WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణాకు ర్యాంకుల ప్రవాహం...!

ర్యాంకులు అంటే ఇదేదో...విద్యాసంస్థలకు వచ్చే ర్యాంకులు అనుకుంటున్నారా...? కానే కాదు...ప్రతిసారీ మొదటి ర్యాంక్‌ సాధిస్తున్న కృష్ణా జిల్లా గురించి. పథకమైనా, కార్యక్రమమైనా... ఏదైనా కానివ్వండి...కృష్ణాకు ర్యాంక్‌ రావాల్సిందే...! కృష్ణా జిల్లాను కాదని...వేరే జిల్లా ర్యాంక్‌ సాధించే పరిస్థితి ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో కనిపించడం లేదు. గత ఏడాది నుంచి కృష్ణా జిల్లాకు వచ్చిన ర్యాంకులను పరిశీలిస్తే...ప్రతి దానిలోనూ ముందంజ జిల్లాదే...తాజాగా మరో మొదటి ర్యాంక్‌ సాధించి...ర్యాంకుల్లో తనకు తిరుగులేదని నిరూపించింది కృష్ణా జిల్లా అధికారయంత్రాంగం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా అధికారయంత్రాంగం పనితీరు చూసి ముగ్దులైపోయి...ఆ జిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం'ను చూసి ఇతర జిల్లాల కలెక్టర్లు నేర్చుకోవాలని హితవు పలికారంటే...ఆ జిల్లా పనితీరు ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలను పొందిన జిల్లా యంత్రాంగం ఇప్పుడు మరో ర్యాంక్‌ సాధించింది. 'చంద్రన్నకానుక'లో పంపిణీలో జిల్లా మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. దీనితో పాటు సాధికారమిత్ర క్లస్టర్స్‌ ఏర్పాటు, లోన్లకు లింకేజ్‌సౌకర్యాలను కల్పించడంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 'చంద్రన్న సంక్రాంతి కానుక'ల్లో మొత్తం 12,38,611 ధరఖాస్తులు రాగా వాటిలో 8,82,106 మందికి పంపిణీ చేశామని, 71.21శాతంతో మొదటి స్థానంలో తాము నిలిచామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంలో నోడల్‌ అధికారులు బాగా పనిచేస్తున్నారని కలెక్టర్‌ వారిని అభినందించారు. సాధికార క్లస్టర్స్‌ను వందశాతం పూర్తి చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అధికారయంత్రాంగం మొత్తం నడుచుకుంటూ ఫలితాలను సాధిస్తుందని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించిన ప్రతి కార్యక్రమంలోనూ కృష్ణా జిల్లా ముందువరసలో నిలవడం అభినందించవలసిన విషయమే.


(543)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ