WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నూతన ఏడాదిలో 'పోలవరం,అమరాతి' నిర్మాణాలే కీలకం...!

కాల గర్భంలో మరో సంవత్సరం గడిచిపోయింది. కాలంతోపాటు పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు 2018 సంవత్సరం అతి కీలకమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే..ఈ సంవత్సరం పూర్తి అయితే..ఆయనకు ఎన్నికలకు మిగిలేది మహా అయితే మూడునెలలు మాత్రమే...2019 తొలి మాసాల్లోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. అన్నీ కలిస్తే..మహా అయితే 14మాసాలు ఉంటాయి...! ఈలోపు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. ఒకవైపు సహకరించని కేంద్రం, మరోవైపు అందుబాటులో లేని ఆర్థికవనరులతో ఆయన ఎంత వరకు ప్రజలను మెప్పించగలుగుతారో..చూడాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న..గత ఎన్నికల సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలు ఇంత వరకు ఒక కొలిక్కిరాలేదు. వాటిలో ముఖ్యమైనది 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణం, 'రాజధాని అమరావతి' నిర్మాణం. మిగతా హామీల్లో ఎక్కువ శాతం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయగలిగింది. కానీ..రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ రెండింటిని పూర్తి చేయడం ఆషామాషీ కాదు...! 2018 సంవత్సరంలో కీలకమైన ఈ ప్రాజెక్టుల్లో ఆయన ఎంతో కొంత పురోగతి చూపగలిగితే...ఎన్నికల నాటికి ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుంది. ఇప్పటికే...రాజధానిలో చిన్న ఇటుక కూడా పేర్చలేదని ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సరంలో 'అమరావతి' నిర్మాణంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

   రాజకీయంగా కీలకమైన 'పోలవరం' ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు...రెండు అడుగులు వెనక్కు అనే విధంగా తయారైంది. ఇటీవల కాలంలో 'పోలవరం' పనులు జోరందుకున్నా..కేంద్రం ప్రతిసారీ అడ్డుపుల్ల వేసి బ్రేక్‌లు వేస్తోంది. మొదట కాంట్రాక్టర్‌ విషయంలో తల దూర్చి పనులు ఆపించిన కేంద్రం..ఇప్పుడు క్యాపర్‌డ్యామ్‌ విషయంలోనూ రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళానికి గురి చేస్తోంది. ఒకసారి కాఫర్‌డ్యామ్‌ కావాలని..మరోసారి వద్దని...ఇంకోసారి కాఫర్‌డ్యామ్‌తో పాటు స్పిల్‌వే సమాంతరంగా నిర్మించాలని చెబుతూ ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలోకి నెట్టేస్తోంది. పక్షానికో రోజు వచ్చి పోలవరం పనులు చూస్తానన్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఇంత వరకూ దానివైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు పోలవరం ప్రధాన కాంట్రాక్టర్‌కు బ్యాంక్‌లు నోటీసులు ఇవ్వడంతో కాంట్రాక్టర్‌ను మార్చాలన్న ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందన్న దానిపై ఆసక్తినెలకొంది. కాంట్రాక్టర్‌ ప్రాజెక్టును పూర్తి చేయలేక పోతున్నారని...ఆ కాంట్రాక్టర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే...దాన్ని అడ్డుకున్న కేంద్రం తాజా పరిస్థితులపై మౌనం వహించింది. అంతే కాకుండా నిధుల విడుదలలోనూ జాప్యం చేస్తోంది. దరిమిలా..నూతన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో...? కేంద్రం సహకరించకుండా కొర్రీలు వేస్తే...ఏం చేయాలో..అన్నదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తికాకపోతే...ఇంకెప్పుడూ పూర్తికాదని ముఖ్యమంత్రి ఇంతకు ముందే వ్యాఖ్యానించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం 'పోలవరం' ప్రాజెక్టు భవిష్యత్‌ను తేల్చబోతోంది. కేంద్రం రాష్ట్రానికి సహకరించి నిధులు విడుదల చేస్తే..ఈ సంవత్సరాంతానికి 'పోలవరానికి' ఒక రూపు వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ...కేంద్రం ఏమి చేస్తున్నదానిపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్కంఠతను రేపుతోంది.

  ఇక రాజధాని 'అమరావతి' నిర్మాణం కూడా కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రతిపక్షాలకే కాకుండా...స్వంత పార్టీలోనూ సణుగులు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ డిజైన్ల పేరుతో కాలం గడిపారని..ఇప్పటికైనా కొన్ని నిర్మాణాలనైనా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్వంత పార్టీ నాయకులే అంటున్నారు. అయితే రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు లేకపోవడం వల్లే ఆ పనుల్లో జాప్యం జరుగుతుందని, ప్రపంచ బ్యాంక్‌ నుంచి విడుదల కావాల్సిన నిధులు విడుదలైతే..రాజధానిలో కొన్ని భవనాలను ఆరు నెలల లోపు పూర్తి చేస్తామని మున్సిపల్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీడ్‌యాక్సెస్‌రోడ్‌ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశామని, కొన్ని భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశామని, మరో ఆరు నెలల్లో రాజధానికి ఒక రూపు వస్తుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకమైన ఈ రెండు ప్రాజెక్టులు నూతన సంవత్సరంలో ఒక రూపుకు వస్తే 'చంద్రబాబు' ప్రతిష్ట మరింత పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


(456)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ