WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫించన్‌ కావాలా...వయస్సు పెంచుకో....!

వృద్ధాప్య ఫించన్ల కోసం ఆధార్‌ కార్డుల్లో తమ వయస్సును ఐదు నుంచి పదేళ్ల వరకు పెంచుకుంటున్న వైనం చాలా జిల్లాల్లో బయటపడుతున్నాయి. తమ అనుచరులకు ఫించన్లు ఇప్పించడం కోసం గ్రామాల్లో అధికార, విపక్ష చోటా నాయకులు ఈ విషయంలో చాలా హడావుడి చేస్తున్నారు. చాపకింద నీరులా ఈ ధరఖాస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సుమారు ఐదు లక్షల ఫెన్షన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో అనర్హులను అందలం ఎక్కించి..అర్హులను పక్కనపడేసేందుకు రంగం సిద్ధమైందని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఈ తతంతగం సాగగా, తరువాత పాలకులు కళ్లు తెరిచి బోగస్‌ ఫెన్షన్‌దారులను ఏరిపారవేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో లక్ష మందికి పైగా అనర్హులకు ఫించన్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఫించన్‌ పొందిన వారిలో వికలాంగులు కాని వారు, వృద్ధులు కాని వారు, వితంతువులు కాని వారు..అంతే కాకుండా ఒక్కో ఇంటిలో ముగ్గురు లేదా నలుగురికి ఫించన్లు ఇవ్వడం జరిగింది. ఆయా ఫించన్లల్లో కొన్నింటిని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయగా తాజాగా అదేబాటలో గ్రామాల్లో చోటా నాయకులు వెళుతున్నారు. ఆధార్‌కార్డులో వయస్సు పెంచుకోవడంపై అధికారుల్లో ఒత్తిడి తెస్తున్నారు. లంచాలు ఇచ్చి కూడా సరి చేసుకుంటున్నారు. ఈ ఫించన్లు కోసం ఆధార్‌కార్డు వయస్సే ప్రామాణికం కావడంతో, ఇప్పటికి చాలా మంది వయస్సును పెంచుకోవడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ అధికారి వయస్సుపై సర్టిఫికేట్‌ ఇవ్వాల్సి ఉండగా..ఆ పద్దతి లేకుండా చేశారు. 

  గతంలో ఈ విధంగా వయస్సు పెంచడాన్ని నిషేదించిన ప్రభుత్వం..తరువాత కొంత వెసులుబాటు కల్పించారు. స్వంతంగా డిక్లరేషన్‌ ఇస్తే..సరిపోతుంది. దీంతో బోగస్‌ డిక్లరేషన్‌ ఇస్తూ..యాభై సంవత్సరాలు ఉన్నవారు కూడా తమకు 65 సంవత్సరాలు ఉన్నట్లు డిక్లరేషన్‌ ఇస్తున్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల ద్వారా ఫించన్ల దారులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ సభ్యులే వయస్సు మార్చుకునే విధంగా సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిజమైన అర్హులకు మళ్లీ ఫించన్లు ఇస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆధార్‌ కార్డుతో వయస్సు పెంచుకున్న ప్రబుద్దులు, రేషన్‌కార్డుల్లో కూడా తమ వయస్సును మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెవిన్యూ సిబ్బంది కూడా అధికారపార్టీ నాయకులకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో మండలానికి వెయ్యి నుండి 2వేల మంది వరకు ఈ విధంగా వయస్సును పెంచుకుంటున్నారని కలెక్టర్లకు సమాచారం అందింది. త్వరలో విడుదల కానున్న ఫించన్‌ లబ్దిదారుల్లో ఈ విధంగా వయస్సు పెంచుకున్న వారికెవరికీ ఇవ్వకుండా ఇంతకు ముందు పెండింగ్‌లో ఉన్న అర్హులకు మాత్రమే ఫించన్లు ఇవ్వాలని 'చంద్రబాబు'కు సూచిస్తున్నారు. బోగస్‌ అర్హులల్లో ఎక్కువగా అధికారపార్టీ సానుభూతిపరులే ఉన్నారు. కొన్ని గ్రామాల్లో విపక్షాలకు చెందిన వారిని కూడా దీనిలో చేరుస్తున్నారు. ఏది ఏమైనా..ఫించన్ల కోసం వయస్సు పెంచుకున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్హులైన వారికి లబ్ది చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నారు.

(89)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ