WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రుల'తో 'పవన్‌' పొత్తు ఖాయం...!

తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో...ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో 'జనసేన' అధినేత 'పవన్‌కళ్యాణ్‌' ఎన్నికల పొత్తు కుదుర్చుకోబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే..'నా తమ్ముడు 'చంద్రబాబు'తో కలసి పోటీ చేస్తాడని' సాక్షాత్తూ 'చిరంజీవి' వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఒక పత్రికాధిపతి కెసిఆర్‌తో స్వయంగా మాట్లాడి..పవన్‌కళ్యాణ్‌ను పిలిచి మాట్లాడమని, పొత్తు విషయం తెలపమని సలహా ఇచ్చారట. తెలంగాణలో 'పవన్‌'కు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సామాజికవర్గానికి చెందిన మున్నూరు కాపు ఓటర్లు సుమారు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉన్నారు. ఈ విషయం ఆ పత్రికాధిపతికి తెలుసు. అందుకే కెసిఆర్‌కు సలహా ఇచ్చి..మాట్లాడే విధంగా తెరవెనుక ఉండి పావులు కదిపారు. కాంగ్రెస్‌ను ఓడించాలంటే..'పవన్‌'తో పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఉందని 'కెసిఆర్‌'కు ఇప్పుడిప్పుడే తెలిసివచ్చింది. కెసిఆర్‌తో 'పవన్‌' సమావేశం కావడం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు తన నివాసంలో మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ మున్నూరు కాపుల్లో 'పవన్‌'కు పట్టున్న విషయం వాస్తవమే...కెసిఆర్‌కు ఎవరో సలహా ఇచ్చి ఉంటారు..అందుకే 'పవన్‌'ను పిలిపించి మాట్లాడి ఉంటారని, ఇందులో రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని, మొన్నటి వరకు 'కమ్మ' వర్గాన్ని దువ్వి బుట్టలో వేసుకున్నారు...నేడు..కాపు వర్గాన్ని కూడా దువ్వి బుట్టలో వేసుకోబోతున్నారు...తెలివంటే కెసిఆర్‌దే అని వ్యాఖ్యానించారట. తెలంగాణలో 'పవన్‌'తో కెసిఆర్‌ పొత్తు ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే...టిడిపితో 'పవన్‌' పొత్తు ఖాయమని 'జగన్‌' పార్టీకి చెందిన నాయకులు ఆఫ్‌దిరికార్డుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా తన సన్నిహిత వర్గాలకు సూచిస్తున్నారు. అందుకేనేమో..బిజెపికి చెందిన ఎమ్మెల్సీ వీర్రాజు 'చంద్రబాబు'పై విమర్శలు గుప్పిస్తున్నారు. 'చంద్రబాబు, పవన్‌'లు కలసి పోటీ చేస్తే..రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ ఫోర్స్‌గా మారుతుందని వారిని ఎదుర్కోవడం ఏ వర్గం వల్ల కాదని కేంద్ర నాయకులు ఆలస్యంగా తెలుసుకున్నారు. 'ముద్రగడ పద్మనాభం' కూడా ఈ పొత్తుల విషయంపై సన్నిహితులతో వ్యాఖ్యానిస్తూ వారిద్దరూ కలసిపోటీ చేస్తే..'జగన్‌'కు ప్రతిపక్షహోదా కూడా దక్కదని వ్యాఖ్యానించారట. 

  ఇద్దరు 'చంద్రల'తో పొత్తు కుదుర్చుకుని ముందుగా ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయంగా ఎదిగిన అనంతరమే..రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై 'పవన్‌' స్పష్టత ఇవ్వబోతున్నారట. వీరి పొత్తుల వ్యవహారం రెండు రాష్ట్రాల్లోని విపక్షాల్లో ఆందోళన కల్గిస్తోంది. 'కమ్మ' సామాజికవర్గ నాయకులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో టిడిపి,టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. కెసిఆర్‌ రాజకీయవారసుడు కెటిఆర్‌ కూడా 'కమ్మ' సామాజికవర్గ నాయకులను అనుకూలంగా మలచుకోవడంలో విజయవంతం అయ్యారు. తాజాగా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న 'యాదవ్‌'ల ఓట్లను కొల్లగొట్టేందుకు కెసిఆర్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. ఒకవైపు 'పవన్‌'ను, మరోవైపు టిడిపి సానుభూతిపరులను, బీసీ వర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు, యాదవ్‌ వర్గాలను ఆకర్షించడంలో కెసిఆర్‌ సఫలీకృతం కావడం..తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో దడ పుట్టిస్తోంది. పది రోజుల కిందట వరకు తెలంగాణలో అవుట్‌...కాంగ్రెస్‌ ఖాయమని..రాజకీయ పరిశీలకులతో పాటు మీడియా వర్గాలు కూడా భావించాయి. మారబోతున్న రాజకీయ సమీకరణలు, కులాల ఓటర్లలో చీలిక ప్రభావంపై కాంగ్రెస్‌ నాయకుల్లో ఆందోళన కల్గిస్తుండగా...టిఆర్‌ఎస్‌ వర్గాల్లో మళ్లీ అధికారం తమదేనన్న ధీమా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే...టిడిపి,జనసేన కలిసిపోటీ చేస్తే..విపక్షానికి డిపాజిట్లు కూడా రావనే విషయాన్ని వైకాపా వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.

(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ