WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోడి పందాలు నిర్వహిస్తే...జైలుకెళ్లక తప్పదేమో...!

సాంప్రదాయాల పేరుతో కోడి పందాలను నిర్వహిస్తూ వందల కోట్లు రూపాయలు పందాలు కాయడంపై ఆగ్రహం చెందిన హైకోర్టు..ఇక నుంచి పందాలు నిర్వహించకూడదని స్పష్టమైన తీర్పును ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసిన బిజెపి నాయకుడు పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు సాంప్రదాయాలను వినిపించి కత్తులు లేని కోడి పందాలు నిర్వహించడానికి అనుమతి పొందారు. 2015-16లో ఈ విధమైన అనుమతి పొందడంతో కోడి పందాల జోరు ఉత్సాహంగా ప్రారంభం కాబోతోంది. హైకోర్టులో పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ పందాలపై కేసు దాఖలు చేసి అక్కడ జరిగే పందాలను వీడియో సాక్ష్యాలను అందజేశారు. ఒకవైపు కత్తులు లేని కోడి పందాలు నిర్వహిస్తామని అనుమతి పొందిన నిర్వహకులు, మళ్లీ కత్తులతోనే కోడిపందాలను నిర్వహించారని బయటకు పొక్కింది. పోలీసులు ఎంత పకడ్బందీగా, బందోబస్తు నిర్వహించినా,ఉన్నతాధికారుల వరకే పరిమితం అవుతుంది. మండల స్థాయి నుండి రెవిన్యూ స్థాయి వరకు లక్షల ముడుపులు వారికి ముడుతున్నాయని, దీంతోవారు సక్రంగా బందోబస్తు నిర్వహించడం లేదని, దీనిని తాము ఏవిధంగా ఆపగలమని ఉన్నతాధికారులు పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. సాంప్రదాయాలు పాటించడాన్ని తాము తప్పుపట్టడం లేదని, పాలకపక్షమే కోడిపందాలను నిర్వహించడం, వందలకోట్ల రూపాయలు పందాలు కాయడం సాంప్రదాయమా..? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

  కోడి పందాల నిర్వహకుల్లో అధికార,విపక్షాల, మిత్రపక్షాల నాయకులు కలసికట్టుగా వ్యవహరించడం విశేషం. రెండు, మూడు రోజులు అందరూ కలసిమెలసి పందాలు నిర్వహిస్తారు..భారీ ఎత్తున్న ఆదాయాన్ని సంపాదించుకుంటారు. గాన,భజానాలతో ఆయా ప్రాంతాల్లో ఒక ఆనందాన్ని తాము పెంపొందించినట్లు వారు ఫీలవుతారు. కోడి పందాల నిర్వహణపై అధికారపార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలుసార్లు నచ్చచెప్పినా..ఏ ఒక్కరిలో మార్పురాలేదు. ముఖ్యంగా అగ్రకులానికి చెందిన గోదావరి జిల్లా నాయకులే..తమ అనుచరవర్గాల ద్వారా కోడి పందాల నిర్వహణకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత సంవత్సరం జిల్లా స్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ మండల స్థాయి అధికారులకు భారీ ఎత్తున్న నజరానాలు ముట్టాయి. ఇదే విషయంపై అప్పట్లో ఆ జిల్లాకు చెందిన ఎస్పీ కోడి పందాల్లో ఎవరెవరు పాల్గొన్నారో..ఎన్ని వందలకోట్లు చేతులు మారాయి..అని పూర్తి ఆధారాలతో నివేదిక అందజేశారు. కానీ పాలకులెవరూ ఎవ్వరిపై చర్యలు తీసుకోకుండా సాంప్రదాయాలపేరిట మెతక వైఖరి అవలంభించారని అధికార,విపక్షనాయకులందరూ కోడి పందాల నిర్వహణకు తెరవెనుక ఉండి మద్దతు ఇవ్వడమే కాకుండా కత్తులు కట్టకుండా పందాలు నిర్వహిస్తామని అనుమతి పొంది..కత్తులతో పందాలు నిర్వహించినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో హైకోర్టు ఆంక్షలను పట్టించుకోలేదని, దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డిజిపికి మండల స్థాయి అధికారులకు, పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ అధికారులకు నోటీసులు జారీ చేయాలని గురువారం ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోడి పందాలతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వాటిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో పిటీషన్‌ దాఖలు అయింది. ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించరాదని, గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదు..22వ తేదీన పూర్తి స్థాయి నివేదికను తనకు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ సారి కోడి పందాలు నిర్వహిస్తే కోర్టు ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికార,విపక్ష,మిత్రపక్షాల నాయకులు జాగ్రత్తలు తీసుకోకున్నా..కోడి పందాల నిర్వహకులకు వెనుకుండి వెన్నుతట్టినా.. రుజవులు లభించినా..ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కానీ..హైకోర్టు కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. జనవరి13,14 తేదీన కోడి పందాలు నిర్వహిస్తారా..? నిర్వహిస్తే కత్తులు లేకుండా నిర్వహిస్తారా..? కోర్టు తీర్పును గౌరవిస్తారా..? నిర్వాహకుల స్పందన ఏమిటి..? వారి వెనుక ఉన్న రాజకీయవర్గాల ఆలోచన మరో వారం రోజుల్లో బయటపడనుంది.


(250)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ