విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో 'రాజకీయాలా...'!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో 'రాజకీయాలా...'!?

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎట్టకేలకు రాజకీయాలపై తన మౌనం వీడి తాను..రాజకీయపార్టీని స్థాపిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆయన రాజకీయపార్టీ పెడతారని..ఆయన అభిమానులు సుమారు 20సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే వారు ఆశించిన విధంగా పార్టీని ఏర్పాటు చేయకుండా వారిని ఊరించి..ఊరించి అన్యమనస్కంగా చివరకు పార్టీని పెడుతున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై ఆయన అభిమానుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతుండగా..మరోవైపు రాజకీయ విశ్లేషకుల్లో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఆయన పార్టీ ఏమిటి..? ఆయన లక్ష్యాలు ఏమిటి..? అనే విషయాలను పక్కన పెడితే...ఆయన పార్టీ ఏర్పాటుకు ఎన్నుకున్న సమయం సరికాదని వారు అంటున్నారు. 

   వాస్తవానికి తమిళనాడులో 'జయలలిత' మృతి చెందిన తరువాత...మరో రాజకీయపార్టీకి కావాల్సిన గ్యాప్‌ బాగానే ఉంది. 'జయ' మృతితో అన్నాడిఎంకె ఈ రోజు కాకపోతే..రేపైనా చిన్నాభిన్నమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ గ్యాప్‌ను పూరించడానికి 'రజనీకాంత్‌'కు అవకాశం ఉంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు..అవాస్తవం లేదు..కానీ..పార్టీ ఏర్పాటు చేయాల్సిన సమయంలో చేయకుండా..ఆయన జీవితంలో చరమాంకంలో ఉన్న సమయంలో పార్టీని ఏర్పాటు చేస్తున్న ప్రకటించడంపై రాజకీయవిశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ వయస్సులో ఆయన పార్టీ ఏర్పాటు చేసి...సాధించేదిమిటి..? అనే ప్రశ్న వారి నుంచి వస్తోంది.

   ప్రస్తుతం 'రజనీ' వయస్సు 67 సంవత్సరాలు. మరో మూడు సంవత్సరాలకు కానీ...తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగవు. అప్పటికి ఆయనకు 70 సంవత్సరాలు నిండుతాయి. ఈ వయస్సులో ఆయన ముఖ్యమంత్రి కాగలరా..? ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయినా...ఆయన ఆరోగ్యం పాలనకు సహకరిస్తుందా..అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వాస్తవానికి రాజకీయాల్లో 70సంవత్సరాల వయస్సు అంటే..రాజకీయాల నుంచి నిష్క్రమించే వయస్సు. ప్రస్తుతం కేంద్రంలోని 'మోడీ' ప్రభుత్వం 70సంవత్సరాల వయస్సు దాటిన వారెవరినీ మంత్రి పదవుల్లో కొనసాగించడం లేదు. పలువురు సీనియర్‌ నాయకుల  వయస్సు మీరిందని 'మోడీ' వారిని క్యాబినెట్‌ నుంచి సాగనంపారు...! బిజెపిలో ఉద్ధండులైన 'ఎల్‌.కె.అద్వానీ, మురళీమనోహర్‌జోషి' వంటి నాయకులకు మంత్రి పదవులు ఇవ్వలేదు. దీనికి ఆయన చూపించిన కారణం వయస్సే...! ప్రస్తుతం రాజకీయాల్లో యువత హవా కొనసాగుతున్న పరిస్థితుల్లో   వయస్సు మళ్లిన తరువాత...ఆయనేం రాజకీయాల్లో రాణిస్తారనే ప్రశ్న  విశ్లేష‌కుల నోటి నుంచి వ‌స్తోంది. ఎప్పటి నుంచో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారు 70సంవత్సరాల వయస్సు తరువాత దాదాపు విశ్రాంతికే పరిమితమవుతున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో..రాజకీయాల్లో దూకుడుగా వెళ్లాలంటే..అయ్యే పనేనా..? ఏమో...మరి తమిళ సూపర్‌స్టార్‌ ఏమి చేస్తారో..చూద్దాం...!


(742)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ