WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రిపబ్లిక్‌ డే శకటాల ఏర్పాటులో వివక్ష...!

మొదటి రౌండ్‌లోనే తెలంగాణ అవుట్‌...!

చివరకు వరకు పోరాడిన 'ఆంధ్రా'...!

దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష అంటోన్న అధికారులు...!

ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో రిపబ్లిక్‌డేను పురష్కరించుకుని జరిగే కవాతు సందర్భంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వశాఖ వారిచే నిర్వహించే శకటాల ప్రదర్శన కోసం నిర్వహించే పోటీలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. మనదేశ మిలటరీ శక్తి, వారసత్వ, సాంస్కృతిక,చారిత్రక, కళా సంపదన తెలిపేలా శకటాలను రూపొందించి కవాతులో ప్రదర్శిస్తారు. మొత్తం 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు ఈ కవాతు సందర్భంగా ఆయా శకటాలను రూపొందించే ఆచారం ఉంది. వీటిలో ఈ సంవత్సరం 15 రాష్ట్రాలు మాత్రమే అర్హత సాధించాయి. జమ్మూ-కాశ్మీర్‌తో పాటు ఈశాన్యరాష్ట్రాలు ఈ కవాతులో ప్రతి సంవత్సరం తప్పక పాల్గొంటాయి. అయితే గత కొన్నాళ్లుగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ కవాతులో పాల్గొనే అవకాశం లభించడంలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురవుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సులువుగానే ఆంధ్రప్రదేశ్‌ శకటం కవాతులో ఉండేది. కానీ విభజన తరువాత మాత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు పాల్గొనే అవకాశాన్ని అధికారులు ఇవ్వడం లేదు. పలు కారణాలతో తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తిని కమిటీ తోసిపుచ్చుతోంది. మొత్తం మూడు దశల్లో కమిటీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తిని మొదటి రౌండ్‌లోనే కమిటీ తిరస్కరించగా...ఆంధ్రప్రదేశ్‌ మాత్రం చివరి వరకు పోరాడి తుది రౌండ్‌లో వెనుతిరిగింది. గత నాలుగేళ్ల నుంచి ఆంధ్రా నుంచి రిపబ్లిక్‌డే కవాతులో శకటాల ప్రదర్శన జరగడం లేదు.

    కాగా..కావాలనే ఆంధ్రప్రదేశ్‌ను పక్కనపెడుతున్నారనే అభిప్రాయం అధికార వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. వివిధ శకటాల ఆకృతులను అధికారులు ఎంతో కష్టపడి రూపొందించినా..వాటిని తిరస్కరిస్తున్నారనే విమర్శ ఉంది. ఇదంతా కావాలనే చేస్తున్నారని..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, వాటిని జాతీయస్థాయిలో ప్రదర్శించడం కొందరికి ఇష్టం లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్‌ శకటాలను ప్రతిసారీ తిరస్కరిస్తున్నారనే ఆవేదన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ సంవత్సరం ఎలాగైనా కవాతులో మన రాష్ట్ర శకటం ఉండాలని అధికారులు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. దానిలో భాగంగా ఎంతో ప్రాచీన,సాంస్కృతిక విశిష్టత ఉన్న  'శవర'ను ఎంపిక చేసుకున్నారు. 'సవర' అనేది 3.8 లక్షల మంది మాట్లాడే ప్రాచీనమైన భాష. 'సవర'కు ప్రత్యేకమైన సాహిత్యం ఉంది. అంతే కాకుండా పాటలు, ఆటలతో పాటు స్వంతమైన వ్యవసాయవిధానం ఉంది. ఇటు వంటి దాన్ని ఎన్నుకుని దీనిపై శకటాన్ని రూపొందించుకుని అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే..దీన్ని కూడా కేంద్ర కమిటీ తిరస్కరించింది. మొత్తం మీద రాజకీయ కారణాలతో పాటు, దక్షిణాది వివక్ష కూడా ఈ ఎంపికలో నిర్ణయాత్మక పాత్రపోషిస్తుందని సదరు అధికారులు అంటున్నారు. ఇప్పటికే దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం ఎక్కువైపోతుందన్న భావన ఉన్న సమయంలో ప్రతిసారి ఇటువంటి అరుదైన కార్యక్రమాల్లో ఈ ప్రాంతాలకు స్థానం లేకుండా చేస్తే...దక్షిణాది 'జనం' చిన్నబుచ్చుకోవడం ఖాయం.


(760)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ