లేటెస్ట్

నర్సాపురంలో మళ్లీ ‘నాగబాబు’ పోటీ..మరి ‘రాజు’గారి సంగతేమిటో...!?

రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్‌ వచ్చేసింది. ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెటు ఇవ్వాలి..ఎవరిని వదిలించుకోవాలి అనే దానిపై అప్పుడే కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపా, జనసేనలు అభ్యర్థులకు సంకేతాలు ఇస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అయితే ఇప్పటికే దాదాపు వంద స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. మరో వైపు వైకాపా తరుపున ఐప్యాక్‌టీమ్‌ అభ్యర్థులను ఖరారు చేసి, జగన్‌కు సమాచారాన్ని ఇస్తోంది. కాగా మరో పార్టీ అయిన ‘జనసేన’ అభ్యర్థుల విషయంలో దూకుడుగా వెళ్లడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉంది. వారితో పొత్తులకు వెళతారా..కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా..అనే దానిపై వారిలో స్పష్టత లేదు. మరోవైపు ప్రజాసమస్యలపై టిడిపితో కలిసి పోరాడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రెండుపార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొంత మంది నాయకులు తమకు టిక్కెట్ల విషయంలో స్పష్టత నివ్వాలని జనసేన అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’ను అడగగా..తాను అప్పుడే ఆ విషయం గురించి చెప్పలేనని, టిడిపితో పొత్తు ఉంటే ముందు మీకు మాట ఇస్తే తరువాత ఇబ్బంది ఎదురువుతుందని చెబుతున్నారట. అయితే తన స్వంత సోదరుడు ‘నాగబాబు’ విషయంలో ఆయన స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ‘నర్సాపురం’ నుంచి మరోసారి ‘నాగబాబు’ పోటీ చేస్తారని ఆయన చెప్పారట.

గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ‘నాగబాబు’ వైకాపా అభ్యర్థి రఘురామకృష్ణంరాజుపై ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టిడిపి రెండోస్థానంలో నిలవగా ‘నాగబాబు’ మూడోస్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ వైకాపా అకృత్యాలకు పాల్పడుతుందని, కనీసం పార్టీ జెండాను కూడా కట్టుకోనివ్వడం లేదని కార్యకర్తలు ‘పవన్‌’కు ఫిర్యాదు చేయగా, ఇక్కడ అన్నీ ‘నాగబాబు’ చూసుకుంటారని చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చినట్లైంది. ‘జనసేన, బిజెపి’ పొత్తుతో ‘నాగబాబు’ పోటీ చేస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అయితే ‘టిడిపి,జనసేన’ కలిసి పోటీ చేస్తేనే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైకాపా తరుపున గెలిచి తరువాత ఆ పార్టీ అధినేత ‘జగన్‌’పై మడమతిప్పని పోరాటం చేస్తోన్న ‘రఘురామకృష్ణంరాజు’ ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారనే ప్రశ్న వస్తోంది. ‘నాగబాబు’ టిడిపి, జనసేన అభ్యర్థి అయితే ప్రస్తుతం ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న ‘రఘురామ’ పరిస్థితి ఏమిటి..? ‘నాగబాబు’ను కాదని ‘రఘు’కు ‘టిడిపి’ టిక్కెట్‌ ఇస్తుందా..? లేదా ఉమ్మడి అభ్యర్థిగా ‘రఘు’ను పోటీ చేయిస్తారా..? ఇలా చేస్తే ‘నాగబాబు’ పరిస్థితి ఏమిటో..? మొత్తం మీద..‘నర్సాపురం’ నియోజకవర్గం గత రెండున్నరేళ్ల నుంచి నిత్యం వార్తల్లో ఉంటోంది. ఇప్పుడు ‘నాగబాబు’ వల్ల మరోసారి వార్తల్లోకి వచ్చేలా ఉంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ