని, 'అఖిలప్రియ'కు కాదని..తన ప్రయత్నాలు ఆగవని 'సుబ్బారెడ్డి' స్పష్టం చేశారట. మొత్తం మీద...'సుబ్బారెడ్డి' రాజకీయంగా ఎదగడం కోసం స్వంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని...ఇది మంత్రి అఖిలప్రియకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని నియోజకవర్గ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు...!


(6887)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ