WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రభుత్వంపై కక్షకట్టిన 'ఐవైఆర్‌' శిష్యులు...!

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ 'ఐ.వై.ఆర్‌.కృష్ణారావు' ప్రభుత్వంపై చేస్తోన్న పోరాటం కొత్త రూపును సంతరించుకుందని ఆయన సహచరులు, ప్రతిపక్షపార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న తన 'శిష్యుల'తో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతూ కక్ష తీర్చుకుంటున్నారని వారు చెబుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తనను అకారణంగా తొలగించారని కోపంతో ఉన్న 'ఐవైఆర్‌' తరువాత..రాజధాని అమరావతి,సిఎంఒ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై బహిరంగంగా ధ్వజమెత్తారు. తాజాగా రాష్ట్ర డీజీపీ నియామకం వ్యవహారంలో కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనిపై కోర్టుకు వెళతానని కూడా ప్రకటించారు. ఇన్నాళ్లూ 'ఐవైఆర్‌' ఒక్కటే ప్రభుత్వంపై పోరాడుతుండగా..ఇప్పుడు..ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆయన శిష్యులు ఆయన సహకరిస్తున్నారని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. 'ఐవైఆర్‌' ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు తన శిష్యులను వివిధ హోదాల్లో నియమించారు. వారు ఇప్పుడు ఆయనకు సహకరిస్తున్నారు లేదా...ప్రభుత్వాన్ని తమ చర్యల ద్వారా ఇబ్బందుల పాలుచేస్తున్నారు. కనీసం ఐదుగురు  కీలక స్థానాల్లో ఉన్న అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. వారు 'ఐవైఆర్‌'కు పరోక్షంగా సహకరిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. వారిలో ఒకరు ప్రతిపక్షనేతలతో కలసి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం 'నరేగా' పనుల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిందని..ఈ అధికారి ప్రతిపక్షనేతలకు చెప్పారని, వారు ఢిల్లీలో ఈ అక్రమాలపై ఫిర్యాదు చేయటంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయని వారు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా మరో అధికారి తనకు కీలక శాఖ కేటాయించలేదని సిఎంఒలో అవకతవకలు జరుగుతున్నాయని 'ఐవైఆర్‌'కు ఉప్పందిస్తున్నారట. సిఎంఒ కార్యాలయం సరిగా పనిచేయటంలేదని, వారు రికార్డులు మెయిన్‌టెన్‌ చేయడం లేదని..ఐవైఆర్‌ కేంద్రానికి లేఖలు రాయడం వెనుక ఇదే అధికారి ఉన్నారట. 

  అదే విధంగా 'ఐవైఆర్‌' మరో శిష్యుడు తనకు ఇష్టమైన శాఖ ఇవ్వలేదని, గత కొంతకాలంగా అనారోగ్యాన్ని సాకుగా చూపుతా సెలవుపై వెళ్లారట. ఆయన దారిలోనే మరో కీలక స్థానంలో పనిచేస్తోన్న మహిళా అధికారి కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా 'ఐవైఆర్‌' పట్టుపట్టి కీలకమైన పదవి ఇప్పించిన మరో ఐఎఎస్‌ అధికారి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటంలోకి నెట్టింది. ఆమె చేష్టల వల్ల ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో ఆమె కావాలనే ప్రభుత్వాన్ని ఇరికించిందని వారు ఆరోపిస్తున్నారు. అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఈ మహిళా అధికారి ప్రజల మనోభావాలతో సంబంధం ఉన్న సమస్యపై రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తీవ్ర ఇక్కట్లోకి నెట్టింది. ఈ అంశంపై ఇప్పుడు ప్రభుత్వం కిందా మీదా అవుతోంది. ఆమె చర్య తీసుకుంటే..ఓ ఇబ్బంది..తీసుకోకపోతే మరో ఇబ్బంది. ఇప్పటికే ఆ అధికారి తన కులాన్ని అడ్డుపెట్టుకుని..టిడిపిని సమర్థించే సామాజికవర్గం వారే తనపై బురద చల్లుతున్నారని ఆరోపిస్తోంది. మొత్తం మీద...'ఐవైఆర్‌' బయట నుంచి ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తుంటే...ఆయన శిష్యులు మాత్రం ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి అపఖ్యాతి తెస్తున్నారు. మరి ప్రభుత్వంలో ఉంటూ..ఈ విధంగా వ్యవహరిస్తున్న వారిపై 'చంద్రబాబు' ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.


(594)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ